Skip to main content

శ్రీ శోభకృత్ ఆషాఢ మాసం 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఆషాడ మాసం 
పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీ
*******"
నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
***********
అంశం : హరివిల్లు 
**********
కవివరుల జాబితా 

1/27 కవిత వెంకటేశ్వర్లు

2/26 వాకిటి రాంరెడ్డి

3/25 కొంజేటి రాధిక

4/24 ఏడెల్లి రాములు

 5/23 సయ్యద్ జహీర్ అహ్మద్

 6/22 లలితా చండి

7/21 గొర్రెపాటి శ్రీ ను

8/20 వావిలిపల్లి రాజారావు

 9/19 తిప్పావఝల నరసింహ మూర్తి

10/18 సింహాద్రి వాణి

11/17 బాలు కత్తుల

 16/12.వేదాంతం సురేష్ బాబు

17/11.చయనం అరుణా శర్మ

18/10 పిన్నక నాగేశ్వరరావు

19/09 సౌజన్య

20/08 దారల విజయ కుమారి

21/07  డా.భమిడిమఱ్ఱి కమలా దేవి

22/06 వాణిసరోజని లక్కరాజు

 23/05 దీపక్ న్యాతి

24/04.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు

25/03.డా.నాగలక్ష్మి తంగిరాల

26/02.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు

 27/01 వేమూరి సత్యవతి

28/a డాక్టర్ బల్లూరి ఉమాదేవి

29/b  అపరాజిత రెడ్డి గారు 
 
30/c కోరాడ నరసింహారావు గారు 

31/d .డా.సి.హెచ్.ఆంజనేయులు గారు
...........,.....................
అంశం 
ఇంద్రధనస్సు

*********
 1/27
శీర్షిక:: ఇంద్ర చాపము

మార్తాండ మయూఖాలు
సన్నని జలాధారాల చినుకులు
ఎండ నీడలా కలయికలో
ఏర్పడును ఆకాశాన ఇంద్రచాపము
ఏడు రంగులతో కూడిన శిల్పము
ఆ దృశ్యము అనల్పము
దైవ సంకల్పాన అద్దిన వర్ణాల విచిత్రము
పిల్లలకు ముదావహము
పెద్దలకు సంతోష సందోహము
ఉదా రంగు ఉత్సాహానికి
ఎరుపు ఉద్యమానికి ఐకమత్యానికి
ఆరెంజ్ ప్రేమ తత్వానికి
నీలం సంద్రానికి శ్రీకృష్ణునికి
ఆకుపచ్చ హారితానికి
పసుపు ముత్తైదువులకు దైవకార్యాలకు
తెలుపు ధర్మానికి న్యాయానికి ప్రతీకలు
సప్త వర్ణాలతో విరాజిల్లుతూ
హరివిల్లుగా ప్రఖ్యాతి నొందుతూ
సప్త ఋషుల మండలానికి ధీటుగా
ఏడువారాలకు సాక్షిగా
ఏడు లోకాలకు ఏలికగా
సప్త వన్నెల విల్లై 
అయ్యప్పస్వామి చేతిలో ధనువై
రాక్షస సంహారానికి మూలమై
విఖ్యాత మైన ఇంద్రధనుస్సు
పసి పిల్లల మనస్సు
సూర్య కాంతి తేజస్సు
పొందినది ఎనలేని యశస్సు!!

 2/26
అంశం :: ఇంద్ర ధనుస్సు 

మనిషి ఊహలకు రెక్కలొస్తే 
పరావర్తనమై ప్రకాశించును 
జ్ఞాపకాలే వెలుగుల గగణమై 
ఇంద్రధనస్సులా వికశించును   

సంసారం స్వేదబిందు సంద్రమై 
సగటు బతుకు చిన్నాభిన్నమై 
పురివిప్పిన మణి చందనమైతే   
సప్తవర్ణ సంగీతమే ఇంద్రధనస్సు 

రేపటి ఉషస్సుకై మేల్కొంటు                                      
మేధోమదనంతో పరిగెడుతూ 
అంతరంగ భావనల నిచ్చెనేస్తూ 
చెంద్రవెన్నెల్లో నిత్యం విహరించు 

ఆశల పల్లకిలో ఆనందం చెంది 
ఆత్మబలంతో అన్నింట చేదించి 
పరిపూర్ణ తత్వంతొ ప్రకాశించే   
సంపూర్ణ మనసే ఇంద్రధనస్సు

3/25
అంశం... ఇంద్ర ధనుస్సు

రంగుల లోకంలో రంగురంగుల మనుషులు ఉంటారని,
 రంగులు మారుస్తుంటారని నింగిలో విరబూసిన రంగుల హరివిల్లును చూసే రంగురంగుల పూలకు నామకరణం చేశారేమో కదా...
 సప్తవర్ణాల ఇంద్రధనస్సు నింగికే కొత్త అందాన్ని తెచ్చి నింగి, నేల కలిసినట్టు ఉంటే అత్యద్భుతమైన ఊహాచిత్రంగా ఉందిగా ఏ కవి మదిలో మెదిలిన మెదిలిందో కదా...
ప్రకృతి ప్రసాదించిన ఎన్నెన్నో రంగులన్నీ ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క రంగును ఆపాదించుకుని ఆస్వాదిస్తున్నట్టు సప్తవర్ణాలను ఇముడ్చుకున్న రంగుల మరి కో కదా...
మదిలోని హావభావాలకు రూపకల్పనగా ఒక్కో రంగు ఒక్కో భావనను ప్రతిపలింత చేస్తూ అందమైన నింగి గుడిలో ఎంత ఉంది కదా ఒదిగాయో కదా...
వర్షపు జల్లులతో జతకట్టి రుతుపవనాల సమయాన పలకరిస్తూ,
 మనసుకు ఆనందాన్ని కలిగించి,మదికి పసందును కలిగిస్తూ
 ప్రతి కళ్ళను మెరపిస్తూ, మరపిస్తూ మైమరపిస్తూ మెరుపు బాణమై, ప్రేయసిల క్షణంగానూ నిలువక కనుమెరుగయ్యే కమనీయ నీళ్ళు కానుక...
మనిషి ముఖంలో మారే హావభావాల రంగులు మాత్రం హరివిల్లు కనపడవు ఎంత వెతికినా.

4/24
శీర్షిక*అమ్మవారి ముక్కుపుడక 

చిరుజల్లులదెంత వైభవమో
సూర్య కిరణాలు తాకగానే
ఏడురంగులుగా వికిరణం
సృష్టి సృజనలో బ్రహ్మకమలం

నీలాల నింగినపూసే సింగిడి
బాలల చూపులకు పూబోని
పురివిప్పిన మయూరాల నాట్యకేళి
లేలత చిగురాకుల వసంతాలహేళ 

మీనాక్షీ అమ్మవారి ముక్కుపుడక
ఆకాశాన హరివిల్లుగా మెరియగా
మేఘాల రాగాల పల్లకిలో గాంధర్వుల కీర్తనం 

నరుడి యవ్వనమైనా
రాజ్యాధికారుల పటాటోపమైనా
ఆవిరయ్యే ఇంద్రధనస్సు 🌈
మంచిని ఎత్తుకుంటే కీర్తి హిమశిఖరం
ముంచే పనులు చేస్తే అపకీర్తి
పాపపంకిలం

బతుకు చాలా చిన్నది
సేవా భావమే జీవన పెన్నిధి

 5/23
       *హరివిల్లు*

అవి కంటికి కనపడే 
రంగు రంగుల చిత్రం
చీకటి బతుకులపై
రంగరించిన ప్రకృతి చిత్రం!
నిశ్చల బంధుర తటాకంపై
దినమణి మయూఖ సోక
దీన పరావర్తనం చెంది
నీలాల నింగిపైకి వంగి వంగి సప్త వర్ణాల హరివిల్లు! 
సప్తపది ప్రదక్షిణంలో
కానరాని
జంట బతుకులా వెన్నంటిన
సప్త వర్ణాల విల్లు 
ఆకాశ దేశాన 
ప్రకృతికి ద్వారాతోరణం
నిరుపేద కుటుంబాలకు
నేత్రపర్వంగా 
నీల నీల గగనాల శోభిత ఇంద్రచాపం
కళాకారుని చేతిలో
మెరుగులు దిద్దిన
అరుదైన కళాఖండం!

యాంత్రిక జీవనశైలిలో
మధురానుభూతి పొందలేని స్వప్న శకలం

 6/22
*
*ఇంద్రధనస్సు* 


అంబరాన అందరిని అలరించేది 
సుర రాజు ఎక్కపెట్టని ధనువు
ఆకాశంలో అరుదైన అందమైన చిత్రం      
 పసితనం నుంచి వింతగా అనిపిస్తూ 
అప్పుడప్పుడూ గగనాన 
సప్త వర్ణ వయ్యారల వంపుతో
కనువిందు చేసే రమనీయ దృశ్యం
అరుదైన సప్త వర్ణాల ధనవు 
ఎవ్వరికి అందేది లేదు ఎక్కు పెట్టేది 
ఎక్కువ సేపు నిలిచేది లేదు
నీలాల నింగిలో మెరుస్తూ
కలసి వుంటేనే కలదు అందం 
ఆనందం అంటూ
వర్ణాలు ఎన్నో వున్నా!
వద్దాన్నా వీడని వర్ణ భేధాలున్నా!
 ఆషాఢం చినుకుల మధ్య 
 శ్రావణంలో మేఘమాలలు    
 కురిపించే జల్లుల నడుమ
 భానుని కిరణ రాగ సంజనిత
 చిరునవ్వుల ఒయ్యారి
  కనువిందు చేసే ఇంద్రధనస్సు .

7/21
కవిత
*
నీ జతలో..

వేవేల వెన్నెల్ల సాక్షిగా
నీ అడుగుల జతగా నడుస్తున్నా..!
సెలయేటి గలగల ల సవ్వడుల నడుమ
కొండ కోనల వెంట నువ్వు కదులుతుంటే
నీ అడుగుల జతగా నడుస్తున్నా..!
నీలాల నింగిలో మెరిసే హరివిల్లు
సప్తవర్ణాల శోభలతో ఆకాశాన నిలిస్తే
ఇంద్రధనస్సు ల నీడల్లో
నీ అడుగుల జతగా నడుస్తున్నా..!
రేతిరి ని గడవనీయకుండా సుస్వప్నాలేవో
స్వగతాలై కళ్ళముందు అందంగా ఆవిష్కృతమవుతుంటే
కమ్మని కలల జడిలో తడిసి ముద్దవుతూ
నీ చేయి పట్టుకుని..నీ అడుగుల జతగా కలిసి నడుస్తున్నా..!
రేపటి ని పరిచయం చేసే ప్రణయాల సంబరానివి నువ్వు !
అందమైన జీవితాన్ని కానుకగా ఇస్తూ ..
ఆనందభరితమైన సమ్మొహనాల చిరునవ్వుల సరాగాల ని వినిపిస్తూ..
నువ్వు తోడై వుంటే ..మనం నడిచే దారంతా పసిడి కాంతుల మయం
..సుమ సౌరభాల పరిచయం !

8/20
ఆకాశాన విరబూసే వింత (కవిత)

ఇందు రేఖలా 
 సింధూరపు చీరలా
 సంధ్యా సమయాన
 కనిపించు అంబరములా
 విశ్వంబరానికి ఇరువైపులా
 రెండు అంచులను తాకుతూ
 గగనాన జన్మించు ఇరమ్మదం
 ఇంద్రకీలం వంగినట్లు
 ఇంద్రలోహం,
 ఇంద్రనీళo,
 ఇందుకాంతం,
 మరకతంలు
 పొదిగిన హారంలా గోచరించు
 అంతరిక్షాన
 ఇందీవరుడు సంధించిన విల్లు
 సప్త వర్ణంల కాంతిపుంజం
 వాన ధారలకు జన్మకుండలి
 నీటి అణువులతో
 రవి కిరణాలు గావించు
 అంతః పరావర్తనం
 విడిపోవు బహు వర్ణాలుగా
 కలిగించు వింత అనుభూతి
 ఆకాశాన అల్లుకునే
 అబ్బురపరిచే హరివిల్లు

9/19
అంశం:ఇంద్రధనస్సు
శీర్షిక: సృష్టి కర్త -సుజనాత్మకత.


సృష్టికర్త ఎంతో సృజనాత్మకుడు.
ప్రకృతిలో సృష్టించాడు ఎన్నోఅందాలు
కనువిందు చేసే మరెన్నోఅద్భుతాలు.
ఎండావానా కలిసొస్తుంటే మనసుకు ఆహ్లాదం.
ఆసమయంలో హరివిల్లు సాక్షాత్కారం మనోపరవశం.
ఇంద్రధనస్సు అద్భుతమైన దృగ్విషయం.
చిరుజల్లులు పలకరించే సమయంలో ఆకాశంలో ఉంటాయి నీటీ బిందువులు.
వాటిపైకాంతిరేఖల ప్రసార ఫలితమే
వాన విల్లుసాక్షాత్కారం.
సప్తవర్ణ శోభితమై కనువిందు చేస్తుంది వక్రరేఖ..
సీతమ్మచీర భూమికి స్వర్గానికి నిచ్చెన.
భూమ్యాకాశాలను కలిపేది ఇంద్ర చాపం.
సింగిడి వీక్షణంతో హృదయం పరవశం
రసహృదయాలను రంజింప చేస్తుంది శక్ర ధనుస్సు.
వాన విల్లుతో వేస్తాడు మన్మధుడు బాణం.
అందంకాదు శాశ్వతం హరివిల్లులా
హృదయసౌందర్యం చేస్తుంది మనిషిని సప్తవర్ణ శోభితం.
బాదతప్తహృదయులు కారుస్తారు కన్నీటి బొట్లు.
ఆబొట్లకందిద్దాం ఓదార్పు కాంతి రేఖ.
వారి మనసులను విహరింపచేద్దాంవక్రరేఖలా.
మన జీవితాలను చేసుకొందాం సప్తవర్ణశోభితం అరివిల్లులా.

10/18
అంశం:-- ఇంద్రధనుస్సు

ప్రక్రియ:-- వచన కవిత్వం

ప్రకృతి ప్రసాదించిన ప్రతి అంశం, ప్రతి దృశ్యం మనిషికి విలువైన పాఠాలను బోధిస్తుంది సదా
తెలుసుకొని ప్రయాణించేందుకు మార్గాన్ని నిర్దేశిస్తుంది
సృష్టి ప్రసాదించిన అందమైన సప్తవర్ణాల తాత్కాలిక మనోహర అద్భుత దృశ్యం ఇంద్రధనుస్సు
సూర్యకిరణాలకు వ్యతిరేక దిశలో నీటి బిందువుల ద్వారా కాంతి పరావర్తనం చెందితే ఆవిర్భవిస్తుంది అర్థచంద్రాకారంలో
మురిపించే రంగుల జీవితం కూడా ఇంద్రధనుస్సులా బుద్బుధప్రాయమూ
అశాశ్వతమూ,క్షణభంగురమే
ముసురుకునే విలువలేని సుఖాలు మురిపిస్తాయి రంగురంగుల వలలు విసురుతూ ఇంద్రధనుస్సులా
మోసం,దగా,కుట్రలను ఆహ్వానిస్తూ,
దారుణ దురాగతాలకు స్వాగతం పలుకుతూ
మెరిసేదంతా బంగారం కాదని,
రాళ్ళన్నీ రత్నాలూ కావని
మనసును చెడు ఆకర్షణల వైపు పోనీయ వద్దనీ
నీతి,నిజాయితీ, పరోపకారం, మానవతాకాంతులే మనిషిజీవితంలో వెలుగుల్ని నింపి సుఖశాంతులను ప్రసాదిస్తాయనీ తెలుసుకొని బ్రతుకుబాటలో పయనించాలని ఉద్బోధిస్తుంది ఇంద్రధనుస్సు.

 11/17
ఇంద్రధనస్సు

ఇంద్రధనస్సులో 
ఒక్కొక్క సప్తవర్ణం 
ఒక్కొక్క ప్రకృతి సోయగం
సప్తవర్ణాల పువ్వులు
సప్తవర్ణాల చిరునవ్వులు
సప్తవర్ణాల సముద్రాలు
సప్తవర్ణాల జంతువులు
సప్తవర్ణాల జీవులు
సప్తవర్ణాల పక్షులు
సప్తవర్ణాల చెట్టు పుట్టలు
సప్తవర్ణాల కొండ కోనలు
ఇంద్రధనస్సులో ఉన్న రంగుల వోలె జీవితంలో రకరకాల మనసులు మనస్తత్వాలు ఉంటాయి
ఈ అఖండ భారతంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ఇంద్రధనస్సులో ఉన్న రంగులవలె చాటాలి
మానవత్వం నిండుగా పంచాలి

16/12
అంశం:- ఇంద్రధనుస్సు
***************************
చిరు చిరు జల్లులు ముత్యాల రాసులుగా
నేలను తాకిన శుభ సమయాన
పుడమి తల్లి పులకింతలతో
సువానలను పంచే వేళలో
భుగభుగ లాడే భానుని కిరణాలు
చల్లగా మారి భూమాత తనువును
ఆత్మీయంగా స్పర్షించిన వేళ
రంగు రంగుల వర్ణాల‌శోభలతో
స్వాగత తోరణాలు కట్టగా
ఏడడుగుల ఏడేడు‌ జన్మల
అనుబంధానికి ఆత్మీయతా భావాలకు
రారమ్మంటూ అగ్ర తాంబూలమిచ్చి
అనురక్తితో ఆహ్వానం పలికే వేళ
స్వచ్ఛమైన మనో యవనికపై
సప్త వర్ణాల అక్షరాలను అద్ది
మనసులోని భావ సుగంధ సుమాలను
ప్రతీ అక్షరంలో వికసింపజేసే వేళ
కారుమబ్బులు తొలిగి తటిల్లతలు
ఆశాజ్యోతులై అలరిస్తున్న వేళ
నింగికీ నేలకు సంబంధ బాంధవ్యాలు జోడిస్తూ
అనురాగాలు మార్గాన్ని సుగమం చేస్తూ
చిరునవ్వుల పువ్వులను పేర్చి
నేలతల్లి నుదిటి సింగారమై సింధూరమై
నునులేత బుగ్గలపై సిగ్గుల దిష్టి చుక్కై
యెదపై చెరగని పచ్చ బొట్టైంది ఇంద్రధనుస్సు

17/11
ఇంద్ర ధనుస్సు 

అల్లరిగాలి చల్లగ సోకగ
నల్లని మబ్బులు మెల్లగ కదిలె
వాన రాకకు వయ్యారి మయూరి
పురి విప్పి ఆడె పులకరించె

నింగికి నేలకు నిచ్చెన వేస్తూ
చిటపటమని చినుకులు కురిసె
వాగులు వంకలు పొంగి ప్రవహించె
పుడమితల్లి మదిలో పులకరింత
పరవశించినది ప్రకృతిమాత

వనమంతా పండుగ సందడి
పిన్న పెద్దలలో ఆనంద లాహిరి
వాన జల్లు కురిసి వెలిసినంత
దూదిపింజలై చెదిరె మబ్బులు 
తొంగి చూడగా భాను కిరణాలు
 సప్త వర్ణాలతో నింగిలో మెరిసె
ఏడు రంగుల ఇంద్రధనుస్సు
అంబరాన ఆహ్లాదంగా విరిసిన
ఆ వానవిల్లును చూచినంత
సంతోష రాగమై మురిసె మనసు

 18/10 
ఆషాఢమాస పౌర్ణమి కవితల పోటీకి....
శీర్షిక :-- ఇంద్ర ధనుస్సు.

1తే.గీ.
అద్భుతమగు ప్రకృతి మనకంద జేయు
తఱచుగ మనల నాహ్లాదపరచు చుండు
నింద్ర ధనుసును గని పిల్ల లెల్లరు కడు
సంతసమునొందు చుంద్రు కేరింతలిడుచు. 

2.తే.గీ.
ఇంద్ర ధనుసున గల రంగులేడటంచు
నందరెఱిగిన సత్యమే; యందులోని
రంగులన్నియు శ్వేత వర్ణమ్ము నుంచి
వచ్చిన వనుచు తెలిసిన వారలెంత
మంది యుందురో తెలియదు మహిని కనగ.

3.తే.గీ.
అనువగు పరిస్థితులు కల్గినప్పు డింద్ర 
ధనుసులుదయ,సాయంకాల తరుణమందు 
ప్రాగ్దిశను,పశ్చిమాన నేర్పడుచు నుండు
దినకరున కెదురుగ నుండు దిక్కునందు. 

4.తే.గీ.
కారు మేఘము లొక ప్రక్క క్రమ్మియుండి
వాన పడుచుండ, వేరొక ప్రక్క నుంచి
సూర్య రశ్మి వర్షమును చొచ్చుకొని పోవ
నది పరావర్తనము చెంది యందమైన
నేడు రంగులు కలిగిన యింద్ర ధనుసు
కారు మబ్బుల వైపున కానుపించు.

5.తే.గీ.
ఇందు విజ్ఞాన శాస్త్రమ్ము నిమిడి యుండె 
పట్టకములోకి కిరణమున్ బంప నదియు
చెందుచున్ పరావర్తన, మందముగను
నేడు రంగులు కన్పించు నింకొక దరి.

6.తే.గీ.
ఇదె ప్రయోగముగా చూపి యింద్ర ధనుసు
నేర్పడు విధానమున్ గూడ నిదియె ననుచు
నేడు రంగుల కలయికే యీతెలుపని
రుజువు పరచెడు బోధనలు జరుప నదె
పిల్లలకు జ్ఞప్తియందుండు విద్య యగును.
**************************************
19/09
శీర్షిక: భిన్నత్వంలో ఏకత్వం  


కారు మబ్బులు కమ్మిన వేళ
తొలకరి జల్లులు కురిసిన వేళ
ఎండ వానల సంగమ వేళ
ఆకాశంలో అద్భుతం
కాంతి సహజ దృగ్విషయం
యానకం మార్పుతో వక్రీభవనం
నీటి బిందువులోన అంతరపరావర్తనం
కలగలిసిన ఫలితమే అందమైన సోయగం
ఏడు రంగులు ఏకమైన తెలుపు వర్ణపు శోభితం
చూపరులకిది అర్థవృత్తాకారం
నిజానికిది 3D శంఖాకారం
రంగురంగుల హరివిల్లు
ఆనందాలు విరజిల్లు
నింగికి నేలకు నిచ్చెన
అదృష్టానికి సూచన
గొప్ప లక్ష్యాల సాధన దిశగా ప్రేరణ
విభిన్న రంగుల వైవిద్యం జీవితానికి ఆదర్శం
భిన్నత్వంలో ఏకత్వం సమస్తం ఆచరణీయం

20/08
శీర్షిక : ఉద్వేగాల సమాహారం
*************************

ఎద గూడులో పొదిగే ఆశలదో రంగు
కింద పడి..లేచిన ఆశయాలదో రంగు

మోకాళ్ళను కడుపులో దూర్చుకుని
ముడుచుకుని పడుకున్న దైన్యం దొక వర్ణం

వెక్కిళ్లు పెడుతూ..ఎగిసిపడిన ఎద దొక వర్ణం
ముడేసుకున్న నుదురు దొక వర్ణం 

అరచేతి ఏటవాలులో
ఆకాశం వంక ఎగజూసిన నిరీక్షణ దొక వర్ణం 

రంగులు కొన్ని..స్నేహంగా కొన్ని భిన్నంగా 
నిమరాలనిపించే లేత వర్ణాలు
విసిరేయాలనిపించే ముదురు రంగులు

రంగుల రహస్యం ఏమిటో అనాది గా శోధిస్తూనే..

చూడగలిగితే..ఎర్రెర్రని చూపుల కింద చల్లదనం దాగుంటుంది
దుర్భేద్యమైన మనసు ఊదారంగు అరలను తెరవగలిగితే కట్టిపడేసే కనికరం కనబడుతుంది

పచ్చని ప్రేమ దొక వర్ణం
ఆర్ద్రతా నీలం తో సర్దుకున్న హృదిదొక వర్ణం 
సున్నితపు పసుపుతో సొబగులు అద్దిన ఎదదొక వర్ణం..బాధ్యతలను మోసే గుండె దొకవర్ణం 

మనసు కప్పుకు నారింజ బూజులు
గజిబిజి గందరగోళాలు..అవి గాఢమైన రంగులు 

పరిమళాలు పూల జాడను పట్టించినట్టు
ఉద్వేగాల వర్ణాలే మనిషిని కనిపెడతాయి

మేఘాల రెక్కలేసుకుని స్వేచ్చగా ఎగిరే మనసు పక్షి కి..ఎంతెత్తునున్నా సరే చేదు తీపి అనుభవా లున్నాయి

ప్రతి రంగు దేన్నో మోస్తూ..ప్రతిబింబిస్తూ
కొన్ని విరుపులు కొన్ని వేదనలు ఏదో సమన్వయం 

పొగిలి పొగిలి ఏడ్చిన మనసాకాశానికి ఓదార్పు హరివిల్లే భరోసా 

కురిసి వెలిసాక..తేట పడిన హృదయాకాశంలో..
వన్నె వన్నెల సంగమం..ఉద్వేగాల సమాహారంగా
విరుస్తుంది..సంపూర్ణమైన హరివిల్లు 

21/07

నాకవితాశీర్షిక : అపురూపాలు- హరివిల్లులు
ధరిత్రి దాహం తీరాలంటే మెరవాలి ఇంద్రధనుస్సులు వినీలాకాశంలో
కురియాలి చిటపట చినుకులజల్లులు
మురియాలి భూమాత ఆచినుకుల ఒడిలో
విరియాలి వినువీథిలొ అందాలహరివిల్లులు
కనువిందు చేస్తాయి ఏడు రంగుల హరివిల్లులు ఆకసాన 
ఆహరివిల్లే గగనవీధిన మెరిసే ఇంద్రధనుస్సు
ఏర్పడుతుంది ఏడురంగులుగ
నీటిబిందువుల అంతఃపరావర్తంతో
పేరుగాంచింది ఇంద్రధనుస్సుగ
చాపంరూపంలో విరియటంతో
నిలిచిపోతుంది ఒక మధురస్మృతిగ మనందరి హృదయాలలో
జీవన వలయాలకి ప్రతీకలు ఆఏడురంగులు
వలయాలెన్నో మన జీవితాలలో
సమస్యల వలయాలు
కష్టాల కడగండ్ల వలయాలు
నిరాశానిస్పృహల వలయాలు
ఎన్నో మరెన్నో
అవరోధాలు, అడ్డంకులు, ఆటంకాలు మనజీవనబాటలో
వాటన్నిటి ప్రతిరూపమే హరివిల్లు.
అదే ఏడురంగులఇంద్రధనుస్సు
సూచిస్తున్నాయి ఆరంగులే 
మనజీవనరంగులవలయాలను
పసుపువర్ణం శాంతిసౌఖ్యాలను సూచిస్తే
ఎర్రదనం నిలుస్తోంది కలహాలకు, కోట్లాటలకు
కష్టాలు, నష్టాలు, ఈతిబాధల
సూచన నీలిరంగుకాగా
సుఖసంతోషాల గుర్తు ఇండిగో
సంపదకు ,అభివృద్ధి కి చిహ్నం 
ఆకుపచ్చ
త్యాగానికిసూచననారింజరంగు
అవసరమే అన్నీ జీవితానికి
జీవితానికి కావలసినవి
ఉపకరించేవి కూడాఅవే
ఇలా ఏడురంగుల ఇంద్రధనుస్సు అందాల హరివిల్లు 
విబ్ గయార్ ఏడుఅక్షరాలతో
సూచిస్తోంది మన జీవన
విధానాలను
అందమైనది, అపురూపమైనది,
ఆహ్లాద కరమైనది, ఆనందదాయకమైనది ఇంద్రధనుస్సు.

 22/06
 అంశం ఇంద్ర ధనుస్సును
రచన వాణిసరోజిని లక్కరాజు హైదరాబాద్ 

సన్నని వర్షపు జల్లులు ,సూర్యకాంతి లో
వెండివెలుగులీనుతుండగా,
చల్లని వాతావరణం లో ,హాయిగా సేదదీరేవేళ,
ప్రశాంత వినీలాకాశంలో
 ఆవిష్కరింపబడే ఒక అద్భుతం. 
   నింగి నీలపు కాన్వాసుపై  
   దైవం దిద్దిన సప్తవర్ణాల ఇంద్రధనుస్సు 
 చిన్నిచిన్ని నీటి బిందువులని
 స్పర్శించిన సూర్యకిరణం పరావర్తన చెంది
వెదజల్లే ,కాంతి పుంజపు వయారాలు,
రంగురంగుల ఇంద్రధనస్సులా,
అంబరంలో వెలసి , చేసే సంబరాలు 
కనువిందు చేసేది కాసేపయినా,
మనోరంజకమై మనసు పరవశిస్తుంది.
శ్వేత వర్ణంలో విలీనమైవున్న సప్తవర్ణాల సమాహారం
ఇంద్రధనుస్సులా రూపుదిద్దుకొని , ఆకాశాన్ని ఆవరించి
అందాలుచిందించి ఆహ్లాద పరుస్తుంది.
వైలెట్ ,వూదా , నీలం,ఆకుపచ్చ,పసుపు ఆరెంజ్
 యెరుపు వర్ణాలు నీటిబిందువులోఅంతర్లీలమై
వున్న సత్యాన్ని, ఆవిష్కరిస్తుంది హరివిల్లు 
సౌందర్య మెంతటిదైనా అది అశాశ్వతమనే
సందేశాన్ని , చెప్పకనే చెబుతుంది ఇంద్ర ధనుస్సు 
నిలచివున్న నిర్నీత కాలంలోనే
లోకాన్ని సంతోషపెట్టి బతుకు సార్ధకం 
చేసుకోవాలనే పిలుపు నిస్తుంది 
చిన్నా పెద్దా వయసుతారతమ్యాలులేకుండా
మనసుకు హాయినిచ్చి ,
దూరమెంతైనా దగ్గరగా కనబడుతూ
రాగరంజితమై రమణీయ ఆకృతి సంతరించుకొని
చూపరుల కనులను కట్టి పడేస్తుంది
వానతుంపర్లు చిందించే అందంలో
హంగులీనే అందాల యింద్రధనస్సుఆవిష్కరణ
యెపుడెపుడా అని అంబరంవైపు సంబరంగా
యెదురు తెన్నులు చూసేవారెందరోకదా.


23/05
అంశం : ఇంద్ర ధనస్సు
శీర్షిక : అనేకం ఏకం-ఏకం అనేకం

విష్వాన విశిష్ట వర్ణాలు
వర్షపు కాంతులు ప్రకాశింప
నిశ్చల నింగిన నేరుగా నిల్చిన
అర్థవృత్తాకార గోపుర ద్వారం
అందరినీ అలరించే ఇంద్ర ధనస్సు
ఏకం నుండి అనేకం ఉద్భవించాయని
ఏనాటికైనా అనేకం ఏకం కావల్సిందేనని
వెలుగు నుండి వెలువడిన ఏడు రంగులు
తిరిగి ఏకమైతే తెలుపు వెలుగేనని
అత్యాశల ఆశాజీవులకందించే సందేశం
సప్త వర్ణాల సుందర ఇంద్ర ధనస్సు
ఆగని అడుగుల పయనం జీవితచక్రం
ఆటు పోట్లు వచ్చివెళ్ళే బంధువులని
బోధించే పాఠాలు ఆగదని కాలచక్రం
అప్పుడప్పుడు దర్శనమిచ్చే ఇంద్ర ధనస్సు
జీవి బ్రతుకుకు అనివార్యమైన జలం
పుడమిని అభిషేకించ ఇంద్ర ధనస్సు ద్వార
జల జల జారె వడి వడిగా
అందిన అమృత జలాన్ని తగువులాడక
వర్ణాలు వేరైనా కలిసి పంచుకోమనె
తనను స్పూర్తిగా తీసుకోమనె
సప్త వర్ణాల మన ఇంద్ర ధనస్సు

 24/04


పొద్దు విరబూస్తున్న వెలుగు కిరణాలను,
ముద్దు ముద్దుగా కురుస్తున్న చినుకులు 
వద్దు వద్దు అంటున్నా ముద్దు పెట్టుకుంటున్న క్షణాలు
ఎద్దేవా చేయొద్దంటు వెలిసిన ఏడు రంగుల హరివిల్లు!!

నింగిని నేలను ఏకం చేస్తు వంగిన చాపం
కుంగిన నదుల మనోరథంపై పూచిన పారిజాతం
చెంగున సెలయేళ్లల్లో దూకుతున్న లేళ్ళ సంతోషం
పొంగిన ఉల్లాసంతో వనాలలో ఎగిసిన సౌరభం!!

పచ్చని బీళ్ళల్లో పాడి పశువుల ఉత్సాహం
పల్లెసీమలకు పరుగులు తీసే పరవశం
పసిపాపల మోమున పూచే చిరుదరహాసం 
పడతుల నడకలో ఊగే వంపుల పాండిత్యం!!

ఇంతుల ఇతిహాసంలో ఇమిడిపోని ఇంద్రధనుస్సు 
కాంతుల సమాహారమయి కళ్లకు కమనీయ తేజస్సు
సంద్రానికే చమక్కులు అద్దే సప్తవర్ణ శక్రధనస్సు 
చంద్రకళలలో మునక లేసే సప్త వర్ణ వర్ఛస్సు !!

సుఖాల వర్షము జల్లై కురుస్తున్నప్పడు
అనుభూతులు, వెలుగు కిరణాలయి సోకుతుంటే,
మస్తిష్కాన్ని, మేనును, ఏకం చేస్తు జీవితాన్ని ఏడురంగుల హరివిల్లై ఆవిష్కరిస్తుంది అందంగా !!

కారు మబ్బులు, కష్టాలను కట్ట కట్టి చుట్టు ముట్టి,
పోరుకు దిగినప్పుడు, 
చెక్కు చెదరక పిడికిలి బిగించి, 
ముట్టడించి మట్టుపెట్టు,ఉరుమై మెరుపులు కురిపిస్తు!!

క్షణకాలం కనిపించే ఇంద్ర ధనస్సే కాదు 
దాని వెనువెంటనడిచే
కారుమబ్బుల భీకర హోరు 
ఉంటుందని గుర్తుంచుకో !? అదే జీవితం !!

 25/03
ఇంద్రధనుస్సు :
వర్షం వస్తే హర్షం. అప్పుడే ఆకాశంలో అందంగా మెరిసే మెరుపు ఇంద్రధనుస్సు
ఏడు రంగులూ వంగపండు రంగు నుండి ఎరుపువరకు(VIBGYOR) కలసి కనిపించేది ఇంద్రధనుస్సు
మురిపిస్తుంది మనసుని
స్వచ్ఛమైన తెలుపు రంగు విడివడితే వచ్చేవి ఆ ఏడురంగులే
ఏడు రంగులూ కలిస్తే వచ్చేది చక్కటి శుద్ధ సంకాశం తెలుపు


శ్వేతవర్ణం లో దాగున్నాయి రంగులన్నీ
ఆత్మ శరీరం లో ఇమిడి ఉన్నట్టు
భిన్నత్వం లో ఏకత్వంసూచిస్తుంది ఇంద్రధనుస్సు
ఆహ్లాదాన్ని మనో వికాసాన్ని కలిగించేది
ఇంద్రధనుస్సు
చాపం లా కనబడినా అది వృత్తాకారం
 బయలు దేరినచోటుకే చేరుతావు అని తెలిపేది వృత్తం
జీవితం సరైన కక్ష్య లో ఉండాలి వృత్తం లా
ఒడిదుడుదుకులు ఎదుర్కొని గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి
ఇంద్ర ధనస్సు మనం వంగి ఉండాలని
బోధిస్తోంది
వంగితే నింగీ నేలా కలిసేంత దూరం 
జీవన పయనం సాగిస్తూ వృద్ధిచెందుతూ
ఉంటాం అని తెలిపేదే ఆ ఇంద్రధనుస్సు

ఏడు రంగులూ కలిస్తే ఒకే రంగు
సప్త స్వరాల సంగమం సంగీతం 
కాల చక్రం లో
ఏడూ రోజులూ అయితేనే ఒక వారం
ఏడు చక్రాలు ఏడూ రంగులతో అలరారుతున్నాయి ఏడు చక్రాలు
మానవ శరీరం లో 

శ్రీ రామాయణం లో ఉన్నాయి ఏడు కాండలు
 ఇంద్రధనుస్సు లోని ఏడూ రంగుల్లా
మనం కలల రంగుల్లో విహరిస్తాం
నిద్ర లేవగానే కలలు హుష్కాకి అవుతాయి
అలాగే ఇంద్ర ధనుస్సు కాసేపట్లో ఎండ రాగానే మాయమవుతుంది
సూర్యుని రథానికి అశ్వాలు ఏడు

సప్త సముద్రాలు
సప్తాహాలు సరదా నీళ్ళులు సంతోషాలు సరాగాలు సప్త పదులు
ఉండేవి ఏడు రంగులే ఏడు రోజులే
మళ్ళీ మొదటికే.......

26/02
-ఇంద్రధనుస్సు
శీర్షిక:-
జీవిత పరిపూర్ణతకు ప్రతీక
..................................
పరమాత్ముని ఆనతితో
పరదేవతా స్వరూపమైన మాతృమూర్తి గర్భాన
ప్రవేశించి ప్రసవవేదనతో
పునర్జన్మనెత్తి పుడమిపైకి తెచ్చి
పొత్తిళ్ళలో నినుచూసి సప్తవర్ణపు కలనిజమైందని
పారవశ్యంతో ముద్దాడి
పసిడిబొమ్మలా పెంచిన
ప్రేమమూర్తి అమ్మ సదా స్మరణీయురాలు..!!

పరమాత్ముని ప్రతిరూపమైన పితృదేవులు నీ ఉన్నతి కొరకై కఠినాత్ముడిగా కనిపించినా నిరంతరం నీ కోసమే శ్రమించి
ప్రయోజకుడవైన సమయాన సప్తవర్ణ సుశోభితమై జీవితం బాగుండాలని ఆశీర్వదించే ప్రత్యక్ష దైవమే కదా.!!

మంచి చెడు నైతిక విలువలు తెలియచేసే సద్గురువు  
మూడుముళ్ళ బంధంతో
కన్నవారిని వదలి గోత్రం మార్చుకుని నీ చిటికెన వేలుపట్టుకుని కష్ట సుఖాలలో
కలిమిలేములలో తోడు నీడగా నీ వెంటే ఉండి పిల్లలభాధ్యతలతో బాటు అత్తమామల అతిధి అభ్యాగతుల సేవచేసే
ధర్మపత్ని జీవితమంటే
సప్తవర్ణాల కలయికయే అని నీతోచెప్పి మనసున మనసై బ్రతుకున బ్రతుకుగా లభించిన జీవితపరిపూర్ణతకు ప్రతీకయే కదా....!!
.........................
 27/01
*
శీర్షిక."ఏం మాయ చేశావే!?"

ఆ దృశ్యం వెనుక మనో నేత్రం 
గమ్మత్తుగా వాడి పోని _హృదయకమలమైంది!
పసితనం లో అన్ని రంగుల ఆకాశపు వంతెన!
తన్మయత్వాన్ని తొలిగా రుచి చూపింది!
వయసొచ్ఛాక..ముదురు-ఊదారంగు ఊహల్లో..
ఘన గాఢానురాగ తరంగాలో...
నీలి మబ్బుల నీడల-ఆటల్లో..
హరిత ప్రకృతి చాయగా..
పసిడి శరీరపు సుగంధాల వెన్నెలతో..
రాగరంజితాధరాల పగడపు కాంతితో..
అనురాగ రక్తిమగల భావ శకలమీ కళాకృతి!
ఇపుడు మలి పొద్దులో..
ఇన్ని రంగుల్లా ఇన్నాళ్ళు భ్రమింపచేసి..
రంగుల కోసం పరుగులు పెట్టించి..
తీరా రంగుల్ని చుట్టచుట్టుకొని
కళ్ళు తిరిగేలా మాయచేసి..
ఒకే ఒక్కవెలుతురై..సమ్మోహన నాట్యంగా.మురిపించి..
రుద్ర తాండవమై. భయపెట్టి..
సుందర దృశ్యమై సాంత్వన నిచ్చి..
చివరికి చిదాకాశంగా కనులను మాయ చేసి..
హృదయంలో దూరి నిర్గుణ నిశ్చల కాంతి గా కుదురు కున్నావా?
ఓ హరివిల్లూ!
ఏం మాయ చేశావే!?

28/a

చూడగలిగే మనసున్న మనిషికి
చరాచర సృష్టిలో ప్రతిదీ అద్భుతమే
సప్తవర్ణాల హరివిల్లు తో నింగి
కనువిందు చేస్తుంటే అదో అందమైన అద్భుతం
ఆమని రాకతో పరవశించి మైమరచి
పంచమ స్వరం తో పాడే కోయిల పాట అద్భుతం పింఛమెత్తి నాట్యమాడు నెమలి ఆట అద్భుతం
చెట్టు కొమ్మపై చేరి పుల్ల పుడకలు తెచ్చి
పక్షులు కట్టే పిచ్చుక గూళ్ళు అద్భుతం
పూలను నలపక మకరందాన్ని మాత్రమే గ్రోలే
తుమ్మెదల విన్యాసం అత్యద్భుతం
తనువెల్ల గాయాలైన మోవి తాకగానే
సప్త స్వరాల నాలపించే మురళీరవం అద్భుతం
రవిగాంచని సైతం మనోనేత్రంతో చూసి
కమ్మని కైతగా ఆవిష్కరించే కవి ప్రతిభ అద్భుతం
అది అజరామరం అనిర్వచనీయం

29/b

రాత్రంతా కారువుతీరా కురిసిన వర్షం
జలమయమైన బావులు కుంటలు
లేత చిగుళ్ళతో ప్రకృతి పచ్చదనం రూపుదిద్దుకుంటోంది
రైతులు అరకలతో బురదపొలాలు దున్నుతున్నారు
వినీల గగణం కింద రైతు ఇలాతలమంతా
నాగేటి సాళ్లతో కనువిందుగా దున్నుతున్నట్లు,,,,,,!
తూరుపున పొడిచిన సూరీడు ఎర్రదనం
ఇలాతలమంతా సింధూరం పూస్తున్నట్లు
కూలమ్మలు మడిలోని నారు లుంగలు కట్టి
పొలాల్లో చేతులతో చిట చిట మంటూ నాటువేస్తూ
ఓ అమరవీరుని గాధను లయబద్దంగా పాడుతున్నారు,,,,,!
రైతు కళ్ళు వెలుగుల పునీతయై నిర్మల సాలోచనలు,,,,,,
వీపుకడ్డంగా కర్రపై రెండు చేతులు వేసి గట్లపై నడుస్తున్నాడు
కూలమ్మల నాట్లు రాగాలు ఆగిపోయాయ్ ,,,,,,,,!
ఎటుచూసినా నాటిన పచ్చని వరిచేను
తన కష్టం ఈ ఏడాదన్నా ఫలిస్తుందా,,,,, ఏమో,,,,!
ఆకాశం నిండా తెల్లని కొంగలు పిచ్చుకల కోలాహలం
సాయం సంధ్యాకాంతుల్లో చిరు చిరు చినుకులు
పడమటి దిక్కులో ఇంద్ర ధనుస్సు తళుకులు
పచ్చని వరిచేను కోటి రతనాలు కాసినట్లు
రైతు కళ్ళల్లో ఏదో అనిర్వచనీయమైన ఆనందం తలయెత్తితే ,,,,,,,,,,
ఇలాంటి ఇంద్ర ధనుస్సుల్లో ఎన్నెన్నో పంటలు పండించాడు
కాలాలు వడివడిగా కదులుతున్నాయి
తను సద్దిబువ్వ తింటూ భారతావనికి అన్నం పెట్టేది రైతు,,,,,,,!
రైతు కళ్ళల్లోకి తొంగిచూస్తే రంగు రంగుల ఇంద్ర ధనుస్సు లాంటి పంటచేలు,

30/c  
       *****************
చిరు జల్లుకు నీరెండ సోకితే... 
ఏడు రంగుల ఇంద్రధనుస్సే... 
ఏర్పడుతుంది.... !
  ప్రకృతిలో రమణీయ ఆకృతై మనసును హాత్తు కుంటుంది !
  ఈ మనిషి బ్రతుకులో.... ఎదురయ్యేకష్ట,సుఖా లకు ,దుఃఖానంద వీర,రౌద్రాది నవరస భావనలూ... హృదిలో ఉప్పొంగుతాయి !!
  ఆ స్పందనల ప్రతి స్పందనలే మనసు రూపమున.... 
ఈ మనిషిని నడిపిస్తాయి... !
     ఆ ప్రకృతితో ఈ మనిషిది విడదీయలేని బంధము కాదా 
ఈ సృష్టికి కేంద్ర బిందువు... 
 మనిషే కదా.... ఈ మనిషే కదా 
     తెలుపు శాంతముకు... నలుపు దుఃఖముకు... 
 పసుపు శుభమునకు, ఎరుపు రౌద్రముకు... సప్తవర్ణములు, ఏడు గుణములకు ప్రతీకలే నోయ్... !
ఏడు రంగుల ఇంద్ర ధనువులా ఈ మనిషి జీవితము.... ఆహ్లాద భరితముగ సాగాలి !
     ఈ జగతికి ఆనందాన్ని కలిగిస్తూ సప్తవర్ణ రంజితమై ఈ తనువు... ప్రకృతిలో కలిసిపోవాలి !!
     ******************
 31/d 
ఇంద్రధనస్సు

*************
ఇంద్రధనస్సు కలతల మెరుస్తూనే కొత్త కాంతులను ఏడు రంగుల వింత రంగులను వెదజల్లుతుంది

ఇంద్రధనస్సు ఆకాశం కాంతులను కొత్తదనంతో నింపుతుంది

ఇంద్రధనస్సు అంటేనే పిల్లలకు పెద్దలకు ఒక వింత సంబరం

ఏడు రంగులు ఇంద్రధనస్సు అంటేనే
మనసుకు ఆరాధన కలిగించే సంతోషం

ఆకాశంలో హరివిల్లు వెలిస్తే ఎగిరి గంతేసే బాలలను చూస్తున్నాం

ఇంద్రధనస్సు సుందర స్వప్నాల సోయగాలను 
వెదజల్లుతుంది

ఇంద్రధనస్సు నవోదయానికి నాంది పలుకుతుంది

ఇంద్రధనస్సు ఒక సుందర స్వప్న శాల ఇంద్రధనస్సు ఒక మధురమైన అనుభూతి కలుగుతుంది

Comments

Popular posts from this blog

సింధూరం 07052025

****************** సింధూరం దిద్దిన వారు  1.వీరా గుడిపల్లి 2.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, 3.గొర్రెపాటి శ్రీను  4.దోసపాటి వేంకట రామచంద్రరావు  5.అపరాజిత్ 6.వేమూరి సత్యవతి  7.జ్యోతి  8.మండ నాగేశ్వరరావు  9.గడ్డం కృష్ణారెడ్డి.రేపాల.సూర్యాపేట 10.కవిత వెంకటేశ్వర్లు  11.ఆర్ వి వి రాజా  12. శ్రీ కోరాడ నరసింహారావు గారు  13. శ్రీ ఉదయగిరి మధుమోహన్ గారు  14. శ్రీమతి బల్లూరి ఉమాదేవి గారు  15. శ్రీమతి తోట సులోచన గారు  16. శ్రీ జి సూర్యనారాయణ గారు  17. శ్రీ గజవెల్లి శ్రీనివాస చారి గారు  18. శ్రీ వనపర్తి గంగాధర్ గారు  19. శ్రీమతి వాణి సరోజిని లక్కరాజు గారు  20. శ్రీమతి సింహాద్రి వాణి గారు 21. శ్రీ ఆచార్య అయ్యల సోమయాజులు ప్రసాద్ గారు  22. 23.శ్రీమతి నెల్లూరు వేంకటలక్ష్మి గారు 24.శ్రీ ఏడెల్లి రాములు గారు  25. శ్రీమతి డాక్టర్ తంగిరాల నాగలక్ష్మి గారు  26. శ్రీ కూని అంకబాబు గారు  27. శ్రీ తిన్నాక నాగేశ్వరరావు గారు  28. శ్రీమతి లలితా చంటి గారు  29. శ్రీ పిల్ల వెంకటరమణ మూర్తి గారు  30. ...

season 6 వైశాఖ పూర్ణిమ

కవనజ్యోతి,కవితాగానం సీజన్ 6  వైశాఖ పౌర్ణమి నగదు పోటీలు   పోటీకి కవితలు పంపించిన కవి వరుల జాబితా  1. శ్రీ పిళ్ళావెంకటరమణ మూర్తి గారు  2. శ్రీ సంగీతం సంతోష్ కుమార్ గారు ji 3. శ్రీ జి సూర్యనారాయణ గారు  4.శ్రీ మండ నాగేశ్వరరావు గారు 5.శ్రీమతి కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  6.శ్రీమతి నెల్లూరు వెంకటలక్ష్మి గారు 7.శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 8..శ్రీ కోరాడ నరసింహ రావు గారు  9.శ్రీమతి డాక్టర్ భమిడిమర్రి కమలాదేవి గారు 10.శ్రీ కాసుల ధీరజ్ శర్మ గారు  11.శ్రీ కూని అంకబాబు గారు 12.శ్రీ మతి డా.వేమూరి సత్యవతి గారు  13.శ్రీమతి డా.బల్లూరి ఉమాదేవి గారు 14.శ్రీ.దోసపాటి వేంకట రామచంద్రరావు గారు 15.శ్రీ అపరాజిత రెడ్డి గారు  16. శ్రీ ఏడెల్లి రాములు గారు  17.శ్రీ డాక్టర్ ఆళ్ళ నాగేశ్వరరావు గారు  18. శ్రీ కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  19. శ్రీ మద్ది పుల్లారావు గారు  20.శ్రీమతి సింహాద్రి వాణి గారు  21. శ్రీ డా.దీపక్ న్యాతి గారు  22. శ్రీ ఆర్.వి.వి.రాజా గారు  23.శ్రీమతి వాణీ సరోజినీ లక్కరాజు గారు...

వీడ్కోలు ఆషాఢమాసం పౌర్ణమి

అంశం: వీడ్కోలు  సందర్భం: ఆషాఢమాసం పౌర్ణమి  నిర్వహణ:  వీరా గుడిపల్లి లలితాకృష్ణ  ################## కవివరుల జాబితా  1.పిళ్ళా వెంకట రమణమూర్తి గారు  2. జి.సూర్యనారాయణ గారు  3.మండ నాగేశ్వరరావు గారు  4.డా‌.బల్లూరి ఉమాదేవి గారు  5. డా.కమలాదేవి గారు  6.గొర్రెపాటి శ్రీను గారు  7.వేమూరి సత్యవతి గారు  8.కూని అంకబాబు గారు  9.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  10.కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  11.తోట సులోచన గారు  12.వాణిసరోజిని లక్కరాజు గారు  13. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు  14.అపరాజిత రెడ్డి గారు 15.లలితాచండి గారు 16. నెల్లూరు వెంకటలక్ష్మి గారు  17.కమలశ్రీ గారు  18.రాధిక గారు 19.చంద్రమౌళి గారు  20.శ్రీకాంత్ గారు  21.సింగీతం సంతోష్ కుమార్ గారు  22.. దారల విజయ కుమారి గారు  23.ఎన్.నరేశ్ చారి గారు  24. పిన్నక నాగేశ్వరరావు గారు  25.సింహాద్రి వాణి గారు  26.ఏడెల్లి రాములు గారు  27.కొంజేటి రాధిక గారు  ++++++++++++++++++++++++++++++++ ఆషాడ మ...