Skip to main content

వీడ్కోలు ఆషాఢమాసం పౌర్ణమి


అంశం: వీడ్కోలు 
సందర్భం: ఆషాఢమాసం పౌర్ణమి 
నిర్వహణ: 
వీరా గుడిపల్లి
లలితాకృష్ణ 
##################
కవివరుల జాబితా 
1.పిళ్ళా వెంకట రమణమూర్తి గారు 
2. జి.సూర్యనారాయణ గారు 
3.మండ నాగేశ్వరరావు గారు 
4.డా‌.బల్లూరి ఉమాదేవి గారు 
5. డా.కమలాదేవి గారు 
6.గొర్రెపాటి శ్రీను గారు 
7.వేమూరి సత్యవతి గారు 
8.కూని అంకబాబు గారు 
9.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 
10.కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు 
11.తోట సులోచన గారు 
12.వాణిసరోజిని లక్కరాజు గారు 
13. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 
14.అపరాజిత రెడ్డి గారు
15.లలితాచండి గారు
16. నెల్లూరు వెంకటలక్ష్మి గారు 
17.కమలశ్రీ గారు
 18.రాధిక గారు
19.చంద్రమౌళి గారు 
20.శ్రీకాంత్ గారు 
21.సింగీతం సంతోష్ కుమార్ గారు 
22.. దారల విజయ కుమారి గారు 
23.ఎన్.నరేశ్ చారి గారు 
24. పిన్నక నాగేశ్వరరావు గారు 
25.సింహాద్రి వాణి గారు 
26.ఏడెల్లి రాములు గారు 
27.కొంజేటి రాధిక గారు 
++++++++++++++++++++++++++++++++
ఆషాడ మాసం పౌర్ణమి కవితలపోటీ కోసం వచ్చిన కవితలు సమీక్ష తో సహా 
#########################
1
పిళ్ళా వెంకట రమణమూర్తి
తేదీ *01-07-2025*
అంశం: *వీడ్కోలు*
""""""""""""""""""""""""""""""""""""""""""""
శీర్షిక: *మనోవేదన*

నిరీక్షణా సాంధ్య నిశీధిలో నీకోసం నిత్యం వెతికే నిస్సహాయుడనై ...

ఛిద్రమైన స్వప్న సౌధాన పునాదితో సహా కూలిపోయిన కుడ్యమునై ..

ఏకాంత వనాంతర విహార వీక్షణలో ఎగిరే అలుపెరుగని విహంగమునై ..

ఏ నగిషీ ఎరుగని నవ్వును ఎండిన పెదవులపై తేవాలను కొనే వృధా ప్రయాసినై...

కఠిన శిలను కన్నీటితో కరిగించి ఇష్ట రీతిలో మలచు కోవాలను కొనే ఆశల ఉలినై...

ఎద చీకటి గదులలో జ్ఞాపక మనే దివ్వెతో తలపులను తడమాలను కొనే అత్యాశినై...

గాయమైన గేయం నుండి రక్త మోడుతున్న రాగాన్ని పలికించే వీణియనై....

ద్రవించే భావానికి స్రవించే అక్షర మొసగి నిగూఢ అర్దాన్నిచ్చే నిఘంటువునై..

ముక్కలైన గుండె శకలాలను
శోక సంద్రాన గాలిస్తూ‌‌..

మనోవేదనతో మునకలు వేస్తున్న నిరాదరినై ...

పెదవి దాటని మాటలు గొంతులో విచ్చు కత్తులై గుచ్చుతుంటే మూగ భావపు మౌనినై...

పారిపోతున్న నీడ వెంట నడుస్తూ
నీ సహచరుణ్ణి అనుకొనే తెరువరినై ...

జీవన పయోనిధిలో అంతరంగ తరంగ ఆటుపోట్లను ఎదుర్కొనే ఓటి పడవనై ...

నా తుది వీడ్కోలు అందుకునే
నీ రాకకై నిరీక్షించే చకోరము నై ...

కొన ప్రాణాలతో
దోసిట నిండిన
రుధిరాశ్రువులతో
ఎదురు చూస్తున్నా!
"""""""""""""""""""""""""""""""""""""""""
సమీక్ష 
మీ "మనోవేదన" అనే కవిత నిజంగా హృదయాన్ని హత్తుకుంటుంది. ఇది ఒక మృదువైన గుండె నుండి పుట్టిన భావాల ప్రవాహంగా కనిపిస్తోంది. వీడ్కోలు అనే అంశాన్ని మీరు వేదనతో, కవిత్వ భాషలో అద్భుతంగా చర్చించారు. 

ప్రతి పాదంలోనూ మనస్సులోని విషాదాన్ని అక్షరీకరిస్తూ ముందుకు నడిపారు.
 "ఛిద్రమైన స్వప్న సౌధం", "ముక్కలైన గుండె శకలాలు", "చకోరము" వంటి పదబంధాలు చాలా బలంగా ఉన్నాయ్.

అంతరంగ భావాలను ఒలికించే శైలితో, ద్రవించే పదాలు అద్భుతంగా నిక్షిప్తమయ్యాయి.

“ముక్కలైన గుండె శకలాలను శోక సంద్రాన గాలిస్తూ‌‌..” అనే వాక్యంలో “శోక సంద్రంలో తేలుస్తూ” అని మార్చినా బాగుంటుంది.


మీ ఎమోషనల్ డెప్త్ చూస్తుంటే, మీ తదుపరి కవితల కోసం ఎదురు చూపు మొదలవుతుంది.

2
జి.సూర్యనారాయణ, అవనిగడ్డ. 6281725659.
జిల్లా 
కృష్ణాజిల్లా, ఆంధ్ర ప్రదేశ్.
కవిత
అంశం: వీడ్కోలు 
శీర్షిక: యుద్ధాలకు వీడ్కోలు పలుకుదాం...!


ఆకాశంలో ఎగిరేను అగ్ని క్షిపణులు
అవని మీద కురిసేను నిప్పుల కణికలు
బహుళ అంతస్తులు నేల మట్టాలు
ప్రాణ భీతితో ప్రజలు ఉల్టా పరుగులు
శిథిలాల క్రింద ఛిద్రమైన మానవ దేహాలు
యుద్ధ కాండలో వేలాది మంది మృత్యువాత 
లక్షలలో జనత క్షత గాత్రులై ఆసుపత్రుల పాలు
పసి పిల్లలు సైతం మసిబారి అసువులు బాసే...!

నీరు, ఆహారాలు దొరకక పౌరులు హాహా కారాలు
పిండి పాలు కూడ లేక పసిపిల్లలు తల్లడింత 
వలస బాటలో పడిరి బలహీన జాతులు..!

ఈ యుద్ధంలో గజగజ వణికేను గాజా
సుదీర్ఘ పోరులో ఉక్కిరి బిక్కిరాయెను ఉక్రెయిను
నెత్తురింకని నేలలుగా ఆ దేశ నగరాలు కనిపించే...!

చరిత్ర పుస్తకాలలో రక్త సంతకాలు చేసిరి పెద్దన్నలు
అప్రకటిత సమరంలో చిన్న దేశాలు ఛిన్నాభిన్నమాయే
దేశాల ఆర్థిక వ్యవస్థలు, ఆస్తులు విధ్వంసమాయే..!

ఇరు దేశాల మధ్య సరిహద్దుల తగాదాలు లేవు
ఆస్తి పాస్తులు గొడవలు ఏమీ లేవు
మరి ఎందుకీ భీకర యుద్ధాలు..?

అగ్ర రాజ్యాల ఆధిపత్యానికై సృష్టించాయి ఈ రగడలు
మానవాళికి కీడు చేసే ఈ యుద్ధాలకు వీడ్కోలు పలుకుదాం
సరిహద్దులలో శాంతి పావురాలను ఎగరేద్దాం
అన్నదమ్ముల వలె.. మనమంతా మెలుగుదాం...!

హామీ పత్రం

ఆర్యా...సదరు కవిత నా సొంతం. దేనికీ అనువాదంలేదు.అనుకరణ కాదు.మీ పోటీలకు ప్రత్యేకంగా రాసానని హామీ ఇస్తున్నాను.
=============================
సమీక్ష 
=============
గౌరవనీయులు జి. సూర్యనారాయణ గారు,
మీ "యుద్ధాలకు వీడ్కోలు పలుకుదాం...!" అనే కవిత వీడ్కోలు అంశాన్ని సమకాలీన సమస్యలతో మిళితమయ్యేలా చక్కగా తీర్చిదిద్దబడింది. ఇది కేవలం కవిత కాదు — అది ఒక శాంతికోరిక, ఒక సామాజిక చైతన్య పిలుపు. కొన్ని ముఖ్యమైన :


మీ కవితలో గాజా, ఉక్రెయిన్ వంటి దేశాలను ప్రస్తావిస్తూ, యుద్ధ భీభత్సాన్ని ప్రపంచవ్యాప్తంగా పసిపిల్లల నుంచీ దేశ ఆర్థిక వ్యవస్థల వరకు ఎలా ప్రభావితం చేస్తుందో బాగా వివరించారు.

"పసిపిల్లలు మసిబారి అసువులు బాసే..." వంటి వాక్యాలు హృదయాన్ని కలచివేస్తాయి. మానవతా స్పర్శ ఈ కవితకు ప్రాణం.


"మానవాళికి కీడు చేసే ఈ యుద్ధాలకు వీడ్కోలు పలుకుదాం" అనే పిలుపు ఇది కవిత కన్నా ఒక సామూహిక మేల్కొలుపు పిలుపుగా నిలుస్తుంది.


"గజగజ వణికేను గాజా" → "గజగజ వణికింది గాజా" అని మార్చితే ప్రకృతి స్వరూపానికి సరిగా సరిపోతుంది. ఇలాఐనా బాగుంది 
 ఇలాంటి సామాజిక స్పృహ కలిగిన రచనలు మరిన్ని చెయ్యాలని ఆకాంక్షిస్తున్నాను.
రచన: మండ. నాగేశ్వర్రావు.
           సరిపల్లి, విశాఖ 
             7793939724.
శీర్షిక:-
కులమతాలకు వీడ్కోలు..!!
@@@@@%@@@@@

భయపడుతూ బతుకుతున్నాం.!!
బతికేందుకు భయపడుతున్నాం.!!
ప్రజలకోసం,ప్రజలకొరకూ ప్రజలచేత అని పెద్దలు పేపరుపై రాసిచ్చినా 
ఎలా బతకాలని ఆరాటపడుతున్నాం!!
ఆరుగాలం కష్టపడినా కడుపు నిండలేదని కన్నీరు పెడుతున్నాం!!
మన కష్టం పరులపాలైపోతున్నా
నోరు మెదపలేక పోతున్నాం!!
నీవేలితో నీకన్నుపొడిచి
"నువ్వంధుడివన్నా" నోరుమూసుకుంటున్నాం!!
చదువూసంస్కారంలేని 
రౌడీమూకల పెత్తనానికే పట్టంకడుతున్నాం!!
చేయిపట్టి నడిపిస్తానన్నా
నయవంచకుల్నే నమ్ముతున్నాం !!
ఇది మనదని తెలుసు....
జనమంటే వారికి అలుసు !!
ఇంకా ఎన్నాళ్ళీ మనో వేదన...
ఇంకెన్నేళ్ళు ఈ మౌనరోధన !!

మనకంటి కన్నీరు ఉప్పెనై ఉరమక ముందే జగతి మేల్కోవాలి !!
మెరుగైన ప్రభుత్వ విద్యావైద్యం ,రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం పౌరులందరికీ అందాలి!!
కంపుగొట్టే కులమతాలకూ
విషంచిమ్మే స్వార్ధ నాయకులకూ,
వారువేసే ఎంగిలిమెతుకులకూ "వీడ్కోలు" పలుకుదాం
ప్రజలనాడికి రైతుమేడికీ పట్టంగట్టే ప్రతినిధులకు స్వాగతిద్దాం!! "ప్రజాస్వామ్యాన్ని" బ్రతికిద్దాం !!

           ------ మండ.నాగేశ్వర్రావు.
                    """"”"""""""""""""""""''''''''''
సమీక్ష 
"""''''''''''''''మీరు పంపిన కవిత "కులమతాలకు వీడ్కోలు..! 
మండ. నాగేశ్వర్రావు గారి ఆవేదనకు, ప్రజల సమస్యలపై ఆయా స్థాయిలో వ్యంగ్యాన్ని, నిజాయితీని అద్భుతంగా ప్రతిబింబించింది. 


"కులమతాలకు వీడ్కోలు..!!"
ఇది కేవలం నినాదం కాదు – ఇది చైతన్య శంఖం. సమాజాన్ని విడగొట్టే, ప్రజల మధ్య గోడలు కట్టే ఆచారాలను, మతతత్వాన్ని తిరస్కరించాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తోంది.

భయంతో బతకడం, బతకటానికీ భయపడటం – సామాన్య జన జీవితం ఎంత నిరాశగా మారిందో ఈ రెండు పంక్తులతో అర్థమవుతుంది.

"ప్రజల కోసం ప్రజల చేత" అనే రాజ్యాంగ పునాది... కానీ , పేపర్లో మాత్రమే ఉందని ఆవేదన.

కష్టపడే రైతు కన్నీరు తుడవకుండా, రౌడీ మూకలు, స్వార్ధ నేతల పెత్తనం పెరుగుతున్నదీ వాస్తవిక వ్యాఖ్యానం.

"నీవేలితో నీకన్ను పొడిచి" – ఎంత చక్కగా, అంత చురుకైన రూపకం! – కుల, మతాల పేరుతో వ్యక్తిని ఎదురు నిలపడం, కానీ వాడి ముందు ఆత్మవిశ్వాసం కోల్పోవడం.

ప్రతీ పదంలో నిరాశ ఉంది కానీ అంతరంగంలో ఆశను మేల్కొలిపే ప్రయత్నమూ ఉంది.



విధ్వంసక కుల రాజకీయాలపై తిరగబడాలి.

ప్రజాస్వామ్యానికి నిజమైన అర్ధం ప్రజలలో ఉండాలి.

ప్రజలు, రైతులు నడిచే దారిలో నాయకులు నడవాలి – వారు నిర్ణయించేదిగా కాక, వారు నడిపించబడేవారిగా మారాలి.

మండ. నాగేశ్వర్రావు గారి కలం ప్రజల బాధను బలంగా ప్రతిబింబించింది. ఈ తరహా రచనలు చైతన్యాన్ని కలిగించే సామర్థ్యం కలిగినవి. సామాజిక మార్పు కోసం అవి ప్రేరణగా నిలుస్తాయి.

4
డా బల్లూరి ఉమాదేవి 
జిల్లా 
కర్నూలు 
కవిత
ఉదయించే సూర్యుడికైనా
వాలి పోక తప్పదు సంధ్యవేళకి
పుట్టిన ప్రతి జీవి వాలి పోక తప్పదు
 జీవిత చరమాంకంలో
ఆరిపోయే దీపాన్ని వాలిపోయే పొద్దును
 ఆపలేము మేధాశక్తితో ఎవ్వరం
వాలిపోయే పొద్దే అయినా
 చీకట్లు ముసిరే వరకు 
సూర్యుడు వెలుతురు పంచినట్లు
కాలం గుప్పిట్లో దాగిన
వాస్తవాలను మననం చేసుకుంటూ
ధార్మిక చింతన తో
 ఆధ్యాత్మిక పంథాతో సాగిపోవడమే 
వాలిపోయే జీవితానికి అర్థం పరమార్థం
 గతంలోని చేదును పునరావృతం కానీక 
సరికొత్త ఊహలతో 
రేపటి వెలుగును ఆహ్వానిస్తూ
వాలిపోయే పొద్దుకు చెబుదామా వీడ్కోలు
""""""""''"""""""''
సమీక్ష 
""""''''''''''''''''''''''
డా. బల్లూరి ఉమాదేవి గారి కవిత – "వాలిపోయే పొద్దుకు చెబుదామా వీడ్కోలు" – అత్యంత గంభీరంగా, ఆధ్యాత్మికతతో నిండి ఉన్న రచన. ఇది జీవిత యాత్ర, కాలచక్రం, వృద్ధాప్యం, ధార్మిక తత్వాలు, మరియు శాశ్వత విలువలపై ఒక ప్రబలమైన తాత్విక సందేశాన్ని అందిస్తోంది.

"ఉదయించే సూర్యుడి కైనా వాలిపోక తప్పదు సంధ్య వేళకి"
– ఇది జీవిత సత్యాన్ని చక్కగా తెలిపే బలమైన ఊహాత్మక ఉపమానం.
ప్రతీ జీవితం ఎంత వెలుగునిచ్చినా, ఒకదశలో మసకబారాల్సిందే – ఇది అణచివేత కాదు, ఆమోదం.

"ఆరిపోయే దీపాన్ని వాలిపోయే పొద్దును"
ఆపలేము మేధాశక్తితో ఎవ్వరం"
– ఇక్కడ “మన బుద్ధి”కు ఒక పరిమితిని గుర్తుచేస్తోంది.
మానవుడు ఎంత ఎదిగినా, సహజనియమాలను మించిన వాడు కాదన్న అర్థాన్ని ఇస్తుంది.



"కాలం గుప్పెట్లో దాగిన వాసనలను మననం చేసుకుంటూ"
ధార్మిక చింతనతో ఆధ్యాత్మిక పంథాతో సాగిపోవడమే
వాలిపోయే జీవితానికి అర్థం పరమార్థం"
– ఇది కవిత యొక్క కేంద్ర బిందువు.
జీవితం చివరి దశను ధ్యానముగా, మార్గదర్శిగా మార్చే ఆలోచన ఇది. నిజమైన పరిపక్వత ఇక్కడ కనిపిస్తుంది.


> "గతంలోని చేదును పునరావృతం కానీక
సరికొత్త ఊహలతో రేపటి వెలుగును ఆహ్వానిస్తూ
వాలిపోయే పొద్దుకు చెబుదామా వీడ్కోలు"
– ఇది నిశ్శబ్ద విరామంలా కాక, ఆశతో కూడిన మౌన వీడ్కోలుగా అనిపిస్తుంది.
చీకటిలోకి కాదు... వెలుగులోకి మళ్ళీ ప్రయాణం మొదలయ్యే నిశ్శబ్
5
కవనజ్యోతి తరఫున
కవితాగానం సీజన్ 6
ఆషాడ పూర్ణిమ నగదు
బహుమతి పోటీకీ
నాకవిత
పేరు : డా.కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
తేది : 5-7-25
అంశం : వీడ్కోలు
శీర్షిక : ఆఖరి మజిలీ
సాగుతుంది జీవనయానం
ఎన్నో మజిలీలు చేస్తూ
చేసుకుంటూ చేరుతుంది చివరి మజిలీ
పుట్టుక గిట్టుకలు తప్పవు ప్రతీజీవికీ
పుట్టినప్పటినుంచి మజిలీలుచేస్తూ చేరతాం చివరిమజిలీకి
అవరోధాలు అడ్డంకులు ఎన్నివచ్చిన 
తప్పదు చివరిమజిలీ
భ్రమిస్తూంటుంటుంది
జీవితచక్రం ప్రతి ఒక్కరికి
తప్పవు అన్ని దశలు, అన్నిఅవస్థలు
బాల్య, కౌమార, యవ్వన,
వృద్ధాప్య దశలు
గడుస్తుంది బాల్య కౌమార్యదశలు 
తల్లిదండ్రుల అన్నదమ్ముల
వాత్సల్యాదులు, ప్రేమానురాగాలతో
ఊహలఅలల్లో తేలుతూ,
ఉరకలు వేసీ ఉత్సాహంతో
చిగురించే ఆశలతో 
కోర్కెల రెక్కలతో ఎగురుతూ
గడుస్తుంది యవ్వనం
బంధించబడతాడు సంసారపంజరంలో
కుటుంబబరువుబాధ్యతలు, ఉద్యోగ నిర్వహణలతో
వచ్చింది 60వ పడి
ఇక చాలు పడిన శ్రమ
తీసుకోమన్నారు వీడ్కోలు
అదే పదవీవిరమణ  చివరిరోజు
సాగనంపారు ఘనమైన బహుమతులతో
బరువైన ఉపన్యాసాలతో
ఒకప్రక్క విశ్రాంతి దొరుకుతుందనే ఆనందం
మరొకవంక ఇందరిని వదిలి వెళ్లాలనే దిగులు
తప్పదు ఈదశ అందరికి
ఎలా ఉంటుందో రేపటినుంచి అనే బెంగ
హృదయంలోఏదో ముల్లుగుచ్చుకుంటున్నభావన
భార్యాబిడ్డలు చులకనగ
చూస్తారేమో ననే అనుమానం
తప్పదు ఎదురీదక తప్పదు
సాగించకతప్పదు జీవనయానం చివరి  మజిలీవరకు
తప్పదు వీడ్కోలు
తీసుకోక
విద్యార్థిదశలో
తరగతి స్నేహితులనుండి
ఉద్యోగ బాధ్యతలు తీరాక
సహఉద్యోగులనుండి
చివరికి పంచభూతాత్మకమైన
ఈదేహపంజరంనుండి
తప్పనిసరి వీడ్కోలు
ప్రతి ఒక్కరికి
బాధావహమే ఏదశ
వీడ్కోలు అయినా.

పైకవిత నాస్వంతం.

6
కవన జ్యోతి పక్షాన
కవితాగానం సీజన్-6 పౌర్ణమి కవితల పోటీకి

అంశం:వీడ్కోలు

రచన : గొర్రెపాటి శ్రీను

జీవితంలో ఏ సందర్భమైనా వీడ్కోలు అంటే బాధాకమే!
చిన్నతనంలో బడికి వెళుతూ
ఇంటిని,అమ్మకి వీడ్కోలు పలుకుతుంటే
మనసంతా దిగులు మేఘాలు తెలీకుండానే కమ్ముకుంటాయి!
పాఠశాల విద్య పూర్తయ్యాక
కళాశాలలో ప్రవేశిస్తుంటే
హైస్కూల్ ను వీడుతుంటే
ఉల్లసంగా,అమాయకంగా గడిచిన బాల్యం గుర్తొస్తుంటే
హృదయమంతా తెలియని వెలితేదో వెంటాడుతుంటే
మధురంగా గడిచిన సమయం సదా జ్ఞాపకం!
ఉద్యోగ జీవితాన్ని ప్రారంభిస్తూ
కాలేజ్ హ్యాపీడేస్ కి వీడ్కోలు పలుకుతూ  
సరికొత్త బాధ్యతలను స్వీకరిస్తుంటే
ఆత్మీయ స్నేహాలు,అనురాగ బంధాలు,
ప్రేమ తొలిపరిచయాల సందళ్ళ హేల
'ఆహా ఆ రోజులే వేరు ' అన్నట్లుగా అనిపిస్తుంటుంది !
ఉద్యోగంలో
విధినిర్వహణలో
ఊపిరి సలపని బిజీ, వైవాహిక జీవితం,పిల్లలు
..కాలం ఇట్టే గడిచి ..
రానే వచ్చేస్తుంది ..పదవీ విరమణ !
శేషజీవితాన్ని సంబరంగా ,
మనువళ్లు మనవరాళ్లతో గడపమంటూ ..
సహోద్యోగులు,శ్రేయోభిలాషులు అభిలషిస్తూ
వీడ్కోలు పలుకుతుంటే ..
అప్పటి వరకూ తల్లిలా ఆదరించిన ఆఫీస్ కి దూరమవుతుంటే
..ఎన్నో యేళ్లుగా పెనవేసుకున్న బంధం ఒక్కసారిగా తెగిపోతున్న భావన మనస్సుని కలచివేస్తుంటే  
..కదలలేక వీడలేల అక్కడి నుండి బయటకు రావడం జరుగుతుంది!
భగవంతుడు ఆహ్వానిస్తుంటే
..మన అనుకున్న వాళ్ళందర్నీ వీడి
..చివరిసారిగా మనకు తెలియకుండానే
వీడ్కోలు పలుకుతూ పరలోకపయనం !
తరచి చూస్తే ..
జీవితం.. పుట్టుక ఒక ఆహ్వానం !  
వీడ్కోలు.. ఆ దశకు అంతిమ చరణం మరో కొత్తదనానికి ప్రవేశం !

7
వేమూరి.సత్యవతి.
జిల్లా 
యన్.టి.ఆర్.జిల్లా
కవిత
శీర్షిక. "వీడ్కోలు విలువలు"! వీడ్కోలు చెప్పటంలో బాధ్యత ఉంది కానీ.. చాలాసార్లు బాధావీచికలుస్పృశిస్తాయి! నిన్నటిదాకా తోడునీడగా సమస్తమై పక్కనే నిలచి .. నేడు అంపశయ్య మీద భీష్మునిలా, దీనంగా కాంతిలేని కళ్ళతో.. కృత్రిమ ప్రాణబిక్ష పెట్టే పరికరాల మధ్య.. పని చేయలేక ఆగిపోతున్న ప్రాణయంత్రానికి.. వీడ్కోలు ఇవ్వటం అంటే ప్రాణం పోతున్నట్టన్పిస్తుంది కదూ...? ఆర్జన కోసమో, అంతస్తు కోసమో, అధికారానికో.. సముద్రాలవతలకో..కపిలారణ్యానికో.. కాంక్షపడి ఇష్టంగా పంపుతూ కూడా.. వీడ్కోలు అంటే గుండెలుచిక్కబడతాయెందుకు? పుత్ర గాత్ర పరిష్వంగాన్ని వీడియోలిస్తాయా? ఒకప్పుడు ఎంతో ఆత్మీయులైన కొందరు.. ఇప్పుడు నిశ్శబ్దవార్తగా నిష్క్రమిస్తారు, వీడ్కోలవసరం లేకుండా.. కళాశాలనో పాఠశాలనో వదిలి వెళ్లాల్సిన ప్పుడు.. సొంత ఇల్లు శాశ్వతంగావిడిచి బయలుదేరాల్సినప్పుడు.. అమ్మానాన్న ఆత్మీయతని, సొంత ఊరునీ, సొంత వారినీ వదిలిపెట్టి ఏమీ తెలియని మెట్టింటి కెళ్లేటప్పుడు... ఇష్టం లేకున్నా బదిలీలో వెళ్లాల్సి వచ్చినప్పుడు... విధిగా వీడ్కోలు చెప్పటంలో కనిపించని కన్నీటి చలమలుంటాయి! ఇంటికి బంధుమిత్రులు రావటం పండుగైన సంబరం వంటి సంస్కృతి ఒకప్పుడు.. ఇప్పుడు రాగానే వీడ్కోలు ఎప్పుడో అంచనా వేసే వెతుకులాట.. కాలం మారుతుంటే... వీడ్కోలు విలువలు మారిపోతున్నాయి మరి!! ==== " వీడ్కోలు విలువలు" అనే ఈ కవిత నా స్వంత రచన! డా. వేమూరి సత్యవతి 
8
కూని అంకబాబు
జిల్లా 
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 
కవిత
          ఎడబాటు గీతాలు

 గుండె గూటిలో కొలువైన మధుర జ్ఞాపకాలను
 సాగనంపడమే కదా వీడ్కోలు 
 రక్తసంబంధాలను భవబంధాలను 
 బంధాలను అనుబంధాలను
 ఏవైతేనేమి మనం దూరం చేసుకునే 
 తంతే కదా ఈ వీడ్కోలు 
 అందులో కొన్ని మధుర మకరందాన్ని చల్లిపోతే  
 మరికొన్ని చేదు గుళికలుగా ఉండిపోతాయి 
 జీవన యానంలో నలిగే మనకు 
 ఎన్నో మజిలీల తోవల్లో 
 ఆత్మీయ శిఖరతుల్య దేహాలు 
 హృదయానికి పరిచయం అయ్యాక 
 అనుభూతులెన్నింటినో అనుభవించాక 
 జ్ఞాపకాలను గుట్టలుగా పేర్చుకొని
 మలుపులెన్నింటినో చవిచూసి 
 హృదయాలను పదేపదే స్పృశించిన 
 అనురాగాలతో వేరుపడాల్సిన వేళ 
 ముంచుకొచ్చాక
 వీడలేక విడిపోక తప్పదు 
 వీడ్కోలు పలకక తప్పదు 
 అప్పుడు ఈ వీడ్కోలుకి 
 అశ్రునయనాలు అభిషేకం చేస్తాయి 
 తడి ఆరని హృదయ వేదికపై 
 ఎడబాటు గీతాలు పాడుకుంటాయి
.
9
అంశం: వీడ్కోలు 
శీర్షిక::: వీడుకొలుపు 
స్వీయ రచన కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, పాతర్లపాడు, ఖమ్మం. సెల్ ఫోన్...6281697982 
కవితలు పంపాల్సిన చివరి తేదీ: 05/07/ 2025


వీడ్కోలు ! నిర్దిష్ట సూత్ర రహితమై
సందర్భానుసారం సంయోజితయై
ఆడిస్తూ,పాడిస్తూ,ఏడిపిస్తు,చూస్తుంది తమాషా !!

అనీర్వచనీయమైన భావపుంజం 
అద్భుతమైన ఘటనా ఘటన సమర్థత దాని స్వంతం!
అది కఠోరమైన కటారి ఘాతము కావచ్చు 
కమనీయమైన కిసలయల కోమలత్వమూ కావచ్చు!!
 
కాలానికి గాలం వేసి,ప్రకృతిపై రమణించు ఆరు ఋతువులకు వీడ్కోలు పలికించుతు,
పరిగెట్టించి... వీడు కొలుపు జాతర చేస్తుంది!!

మానవ జీవన మహాయాత్రకు మూలం 
రక్తసంబంధం భౌతిక సంబంధాల కంటే
మమతానురాగాల మార్మిక శక్తి ప్రబలమై
ప్రపంచాన్ని వృద్ధి చేస్తూ నడిపిస్తోంది!!

అభివృద్ధి పథంలో అడుగులు వేస్తు,
దూరాభారం వెళ్ళిపోతున్న సమయంలో 
కనిపెంచిన కన్నతీగ...ఇక కళ్ళారా చూడలేమని 
కనుల నిండా ఆనంద భాష్పాలు ఝల్లున రాలుతుంటే!!

చెలిమి చేసిన కనులు చలమలై ఊరుతుంటే 
కలిసి ఎదలోన ఎదపెట్టి చదివిన ఎదలు 
విలువైన బంధం వీడిపోతుందని తట్టుకోలేక
కడలి కెరటాలై ఎగిసి పడుతుంటే ఎవరికివారే ఓదార్పు!!

కన్నవారు కావలసినవారు కాలం చెల్లి
కనపడని తీరాలకు వెళ్ళిపోతుంటే హృదయం
స్రవించే కన్నీటి రుధిరం పలికే వీడ్కోలు దృశ్యం చూసి 
ద్రవించని మనసు,ఉంటుందా! ఉండదు కదూ!!

అదే! వీడ్కోలు బహుముఖ విన్యాసం 
ఇదే ! సదా వీడుకొలుపు అభ్యాసం!!
10
కవితా గానం సీజన్ 6 
ఆషాఢ మాసం పౌర్ణమి కవితల పోటీ కి 
అంశం : వీడ్కోలు 
శీర్షిక : ఆశ 
రచన: కొలకలూరి దేవికారాణి రత్నాకర్ తెనాలి.
-------------------------------------..
అడియాశల అంప శయ్య పై 
అనురాగపు ఉత్తరాయణం కోసం 
నిరీక్షిస్తూ 
కనుమూసిన నిశీధిలో 
నీవు వెలుగై విస్తరిస్తూ 
ఆత్మీయ స్పర్శా లేపనా లద్దుతూ 
ఒక్కొక్క ముల్లునీ ఒడుపుగా తీస్తూ 
సంతోషాల పూశయ్యపై పవళింపజేస్తూ
తీయని పలుకుల వీవనవైవీస్తూ 
గాయాలను గేయాలుగా చేసి 
బ్రతుకు విపంచిని శ్రుతి చేసి 
హత్తుకున్న నీవు- కలవూ కావు, భ్రమ వూ కావు.
ఇది తెలిశాక 
నీవనే ఊహా రేఖకు సమాంతర రేఖనయ్యా...
అన్వయం కుదరని తాత్పర్యాన్నయ్యా..
అంతుపట్టని చిత్తరువునయ్యా...
పెద్దరికం బాధ్యతల వలయంలో చిక్కుకుని 
ప్రేమకేంద్రకానికి పరిధి నయ్యా.
కట్టుబాట్ల ప్రవాహంలో కొట్టుకుపోతూ 
అస్తిత్వాన్ని ఆవలి ఒడ్డుకు విసిరేసా 
ఆహ్వానించని పెదవుల నుంచీ
వీడ్కోలుకు చేతులు కలిపిన నా నుంచీ
నిన్నల్లోకి వెళ్లిపోయిన నా మంచి నేస్తం 
నేను గీచుకున్న గీతను దాటి 
నాకు నేను విధించుకున్న శిక్షనుబాపి
భ్రమలాంటి వాస్తవంగా మిగిలిపోవా? 
మళ్లీ నన్ను మనిషిని చేయవా?

11
కవితాగానం సీజన్ -6 
ఆషాడమాస పౌర్ణమి కవితల పోటీ 
తేది 4-7-2025
అంశం వీడ్కోలు 
శీర్షిక వేదనా భరితమే 

తుఫాన్లో చిక్కి అర్ధంకాని అయోమయంలో 
దిక్కు తోచని స్థితిలోని బాధ, ఆవేదన
మానస మురిపెం వీడ్కోలు సమయంలో  
ప్రాణ తుల్యమై పెంచుకున్న ప్రేగుబంధం
అత్తరింటికి పయనమైనపుడు తన గుండె
తన నుండి దూరమై పోతున్నంత విషాదమే
సర్వస్వం కోల్పోయినట్లు కన్నీటి సంద్రమే

దేహమిచ్చిన వారి అంతిమ యాత్ర వీడ్కోలులో
హృదయం బద్ధలైనట్లు అంతంలేని దుఃఖంతో
వరద ప్రవాహమై మనసు స్థాణువై నిలచు
అనంత మకరందాల అనురాగం స్తంభించి
దిక్కులేని పక్షుల్లా విలవిలలాడుటే
ఏకాకిలా మిగిలామన్న తలంపులే
గుండెను పిండి నిర్వేదంలో మునుగుటే

మనసైన,మంచికి రూపమైన ఆత్మీయస్నేహం
శాశ్వతంగా కానరాని తీరాలకు పయనమైతే
మనసు కకావికలమై,అశ్రు తర్పణమై మిగిలే
నీడను,తోడును పోగొట్టుకుని చికాకులపర్వమే

జ్ఞాననిధియై,మిత్రుడై మెలగి బ్రతుకులో
అంతర్భాగమై పదవీ విరమణ తరుణంలో
విద్యనార్జించే చిన్నారుల వేదన వర్ణనాతీతమే
పసి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న
అనుబంధంతో మొక్కలనుండి జాలువారుతున్న
మంచు బిందువుల్లా వారి నేత్రాలు అశ్రు పూరితమే
విదేశాలకేగుతున్న ప్రియనేస్తానికి చిరునవ్వుల పూలగుత్తులే

తోట సులోచన
నెల్లూరు

హామీ పత్రం
ఈ కవిత నా స్వంతమని హామీ.
12
కవితాగానం సీజన్ 6
ఆషాఢ పౌర్ణమి కవితల పోటీ 
అంశం వీడ్కోలు 
వాణిసరోజిని లక్కరాజు 9491054829
హైదరాబాద్ 

విడిపోవటమొక వ్యధ
సంతోషంతోనైనా, బాధతోనైనా.
యెడబాటును తెలియజేసే
స్పందనే ,వీడ్కోలు .
ఉద్యోగంలో.,వీడ్కోలు 
అప్పగింతల వీడ్కోలు 
పరదేశానికి వీడ్కోలు  
పరలోకానికి వీడుకోలు 
భావోద్వేగాల మరోపేరు ఈ వీడ్కోలు 
హృదయసముద్రం., 
ఆనందపు వుప్పెనై పొంగగా
ప్రవహించే భాష్ప ధారల వీడ్కోలు ,
ఆనందభాష్పాలుగా
మనసు స్వాంతనపరుస్తుంది .
వీడిన భవబంధాల వేదనలో,  
యెగసిపడే సమస్యల 
సుడిగుండాలకు చిక్కి
 విలవిలలాడే హృదయ 
రోదనపు వీడ్కోలు 
కన్నీటి వీడ్కోలై 
గుండెలనుపిండి 
గునపాలు దింపుతుంది .
ఆశలపల్లకినెక్కి
.అయినవాళ్ళకి,స్వదేశానికి
అందనంత దూరాలకు వెళ్ళే
 వలసల వీడ్కోలు , 
వూహలవూయల
లూపుతూ గాలిలో
 విహరింపజేస్తుంది 
వీడ్కోల పరంపర కు
వెలగట్ట టంకష్టం .
మనుగడ కవసరమైనది 
మరోరకంవీడ్కోలు. 
దుర్వెసనాలకు దుష్టస్నేహాలకు
దూరంగా వుంటామనే
వీడ్కోలు  
మలిసంధ్యవేళ లో మమకారాలకు ,
బంధాలకు, బాంధవ్యాలకూ 
వీడ్కోలు .పలికి. ,భగవధ్యానంలో 
ప్రశాంతంగా జీవించటం నేర్చుకోవాలి.
బతుకుకు, ధన్యత చేకూర్చమని 
ఆభగవంతుని ప్రార్ధించాలి .

స్వీయ రచన దేనికి అనువాదంకాని ,కాపీగాని, కాదు.
13
కవనజ్యోతి కవితాగానం సీజన్ 6 ఆషాఢ మాస పౌర్ణమి కవితా పోటీలకు
04-07-25
అయ్యలసోమయాజుల ప్రసాద్.
విశాఖపట్నం
అంశం:-వీడ్కోలు
శీర్షిక:-
క్షణమొక యుగంలా
.............................
తల్లిదండ్రులు తెలియని నన్ను
అనాథశరణాలయం నుంచి తెచ్చి
అనురాగ ఆప్యాయతలతో పెంచిన తల్లితండ్రులు
పట్నంలో మెడిసిన్ చదివించడానికి
అగ్రహారం నుంచి వచ్చి అనాథలను ఆదుకోవాలని చెప్పి వెళ్ళినపుడు
కనులవెంట నీరు జారుతు తండ్రికి వీడ్కోలు చెప్పాను.

నిరంతర సాధనతో వైద్యురాలినై
అగ్రహారందరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరి
చుట్టుపక్కల గ్రామాలవారికి వైద్యమందిస్తున్నవేళ
మంచి సంబంధమని తండ్రి దగ్గర చదివిన విద్యార్థి వైద్యుని
జ్యేష్టమాసంలో పితృదేవుని ఆనతితో వివాహమాడి
హైదరాబాద్ వెళ్ళే టప్పుడు తండ్రితోపాటు
గ్రామంలోని ప్రజలంతా వీడ్కోలు చెప్పినది మరువలేనిది.

ఎంత చదువు చదివినా ఆషాడమాసంలో
భర్త అత్తమామలను వదలి పుట్టినింటికి వచ్చినపుడు
ఇరవైఐదు సంవత్సరాలు పెంచిన తండ్రి కన్నా మిన్నగా
ప్రేమను అందించిన భర్తను వదలి క్షణమొక యుగంలా గడుపుతు
శ్రావణమాసం రాగానే ఆషాడానికి వీడ్కోలు పలికి
సంతోషంగా పరదేవతా స్వరూపులైన తల్లితండ్రులతో
భర్తను చేరినపుడు అనుకున్నా
భార్యాభర్తలబంధం అర్థనారీశ్వరతత్వానికి ప్రతీకయన్నది
వివాహాబంధం అతిపవిత్రబంధమన్నది..!
..........................
ఇది నా స్వీయరచన
అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
9963265762.
.........................
14
అంశం :వీడ్కోలు
శీర్షిక : అన్నీ ఆశాశ్వతాలే,,,,!!
పేరు : అపరాజిత్ రెడ్డి
ఊరు సూర్యాపేట
ఫోన్ 9848532031

ఏళ్ళ తరబడి కలసి చదువుకున్న స్నేహితులను వీడ్కోలుతో వీడి వస్తుంటే బరువెక్కిన హృదయంలో గుచ్చుకునే కన్నీటి శూలం,,,,,
సహఉద్యోగులు ఉద్యోగ విరమణ వీడ్కోలు సన్మానంచేశాక కార్యాలయాన్ని విడిచిపెట్టి వెళుతుంటే జీవితం ఇంతేనన్న గుండెలు అవిసే వేదనా గగుర్పాటు,,,,,,,,,,,,, తాతలనాటి ఇల్లు అమ్ముకుని వెళుతుంటే జీవిత రథచక్రాల కింద నలిగిపోతూ గత జ్ఞాపకాలను తిరగదోడుకునే దుఃఖిత మది,,,,
పక్షవాతం వచ్చి చేతులు పడిపోయి రాసే రాతలకు వీడ్కోలు పలుకలేక గుండెలు పగిలేలా వెక్కివెక్కి ఏడుస్తూ కాళ్ళలో వేళ్ళ మద్య కలంతో రాసేలా సాధన చేస్తూ పునః ప్రారంభమొక విధిరాత,,,,,
సుఖదుఃఖాల జీవితం చరమాంకంలో శరీరం నుండి ఇహలోకం విడిచి వెళుతున్న ప్రాణం లోకానికి ఇక సెలవు పలుకుతున్న కన్నీటి దీపం,,,
ఎన్ని సంపదలు కూడబెట్టినా అన్నీ విడిచి వెళ్లాల్సిందే,,,,,
జీవితంలో ఏదీ శాశ్వతం కాని దానికి చింతించడం మానవ ప్రవృత్తి ఒక్కో అంకానికి ఒక్కో ఆత్మీయ సంబంధం ఉంటుంది వీడ్కోలు హృదయంలో ఏదో తెలియని బాధాతప్త లోగిలి,,,,,
అందుకే ఆత్మసాక్షిగా జీవనం సాగించు నిర్లజ్జగా అవినీతిగా మోసపూరితంగా జీవించకు ప్రతిదానికి ఏదో ఒకరోజు వీడ్కోలు పలకాల్సిందే ఇది మరువకు,,,,,,!!

అపరాజిత్
హామీపత్రం : ఈ కవిత నా కలం సేతయని హామీ.
15
లలితా చండి
*వీడ్కోలు*
 
గుండెను ఎవరో మెలిపెట్టి తిప్పుతున్నారు...
గుప్పెడు గుండె ఎప్పుడు ఇంతింతగా ఎదిగి కొండంతగా పెరిగి
అంతరంగం అంతా నిండిందో తెలియదు,
భావాతీతమైన దుఃఖంతో 
 పదాలు అందక పలుకులు రాక మూగబోయింది
ఇక అక్షరాలు అలికిడి ఏది 
వల్ల మాలిన ప్రేమ ముసురు వల్ల
కళ్ళు పదే పదే చినుకు చినుకుగా  
 మొదలై జోరున కురుస్తున్నాయి,
దానికి తోడు నాసికా తాళం జతతో కొంగు తడిసింది...  
ఎర్ర బారిన కళ్ల ను హత్తుకుంటోంది.
మాట రాక గొంతు బొంగురు పోయి‍ంది విదేశానికి పయనమైయ్యే
బిడ్డకు వీడ్కోలు పలుకుతుంటే,
అయినా... ఎన్నెన్ని,
ఎప్పటికప్పుడు కొత్తేగా,
మనసున్న మనషులకేగా అన్నీ...
విద్యాలయాలలో వీడ్కోళ్లు బరువెక్కే హృదయం..మరో ప్రపంచానికి అడిగినా
ఎప్పటికి మధుర స్మ్రతులే,
అప్పగింతల వీడ్కోలులో 
ఓ స్వాగతం దాగివుంది.

ప్రతి వీడ్కోలులో ఎన్ని స్వాగతాలు ఎదురై నిలిచేనో...
ప్రతి రాత్రి వీడ్కోలు పలుకుతూ ప్రభాతాన్నీ స్వాగతిస్తోంది... 
పగలు-రేయి, ఋతువులు అన్నీ
పదేపదే స్వాగతిస్తూ వీడ్కోలు పలుకుతున్నాయి
కాయం సైతం నూతనత్వాన్ని పొందుతూ
కాల్పనిక జగత్తుకు వీడ్కోలు పల్కుతోంది  

లలితా చండి
న్యాయవాది
.

16
నెల్లూరు వేంకట లక్ష్మి 
జిల్లా 
కర్నూలు 
కవిత
శీర్షిక: వీడ్కోలు 

ఎగిరి పడిన బతుకు
నేలకొరిగిన క్షణం
పగిలిన గాజుముక్కలా
విరిగిన మనసులా
చెదిరిన చెలిమిలా
గుండెను పిండిన
కడుపు మండిన
గాయం హేయమై
మనసును దహిస్తున్నపుడు
తలచి తలచి
వగచి వగచి
విలపించటం మాని
నిన్ను నీవు
నీతో నీవు
నీలో నీవే
ఓదార్పు తీరం
చేరే మార్గంకై
అన్వేషించు
గాయాల గతం
వీడ్కోలు పలికి
సుమగంధాల
పూతోటకై
బాటను పరచు
నీ మనసే నీతోడు
నీ ఆశే నీ ఊపిరి
గమ్యం సాగించు
గమనం శోధించు
విజయం వరించు
తదుపరి తరచిచూడు
ఆ ఆనందాల లాహిరి
తప్పక ఆస్వాదించి చూడు
పడిలేచిన ఆనంద ఝరి
ఆత్మతృప్తితో ముగిసిన
జీవనయాత్ర
నిజమైన మనిషిగా
నీకు నీవే రాసుకున్న
నీ మరో చరిత్ర

17
డా. ఆళ్ళ నాగేశ్వరరావు ( కమల శ్రీ )
జిల్లా 
గుంటూరు 
కవిత
శీర్షిక : గుడ్ బై!

చక్కని సంసారంలో 
చిక్కులు తెచ్చి పెట్టి..
కష్టాల కడగండ్లను మిగిల్చే చెడు
వ్యసనాలకు వీడ్కోలు చెప్పాలి 
సంసారాన్ని నందన వనంగా మార్చుకోవాలి!
ఏ వ్యసనమైనా సరదాగా అలవాటై 
దినచర్యలో భాగమై 
నిన్ను బానిసగా మార్చుతుంది!
నిన్ను కన్న వారిచే
నీవు కన్న వారిచే 
కడకు కట్టుకున్న భార్య సైతం నిన్ను 
ఈసడించుకునేలా చేస్తుంది 
సభ్య సమాజం నిన్ను దోషిగా చూస్తుంది!
చెడు అలవాట్లకు వీడ్కోలు పలికి 
మంచి అలవాట్లను అలవర్చుకో 
నీ తలరాతను నీవే మార్చుకో!!!
************-----

18
Radhika
జిల్లా 
Srikakulam 
కవిత
వీడ్కోలు

ఆడపిల్ల పుట్టిందని అమ్మ,నాన్నల ఆనందం
నాయనమ్మ,తాతయ్య ల మురిపెం 
అమ్మమ్మ,తాతల సంతోషం 
వారికి తెలియకుండానే ఎలా వెళ్ళిపోయింది ముందుకు కాలం
ఇప్పుడు ఆడపిల్ల..ఆడపిల్లేనని..ఈడపిల్ల కాదని
తెలుసుకొని వారి హృదయాలలో తెలియని గుబులు 
పెళ్ళిచెయ్యాలి.. పెళ్ళి చెయ్యాలి..పెళ్లి చెయ్యాలి ఇవే తలపులు
ఆరోజు..పెళ్లి రోజు..ఆడంబరం.. అంబరాన్ని అంటిన సంబరం
ఇప్పుడు తమ ముద్దుల మూట 
తమకు దూరమవుతుందంటే
కన్నీళ్ళు దాచుకుని ఆడపిల్లకు వీడ్కోలు 
అత్తింటివారి కి వేడుకోలు
ఆడపిల్లకు కన్నవారి వీడ్కోలు 
అత్తవారి స్వాగత తోరణాలు..
19
కృతజ్ఞతలు !! 🙏 
*******************
అటు చూస్తే కష్టాలకడలి.. కన్నీటిలంగరు.. తీరం ఎక్కడో!.. ఆశనిరాశల నిట్టూర్పులతో 
కొట్టుమిట్టాడు కుటుంబాలు.. ఎన్నో! మధ్యతరగతి బ్రతుకు కాన్వాస్ పై చెదిరిన స్వప్నాలు.. కనిపించని రాతలు మరెన్నో !..
వాటిని భరించి.. లక్ష్యం ఛేదించి.. ఎన్నాళ్లో వేచిన ఉదయం భళ్ళున తెల్లారిందని పులకించి.. ఇన్నేళ్ల ఉద్యోగ ప్రస్థానం చివరిదశకు చేరిందని.. బరువెక్కిన గుండెతో మాట్లాడుతూ ఉంటే.. వినడమూ బరువే!.. ఉద్యోగం అంటే బాధ్యతేకాదు.. బతుకు!.. అదే మెతుకు!..
ఆ ఉద్యోగం కోసం 
ఎన్ని నిద్రలేని రాత్రులో.. ఎన్ని పస్తులో!..
ఇప్పటి తరానికి తెలియని బాధల సుడిగుండాలు అవి..
ఎన్నో నిట్టూర్పుల సెగల పొగలు కమ్మేసిన కుటుంబాలకే ఎఱుక..
ఎన్ని అవమానాలో!.. 
ఎన్ని అణిచివేతలో!...
అన్నింటికీ సమాధానం 
ఉద్యోగమే అయింది !!
ఈ ఉద్యోగం వల్లే ఉపాధి..
వివాహం ..‌
ఈ ఉద్యోగం వల్లే 
పిల్లల చదువులు ...
తల్లిదండ్రుల బాధ్యతలు.. 
ఈ ఉద్యోగం వల్లే ఋణం కూడా దొరికింది..
చిన్న గూడు..పిల్లల వివాహం..
కాసింత గౌరవం కూడా 
ఈ ఉద్యోగం వల్లే !.
ఈరోజు ఉద్యోగం నుండి విరమణ అంటే..
గుండె పీకేస్తుంది..
నీతి నిజాయితీలతో , నిబద్ధతతో 
మెలిగాననే తృప్తి ఉంది కానీ 
రేపటి నుండి ఎలానో!......
బాధైతే ఉంది కానీ తప్పని విరమణ మజిలీ ఇది...
నా కన్నీటిని తుడిచి..
నన్ను నిలబెట్టిన ఈ ఉద్యోగానికి జీవితాంతం కృతజ్ఞుడిని..
ఇన్నాళ్లు నన్నాదరించిన సమాజానికి కృతజ్ఞుడిని..
నాకీ ప్రసాదం ఇచ్చిన భగవంతునికి గురువులకు తల్లిదండ్రులకు కృతజ్ఞుడిని...
------------------చంద్రమౌళి..🙏✍️
       K Chandra mouli 
        MEO ll, L N Peta 
        9346457223..
20
కడార్ల శ్రీకాంత్
జిల్లా 
Hanamkonda 
కవిత
మళ్లీ కలవరని తెలిసిన
కలవరంతో మనసుభారమైన
కనులకు దూరమైన మనసుదగ్గరైన
మనుషులకు పరవశంతో పలికే సందర్భమే
వీడ్కోలు..... 

వీడిపోవడం తప్పదన్నప్పుడు
విడిపోని హృదయాలతో ముడిపడిన
వ్యక్తులు తెలిపే చివరి ఘట్టమే వీడ్కోలు....

యదలోతుల్లో పేరుకుపోయిన జ్ఙాపకాల దొంతరలు
మెలిపెడుతున్న అదిమిపట్టి
ఆఖరిగా కలిసే లక్షణాలను
ఆసాంతం గుర్తుండేలా చేసే
మధురభరితమైన మరపురాని సందర్భవేడుకనే
వీడ్కోలు.. 

వీడ్కోలు అనే పదమే ఓ ఎమోషన్
ఒక్కోసారి హఠాత్తుగా సంభవించి చేస్తుంది కన్ఫ్యూజన్
ఎవరికైనా ఎప్పుడైనా సంభవించే డెస్టినేషన్
చివరి క్షణాల్లో మనసు భారాన్ని దించగల సొల్యూషన
21
 సింగీతం సంతోష్ కుమార్ 
జిల్లా 
కామారెడ్డి 
కవిత

శీర్షిక: నా మధుర జ్ఞాపకాలు పుస్తకం 
వీడ్కోలు ఓ నిశ్శబ్ద గీతం
మనసు తడి చేసే మధుర స్మృతి
నా మదిలో పువ్వులా వెలిసిన నీవు,
కాలగమనంలో నీ రూపం దూరమయ్యే 
నీ నవ్వుల్లో లీనమైన నా మనసు
ఇప్పుడెగాలిలా వినిపిస్తూ 
గడియారం చూసిన 
 ప్రతిక్షణం నీ జ్ఞాపకాలతో నా మదిలో 
గంటల వినికిడి నీవే.. నా మదిని కలవేసిన 
నా జీవితంలో పేజీలు శూన్యమయ్యే 
అయిన అనేక ఆశలతో పుత్తంలో నా కన్నీటి అక్షరలతో 
నీ రూపాన్ని ,నీ ప్రేమను, నీ జ్ఞాపకాలను
అంతం కాకుండా చేసే నా మదిలోనీ భావనను కంటికి కనిపించినట్లు ముద్రిస్తా ప్రియ
చిరునవ్వు మిగిల్చి వెళుతున్న నీ రూపం,నా మదిలో 
చిరకాలం నిలిచి పోతుందని
నేను సంతోషిస్తున్నాను ...
జీవితం ఒక్క గమనం, ఎన్నో బంధాల కలయిక,నీ ప్రేమ
వీడ్కోలు కాదు ప్రియ ఇదే నా జీవిత పుస్తకంలో మొదలు...
22
కవనజ్యోతి పక్షాన కవితాగానం సీజన్ 6 నిర్వహించే పౌర్ణమి.. ఆషాడ మాసం బహుమతుల పోటీ కోసం 
************
అంశం : వీడ్కోలు
***********
సెలవు తీసుకోవడం..వీడ్కోలు చెప్పడం సులువు కాదు

ఏదో ఒక మనసు క్షేత్రంలో 
మొలకెత్తి
కొందరికైనా నీడనిచ్చి
ఏ కొందరికైనా ఆకలి వేళ అన్నం ముద్దైనావంటే
నీ వీడ్కోలు బాగుంటుంది

నువ్వు వెనుదిరిగి చూస్తే..
ఏ ఒక్క ఎడారికైనా
పచ్చదం వాగ్దానం చేసి..నాటిన చెట్టు కనబడాలి

ఆకులు రాల్చుకున్న సమయాన
ఆశల చిగుళ్ళవైనావని 
ఏ ఒక్క మోడైనా నిన్ను తల తిప్పి చూడాలి

కొన్ని నెర్రెల ఎద నేలలపై
ఒక్క నీటి చుక్కవైనావని
నిర్వరామంగా నిశ్శబ్దం కురుస్తున్న లోగిలిలో చిరు సవ్వడి వైనావని..
చెమ్మగిల్లడం చేతకాని చోట
గుండెల్లో చెలమల్ని నింపావని
నీ సంతకం కనబడుతూ
నువ్వు వినబడుతుంటే..
నీ వీడ్కోలు సంబరపడుతుంది

ఒక తెల్లవారని రాత్రికి
కనీసం ఒక్క ఉదయాన్నైనా ఇచ్చి
ఊపిరి సలపని ఉక్క బోస్తున్న మనసుకు
ఒక కిటికీని ఏర్పరచి
నిరాశ చీకటికి ఒక ఆశల కొవ్వొత్తిని ఇచ్చి

ఏకాకి ఏకాంతాలను పలకరించి
గడ్డకట్టిన మౌనాన్ని
చిరునవ్వుల వెచ్చదనంతో కరిగించి

కొన్ని ముసలి దేహాలకు
నీ స్పర్శ గుర్తుకొచ్చే 
నువ్వుంటే ఇంకేమీ అడగలేని ఒక వెర్రిని
కలగజేసి
మళ్ళీ ఎప్పుడో వెనక్కి వెల్తే
నువ్వింకా వెలుగుతూనే ఉండటం
నీపేరు పచ్చపోయించుకున్న
చెట్టు ఆకుల ముఖాలను విప్పార్చి నిండుగా నవ్వితే..

నువ్వు ఒక నాడు ప్రవహించిన చోట
పచ్చదనం పరిడవిళ్ళినట్టే..
వెన్ను చూపని కాలమే ఎదురొచ్చి 
నీకు వీడ్కోలు పలికినట్టే

డా. దారల విజయ కుమారి

హామీ పత్రం
**********
నమస్త సర్/ మేడం
ఈ కవిత నా స్వంత రచన ఎటువంటి అనువాదం కాదు. ఏ సామాజిక మాధ్యమం లోనూ ప్రచురితం కాదు.
ఇట్లు
తమ విధేయురాలు
డా. దారల విజయ కుమారి
23
వీడ్కోలు 
********************
ఉద్యోగానికి వీడ్కోలు పలికాక 
శరీరం బద్దకానికి స్వాగతం పలుకుతుంది
సమయానికి అందే టీ కాస్త ఆలస్యమవుతుంది 
రోజు పెట్టే భోజనంలో కొంచెం కొంచెం ప్రేమ తగ్గి 
రుచి పూర్తిగా కోల్పోతుంది

ఆలోచించాలి గాని 
వీడ్కోలు కృత్రిమమైనదేమీ కాదు సహజమైనదే 
అయినా వీడ్కోలు ఉద్యోగానికి కానీ 
జీవితానికి కాదుగా
ఆస్వాదించే మనసునిండాలి గాని 
జీవితమెప్పుడూ రుచిగానే ఉంటుంది

జీవితమంతా 
నువ్వు అనుకోవడంలోనే ఉంది 
ఎలా అనుకుంటే అలా 
రోండా బర్న్ " రహస్యం" ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మనసుండాలి కానీ మలిదశ కూడా 
మహాద్భుతంగా వెలుగొందుతుంది

ఆలోచనుండాలిగానీ 
నీ జీవితానుభవంతో 
కొత్త తరానికి నువ్వు దారిదీపమవ్వచ్చు
కవిగానో రచయితగానో పక్వానికొచ్చి
చెడు ఆలోచనలనుండి
సమాజాన్ని మంచివైపు దారి మళ్లించవచ్చు

తపన ఉండాలి కానీ రక్తముడికేదాకా 
వెన్నుపూస వంగేదాకా 
ఆలోచనల తరంగాలతో 
ప్రతిరోజూ నువ్వు కొత్తగా ఉదయించవచ్చు
వీడ్కోలు ఉద్యోగానికే కానీ జీవితానికి కాదు

                    - ఎన్.నరేశ్ చారి
                      9701334516
24
అంశం: వీడ్కోలు
పిన్నక నాగేశ్వరరావు 5--7--2025.
హైదరాబాద్.
ఆషాఢమాసం పౌర్ణమి కవితల పోటీకి.....
అంశము :-- వీడ్కోలు.
శీర్షిక :-- వీడ్కోలు.

1.తే.గీ.
ముప్ప దేడులు సర్వీసు పూర్తి చేసి
పదవి విరమణ చేసెడు వారికెల్ల
తోటి యుద్యోగు లందరు సాటిలేని
విధముగా చెప్పుచుందురు వీడుకోలు
వారి సేవలన్ మెచ్చుచు బహుమతులిడు.
2.తే.గీ.
పదవి విరమణ చేసిన వారె కాదు
బదిలిపై నేగు వార లెవరికి నైన
వెడలు రోజున ఘనముగా వీడుకోలు
చెప్పుదురు వారిని గురించి గొప్పగాను.
3.తే.గీ.
చదువు, కుద్యోగమున జేర మొదటి సారి
దేశముఁ విడిచి పెట్టి విదేశములకు
వెడలు వారికి చెప్పగా వీడుకోలు
నంద రేగుచుందురు విమానాశ్రయమున
మనుజులకు పరిపాటిగా మారె నిదియు.
4.తే.గీ.
ముఖ్యులౌ రాజకీయ ప్రముఖులు కన్ను
మూసి నప్పుడు కడసారి చూసి వీడు
కోలు చెప్పుచుందురు, మెచ్చుకోలు మాట
లాడుచుందురందరు సభ యందు కడకు
నటులె యింటియందున మరణములు సంభ
వించ నిత్తురు కన్నీటి వీడుకోలు.
**************************************
25
కవితా గానం సీజన్ 6
పౌర్ణమి‌నగదు బహుమతులు పోటీ కోసం
కవితాంశం:-- వీడ్కోలు
రచన:-- సింహాద్రి వాణి
శీర్షిక:-- వీడ్కోలు
ఊరు:-- విజయవాడ 
చరవాణి:--7569820872

జీవన పయనం
కత్తులు, కటారులూ లేని సంగ్రామం
బ్రతుకు పోరాటంలో‌ పదునుతేలిన ఆయుధాలు లేకున్నా,
ఒక్కొక్కప్పుడు జరిగే సంఘటనలు దూసుకువచ్ఛే తుపాకి తూటాలై సవాళ్ళను విసురుతూ వుంటాయి, జాగ్రత్తగా పరిష్కారం వెదుక్కోమని.
కాలిపోయిన గతకాలపు కమురువాసనలు‍ గుప్పుమని ఎగసిపడుతూ గుర్తు చేస్తూనే వుంటాయి ఎన్నో సంవత్సరాలు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాయని, ఆయువు‌ తరిగిపోతోందని, చెయ్యవలసిన పనులు బాకీ సరిచేసుకోమని.
వర్తమానం నుంచి భవిష్యత్తు వైపు ప్రయాణించే ఆశల సౌరభాలు,
దుర్వాసనలను దూరం చేసేందుకు కర్తవ్య దీపాలకు చమురును పోస్తాయి.
సహజంగా మానవ జీవితాల్లో రెండు ముఖ్యమైన వీడ్కోలు ఘట్టాలు వస్తాయి.
విషాదంలో‌ విషాదపు వీడ్కోలు
సంతోషంలో బాధను దిగమ్రింగే‌ వీడ్కోలు.
మొదటిది అయిన వాళ్ళను సాగనంపే అంతిమ ప్రయాణం,
రెండవది ఆడపిల్లను‌ అత్తవారింటికి సాగనంపే మొదటి ప్రయాణం.
సముద్రంలో నీరు ఎప్పుడూ ఉప్పగానే వున్నా,
కన్నీటి సంద్రాలలో జలం మొదటి వీడ్కోలులో భరించలేని ఉప్పదనం,
రెండవ వీడ్కోలులోఎంత మధురంగా వుంటుందో!
అవధి లేనంత, ఆకాశమంత.
ముందూ వెనుకా నుయ్యీ, గొయ్యి లున్నా మెదడుకు పదును పెట్టి, సమస్యలకు వీడ్కోలు చెప్పి, ధైర్యంగా ముందుకు సాగడం మానవ ధర్మం.

హామీ:-- ఇది నా స్వీయ రచన.
26
కవనజ్యోతి పక్షాన 
 కవితాగానం సీౙన్ 6 నిర్వహించే ఆషాడ మాసం పౌర్ణమి నగదు బహుమతుల పోటీ కోసం,  
 అంశం: వీడ్కోలు 
శీర్షిక*కాలం దోసిట్లో...

ఆ మట్టి గట్టిగానే రోదిస్తుంది 
ఎడతెరిపి లేని రాతి మనుషుల నుండి 
జడివానలా ఒకటే బాంబుల వర్షం ఆపి
ఎవరైనా తనకు విముక్తి కలిగిస్తారని 
ఆ చెట్టు భాష్పోత్సేకంగా విలపిస్తుంది 
తన నీడ చేరినోరైనా వేటు ఆపుతారని 

లాలనగా జోల పాట వింటూ  
 పసి బిడ్డ తల్లి పాలు తాగాలని గుక్కపెడుతుంది
సవ్యంగా సాగే సుగుణరాశులన్నీ
అతి పోకడల దారుల్లో నడుస్తుంటే
కాలం దోసిట్లో కొన్ని మంచి మాటలు వినాలని 
ఆశగా ఎదురు చూస్తూ 

విపరీత పరిణామాలకు
 వీడ్కోలు పలికే సమయం కోసం 
 మనుషుల్లోని పంచేంద్రియాలు 
మార్పు చేగొని 
పంచభూతములను సవ్యంగా నడిపే రోజుకై
శ్వేత భువనం ఎదురుచూస్తుంది 

ఆ అరిషడ్వర్గాలను జయించడానికి 
ప్రపంచానికి ఓ కొత్త సిలబస్ రాసుకుందాం

ఏడెల్లి రాములు‌ ✍️ 
ది*05*07*25
ఎల్కలపెల్లి 
జిల్లా* పెద్దపల్లి

27
కవితా గానం పౌర్ణమి కవితల పోటీకి గాను...
పేరు కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం 
అంశం... వీడ్కోలు 
శీర్షిక... ముగింపు కాదు

విడిపోయే సమయమొస్తే వీడలేని ఏ బంధానికైనా వీగిపోతాయి ఎంత వేడుకున్నా...
 బంధాలను చీల్చే అహానికి వీడ్కోలు పలికి బతికేద్దాం సంతోషంగా... అపార్థాల అడ్డుగోడలను కూల్చి జీవిద్ధాం ఆనందంగా... 
జిత్తుల ఎత్తులతో స్వార్థపు నైజానికి చరమగీతం పాడి, అంబరాన్నంటే సంబరంతో ప్రతి ఘడియనూ ఆస్వాదిద్దాం...
రాత్రికి వీడ్కోలు పలికితేనేగా ఉషోదయాన్ని ఆహ్వానించేది...
 శిశిరానికి వీడ్కోలు చెబితేనేగా వసంతంతో ప్రకృతి పులకరించేది...
 ఒక్క అంతిమయాత్ర తోటే,
 కన్నీటితో పలికే వీడ్కోలు అనంత లోకాన్ని చేరుకుంటుంది తుదివేర్కోలు....
 చెప్పలేని భావానికి భాష్యం చెప్పే చూపు చెబుతోంది...
అనుబంధాలతో ప్రబంధాన్ని ప్రవచించిన బతుకు పుస్తకానికి ఊపిరాగి పోతేనే పలికే తుంది వీడ్కోలు..
ఆనందాలతో, కన్నీటితో చెప్పే భావనైనా భాష్యనైనా అది వీడ్కోలు...

Comments

Popular posts from this blog

సింధూరం 07052025

****************** సింధూరం దిద్దిన వారు  1.వీరా గుడిపల్లి 2.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, 3.గొర్రెపాటి శ్రీను  4.దోసపాటి వేంకట రామచంద్రరావు  5.అపరాజిత్ 6.వేమూరి సత్యవతి  7.జ్యోతి  8.మండ నాగేశ్వరరావు  9.గడ్డం కృష్ణారెడ్డి.రేపాల.సూర్యాపేట 10.కవిత వెంకటేశ్వర్లు  11.ఆర్ వి వి రాజా  12. శ్రీ కోరాడ నరసింహారావు గారు  13. శ్రీ ఉదయగిరి మధుమోహన్ గారు  14. శ్రీమతి బల్లూరి ఉమాదేవి గారు  15. శ్రీమతి తోట సులోచన గారు  16. శ్రీ జి సూర్యనారాయణ గారు  17. శ్రీ గజవెల్లి శ్రీనివాస చారి గారు  18. శ్రీ వనపర్తి గంగాధర్ గారు  19. శ్రీమతి వాణి సరోజిని లక్కరాజు గారు  20. శ్రీమతి సింహాద్రి వాణి గారు 21. శ్రీ ఆచార్య అయ్యల సోమయాజులు ప్రసాద్ గారు  22. 23.శ్రీమతి నెల్లూరు వేంకటలక్ష్మి గారు 24.శ్రీ ఏడెల్లి రాములు గారు  25. శ్రీమతి డాక్టర్ తంగిరాల నాగలక్ష్మి గారు  26. శ్రీ కూని అంకబాబు గారు  27. శ్రీ తిన్నాక నాగేశ్వరరావు గారు  28. శ్రీమతి లలితా చంటి గారు  29. శ్రీ పిల్ల వెంకటరమణ మూర్తి గారు  30. ...

season 6 వైశాఖ పూర్ణిమ

కవనజ్యోతి,కవితాగానం సీజన్ 6  వైశాఖ పౌర్ణమి నగదు పోటీలు   పోటీకి కవితలు పంపించిన కవి వరుల జాబితా  1. శ్రీ పిళ్ళావెంకటరమణ మూర్తి గారు  2. శ్రీ సంగీతం సంతోష్ కుమార్ గారు ji 3. శ్రీ జి సూర్యనారాయణ గారు  4.శ్రీ మండ నాగేశ్వరరావు గారు 5.శ్రీమతి కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  6.శ్రీమతి నెల్లూరు వెంకటలక్ష్మి గారు 7.శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 8..శ్రీ కోరాడ నరసింహ రావు గారు  9.శ్రీమతి డాక్టర్ భమిడిమర్రి కమలాదేవి గారు 10.శ్రీ కాసుల ధీరజ్ శర్మ గారు  11.శ్రీ కూని అంకబాబు గారు 12.శ్రీ మతి డా.వేమూరి సత్యవతి గారు  13.శ్రీమతి డా.బల్లూరి ఉమాదేవి గారు 14.శ్రీ.దోసపాటి వేంకట రామచంద్రరావు గారు 15.శ్రీ అపరాజిత రెడ్డి గారు  16. శ్రీ ఏడెల్లి రాములు గారు  17.శ్రీ డాక్టర్ ఆళ్ళ నాగేశ్వరరావు గారు  18. శ్రీ కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  19. శ్రీ మద్ది పుల్లారావు గారు  20.శ్రీమతి సింహాద్రి వాణి గారు  21. శ్రీ డా.దీపక్ న్యాతి గారు  22. శ్రీ ఆర్.వి.వి.రాజా గారు  23.శ్రీమతి వాణీ సరోజినీ లక్కరాజు గారు...