************
కవివరుల జాబితా
1. మండ నాగేశ్వరరావు గారు
2. లలితా చండి గారు
3.దోసపాటి వేంకట రామచంద్రరావు గారు
4. గొర్రెపాటి శ్రీను గారు
5. నెల్లూరు వెంకట లక్ష్మీ గారు
6.తిప్పావఝల నరసింహ మూర్తి గారు
7.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
8. సింహాద్రి వాణి గారు
9.డా.భమిడి మఱ్ఱి కమలాదేవి గారు
10. లక్ష్మి చామర్తి గారు
11.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు
12.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
13. దారల విజయ కుమారి గారు.
14. కొంజేటి రాధిక గారు
15. అఫ్సర్ వలీషా గారు
16. దామెర్ల నాగేశ్వరరావు గారు
17. కోరాడ నరసింహా రావు గారు
********************
**********
1
మహిళకు వందనం...🙏🙏🙏
======================
చాదస్తపు సంకెళ్ళను తెంచుకుని, అడుగు ముందుకేసిన మగువ
సమాజ కట్టుబాట్లను కాదని
శాస్త్రసాంకేతిక రంగాల్లోనూచూపెను తెగువ..!!
జాతి ఎదుగుదలలో తానొక
బిందువుగా అడుగిడి,సింధువుగా
పరుగిడి నవనాడులూ తానై నిలిచెను నేడు సగర్వంగా!!!
కట్టెలపొయ్యి ఊదుతూ కన్నీళ్ళు
కార్చే మహిళ, కార్చిచ్చులామారి
అంతరిక్షానికి ఎగిరింది!!
గంపెడు సంసారంతో తల్లడిల్లిన మహిళ
సంసారాన్ని సజావుగ నడిపేందుకు ఉన్నత ఉద్యోగంలో ఒదిగింది..!!
నవమాసాలూ మోసి నరకయాతన పడ్డ
మహిళ , ప్రాణాన్నికూడ పణంగ పెట్టి జన్మనిస్తుంది మహిళ!!
రాజనీతిలో రాణించిన మహిళ,
క్రీడాకారిణిగా రాణిగా ఎదిగింది!!
న్యాయవాదిగా ఎదిగి రాజ్యాంగ వారధిగ నిలిచింది!! డాక్టరుగా ఏక్టరుగా ప్రతిభనుచూపి
భారత కీర్తి కిరీటాన అద్భుతరత్నమై
మెరిసింది మహిళ.!!
రంగమేదైనా రంగుఏదైనా ఉన్నతస్థానమే ఊపిరిగా ఎదిగెను మహిళ!! దేశమేదైనా,భాషేదైనా
గెలుపే తన ధ్యేయమంటూ ఒదిగింది మహిళ!!
కారూ రైలూ విమానమైనా నడిపే
ధైర్యం తెగువా పడతులదే ....!!
స్వాతంత్య్ర పోరాటం నుంచీ
అర్ధరాత్రి స్వాతంత్య్రం వరకూ
పోరాటపటిమ చూపింది మహిళ..!!
తన కలను నిజం చేసి నిప్పులా
నిలిచింది మహిళ..!!
తల్లిగా చెల్లిగా ఇల్లాలిగా ఒదిగిన
మహిళామణులకివే మా వందనాలు..!!
మహిళాదినోత్సవ హరిచందనాలు!!!
------మండ.నాగేశ్వర్రావు.✒️
సరిపల్లి, పెందుర్తి
7793939724.
2
శీర్షిక --- *ఆమె*
రచన-- *లలితాచండీ*
అప్పుడెప్పుడో ... బెదురుచూపుల కళ్ళతో
అదురుతున్న గుండెను
నడుముచుట్టూ చుట్టుకున్న
కొంగును అరచేతిలో పట్టుకొని
పసుపు రాసిన గడపను
కుడికాలితో దాటి మరీ
ఆఇంటిని గుడి అనుకొని వచ్చింది
ఆమే...
ఇంతలో
కారుతున్న చెమటతో
నడుముకు చుట్టిన కొంగును విప్పి
కడివెడు అన్నంగిన్నె మండుతున్న
కుంపటిిపై నుండి దింపుతోంది ఆమే..
మరిప్పుడేమో..
రెక్కలు విప్పుకొన్న పక్షులు ఎగిరి వెళ్ళిపోతే
శిశిరానికి ముడుచుకుపోతూ
కప్పుకున్న కొంగుతో
వణుకుతున్న చేతితో
అతనికి అన్నం పెడుతూ...
ఆ కొంగుతో విసురుతోంది
ఆమే...
లలితా చండి
6--3-2024
3
శీర్షిక:మహిళా నీకు వందనం
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం
మహిళా నీకు వందనం
నువ్వున్న ఇల్లు ఆనందనందనం
వెదజల్లుతావు సంతోషాలచందనం
నీ నడతే మధురాతిమధురం
గృహిణిగా నీ పాత్ర అమూల్యం
జననిగా నీ జన్మ సార్ధకం
నీ త్యాగం అగణితం
నీ సహనం అసమానం
నీ శక్తి అతీతం
నీ ఓర్పే నీ నేర్పు
తెస్తావు ఎంతోమార్పు
చేస్తావెంతో కూర్పు
ఇస్తావు చక్కని తీర్పు
ఇంటికి నువ్వే ఇలవేల్ఫు
వినిపించుకోరు నీ పిలుపు
మోసగిస్తే పోరాటం సల్పు
సాధిస్తావు ఎప్పుడూ గెలుపు
ఇది నాస్వీయరచన...
4
శీర్షిక : "అవనిలో ఆమె!"
మహిలో వెలసిన మహిమాన్వితురాలు మగువ !
జన్మనిచ్చిన తల్లిదండ్రులకి కీర్తిని తెచ్చే తనయగా..
స్నేహానికి అర్థం తానై నేస్తాలతో ఆత్మీయంగా మసలుకునే ఉత్తమురాలు గా..
తోడబుట్టిన వారిని ఆదరిచే సహోదరిగా..
కట్టుకున్న భర్త ,అత్తింటి వారందరితో సఖ్యతగా నడుచుకుంటూ..
కుటుంబ అభ్యున్నతికి పాటుపడుతూ..
కన్న బిడ్డలకు అనురాగం పంచే అమ్మగా..
పుట్టింటి గౌరవాన్ని ..మెట్టింటి ఔన్నత్యాన్ని..
రెట్టింపుచేసే ఉన్నత వ్యక్తిత్వం మగువ స్వంతం !
శ్రాస్త్ర సాంకేతిక రంగాలలో..
విద్యావైద్యరంగాలలో..
సాహిత్య సామాజిక సేవారంగాలలో..
తాను అడుగుపెట్టిన చోటల్లా ..ప్రేమాభిమానాలు పంచుతూ ..
తాను ఉన్నచోటు ఏదైనా
గెలుపే ధ్యేయంగా కృషిచేస్తూ
సదా విజయాలకు చిరునామాగా మారుతూ ..
"జయహో మహిళా!"
అనేలా పేరు తెచ్చుకునే మంచితానికి మారుపేరు మగువ !
రచన : గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)
5
శీర్షిక:ఆమొక అంతర్వాహిని
*********************
చదవగలవా..నీవు..?
ఆడవారి బతుకు పుస్తకాన్ని..
ఆమె లోతైన మనోభావాలను..
మనసు పెట్టి చదవగలవా నీవు..
సంద్రమంత మనసులో
ఉప్పెనంతటి గాయాలను
చెవులతో చదవగలవా నీవు..
గుప్పెడు గుండెలోని
ఆవేదనల స్పందన లను..
కళ్ళతో చదవగలవా నీవు..
కోరికల కంపని
రెప్పల కింద మోస్తున్న భారాన్ని..
చదవగలవా.. నీవు..
ఆమె ఆశల పందిరిలోని
ఎండిన విరులను..
నేల రాలిన పత్రాలను..
చదవగలవా ..నీవు..
స్వేచ్ఛా నదిలో
ఎగసి పడుతున్న
ఆంక్షల అలలను..
చదవగలవా.. నీవు..
వాడిన మది తోటలోని
రాలిన సుగంధ స్వప్నాలను
చదవగలవా..నీవు..
జీవన నావ కింద
నలిగిపోతున్న ఇరుసు మనసును..
చదవగలవా.. నీవు..
సాగుతున్న బతుకు బండిలో
క్షీణిస్తున్న ఆమె ఆయువును..
చదవగలవా.. నీవు..
అనురాగ పు త్రాసు లో
నలిగిపోతున్న అతివ అంతరంగాన్ని..
చదవగలవా.. నీవు..
విజయమెరుగని జగజ్జేతను
అంతరమెరుగని అంతర్వాహిని ని
ఈ కవిత నా స్వంతం ఇది దేనికి అనుకరణ అనువాదం కాదని హామీ ఇస్తున్నాను.
నెల్లూరు వేంకట లక్ష్మీ ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా
6
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పంపబడిన కవిత
శీర్షిక:నిన్ను నీవు గౌరవించుకో
ఒకచేత్తో సంసారసాగరాన్ని ఈదుతూ మరోచేత్తో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే సవ్యసాచీ!
ఆదాయానికి తగిన ఖర్చులతో లోటు లేని సంసార బడ్జెట్ రూపొందించే ఆర్ధిక నేర్పరీ!
జీవితంలో తల్లిగా,చెల్లిగా,ఇల్లాలిగా అన్ని పాత్రలను అవలీలగా పోషించే బహుపాత్రభినయనీ!
అబలను కాదు సబలనంటూ అవసరానికి సత్యభామలా ముందుకురికే వీరనారీ!
నిరంతరం సంసారం కోసం పరితపించే నిస్వార్థ జీవీ!
సహనానికి మారుపేరుఓర్పులో భూదేవీ!
మస్తిష్కమే పరిష్కారాల గనిగా
కల రత్నగర్భా!
ముందు నిన్ను నీవు గౌరవించుకో!
నీ వ్యక్తిత్వానికి గుర్తింపుతెచ్చుకో!
అందరి గౌరవం నీకు పాదాక్రాంతమవుతుంది.
సాధికారత నీ సొంతమవుతుంది.
తిప్పావఝల నరసింహమూర్తి
బుచ్చిరెడ్డి పాళెం.పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా
7
[06/03, 8:11 pm] కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు Poet: కవితా గానం నిర్వహించు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కవిత
6/3/2024
అంశం:: అంతర్జాతీయ మహిళా దినోత్సవం
శీర్షిక:: విచిత్రం
స్వీయ రచన కేశరాజు వెంకట ప్రభాకర్ రావు పాతర్లపాడు ఖమ్మం సెల్ ఫోన్ నెంబర్ 62816 979 82
విచిత్రం ఏమంటే! కారడవుల్లో ఉన్నా!
కష్టానికి వెరవక కలికి !
నాగలి పట్టి నేలను దున్ని పిల్లల పెంచే తల్లి
ఆకలి తీర్చే అన్నం పెట్టి, ఆదుకునే సత్తా ఉన్నా!?
అబల!ఎందుకనో!
ఆడది భూగోళంలో ఏ మూలన ఉన్నా !
వివక్ష తోటే!హింసలతోనే ! సహజీవనం !ఎందుకనో!
ఈ లోకంలో పూర్వం
భాషలు వేరు! ప్రాంతం వేరు! మతాలు వేరు!
రవాణా సదుపాయాలు లేవు, ప్రయాణం తెలీదు!
వార్తా సౌకర్యం అంతకూ లేదు
ఒకరికి ఒకరికి ...ఏ సంబంధం లేదు !
అయినా! కూడబలుక్కుని చేసిన కుట్రలా!
ఆడదాన్ని అంగడి బొమ్మను చేసారు, ప్రపంచమంతా !
అలుసుగా ! అగ్గిలో వేసి, నీటిలో ముంచి గోతిలో పూడ్చినా,
చాలక !గర్భం లోనే కర్మకాండలు చేసారు...
ఈనాటికీ అదే తంతు !!
అయినా!
అతివను హింసించే అవలక్షణం
ఆవిర్భావం నుంచి మానవ జాతికీ
అబ్బి గబ్బు కొడుతూనే ఉంది నేటికి
లింగ బేధముతో లొంగదీసుకుని
కొంగల్లాగ పొడుచుకు తింటూ
దొంగల్లగా అందాలన్నీ దోచుకుని
భంగపాటుకు గురిచేసి మింగేస్తున్నారు!!
మార్పు! మార్పు! మార్పు కోరుతూ
ఎన్నో ఉద్యమాలు! ఎన్నో సంస్కరణలు!
ఎందరెందరివో త్యాగనిరతి వలన
జరిగింది మంచి కొంత! జరగాల్సింది ఇంకెంతో!
విమానాలు నడిపినా విదుషీమణులైనా
విశ్వ విద్యాలయంలో ఆచార్యులైనా
సమరంలో తుపాకులు పట్టి సీమను కాపాడినా
సమానావకాశాలు కోసం ఇంకా పోరాటం!!
అదే బాధ! అందుకే!
సాధికారతతో స్వావలంబన దిశగా నడిపించి
సాచివేత ధోరణిని సమూలంగా పెకిలించి
కొండా కోనల్లో ఒంటరి గూడెంలో ఉన్నా
మగువల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి!!
పచ్చనిచేలతో పసిడి పండే పల్లెల్లో ఉన్నా
పడతుల మాన ప్రాణాలకు రక్షణ కవచం తొడగాలి
జిలుగు వెలుగుల మెర్క్యూరీ లైట్లతో జిగేల్ మనే
మహానగరంలో ఉన్నా పట్టణాల్లో ఉన్నా
వెచ్చని కన్నీటి జాలు చనుకట్టుపై జారకుండా చూడాలి!
తల్లిగా చెల్లిగా అక్కగా ఆలిగా
అలరించే అందమైన బంధం అతివ
సృష్టికి మూలమై తను ,మరో తరాన్ని సృష్టించే సుదతి!
సుందరమైన సుస్వప్నాలలో సోయి మరిపించి
మురిపించే ముద్దుల ముదిత మోమున
స్వచ్ఛమైన చిరునవ్వు అధరాలపై జారునట్టు
చూసే బాధ్యత మనందరిదీ...
అందుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవ
శుభాకాంక్షలు!!
ఇది నా స్వీయ రచన
8
[06/03, 8:12 pm] Siimhadri Vani Poetess: కవితా గానం సీజన్--4
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పద్యాలు
రచన:-- సింహాద్రి వాణి
శీర్షిక:--స్త్రీ శక్తి
విజయవాడ.
మత్తేభం. కొదవే లేకను పట్టుపట్టి నిలపై కూర్చంగ కార్యమ్ములన్
ముదితల్ నేర్చును విద్య లెన్నియొ కడున్ మోదమ్ముతో శ్రద్ధగా
ఎదురే లేదులె వారిశక్తి కిలపై యేరంగమందైన భల్
ముదితల్ నేర్వగరాని విద్యగలదే, ముద్దార నేర్పించినన్.
2)ఆ.వె. మెలత చేయు చుండె మేటికార్యములెన్నొ
అలుసు చేయ తగదు నామె నెపుడు
పడతి ముందు లేక ప్రగతి శూన్యంబౌను
వాణి చెప్పు మాట వాస్తవమ్ము
3)ఆ.వె. పూలను సిగ దురుము పొలతులు యిట నేడు
కష్టమైన పనులు నిష్ఠతోడ
పూర్తి చేయుచుండె కీర్తి వచ్చు విధము
వట్టి మాట కాదు వాణి మాట
4)ఆ.వె. ధైర్య స్థైర్య మందు తరుణి తక్కువ కాదు
అంతరిక్షమునకు నతివ వెళ్ళె
ఓడ నడుపుచుండె వోర్పు నేర్పరులు తోడ
రమణి చేరలేని రంగమేది?
5)ఆ.వె. చిక్కు ముడులు తీసి చింతలు తొలగించి
ఇంటిని నడిపించు నింపుగాను
ఇంతికున్న శక్తి నింతింత కాదయా
అతివ చేయుచుండె యద్భుతములు
9
[06/03, 8:14 pm] +91 98710 96566: కవితాగానం సీజన్ 4
మహిళాదినోత్సన సందర్భంగ
నాకవిత
పేరు : డా.భమిడిమఱ్ఱి కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
తేది : 6-3-24
శీర్షిక : నారీశక్తి
నారీశక్తి అనంతం,అమోఘం
అద్భుతం, ఆశ్చర్యజనకం
శక్తి స్వరూపిణి, జ్యోతి స్వరూపిణి నారీమణి
"ముదితల్ నేర్వగరాని విద్య గలదె
ముద్దార నేర్పింపగన్ అన్నారు చిలకమర్తి"
వారు లేని రంగమే లేదు
చరిత్రలోశతలమానికాలైన స్త్రీ లెందరో
రాజులకాలంనాడే ఎందరో
వీరనారీమణులున్నారు
గుర్రపుస్వారీ,ఖడ్గవిద్య,విలువిద్యా నిపుణులు
యుద్ధాలు చేసి విజయాలు సాధించిన వారెందరో
ఆంధ్రుల చరిత్రకు అనుపమానమైన దీప్తిని కూర్చిన
నారీమణి కాకతీయుల ఆడబిడ్డ
రాణి రుద్రమ
పల్నాటి వీరవనిత మాంచాల
బ్రిటిషువారిని గడగడలాడించిన ఝాన్సీరాణి
సంఘసేవకురాలు మదర్ థెరిసా
చంద్రమండలాన్నే అధిరోహించిన కల్పనా చావ్లే
దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రులు
ముఖ్యమంత్రులు,న్యాయవేత్తలు, స్పీకర్లు
ఇలా ఎందరో మహిళలు కానవస్తారు
సర్వకళానిపుణులు, పాండితీ
ప్రకర్షగలవారు
సాహితీరంగంలో ఆనాడే
తిమ్మక్క లాంటి మహిళలు
సంగీతంలో ఎమ్. ఎస్.సుబ్బలక్ష్మి లాంటి వారు
రక్షణశాఖలో కిరణ్ బేడీలు
ఇలా అన్నిరంగాలలో ఆరితేరిన
నారీమణులెందరో
చివరికి ప్రపంచాన్ని గడగడ
లాడిస్తున్న
కరోనా నిర్థారణ కిట్ ని
తయారుచేసిందీ ఒక మహిళే
మినల్ దఖాలె భోశాలె
ఎందరో నారీమణులు నారీజనులు
ఈనారీజనులందరికీ నేను అందించే
అక్షర నీరాజనాలివే.
పైకవిత నాస్వంతం.
10
[06/03, 8:14 pm] Lakshmi Chamarthi Khammam: కవితగానం
పేరు : శ్రీ శివలక్ష్మి రాజశేఖరుని
శీర్షిక: ఆమె వెళ్ళిపోయింది
జారిపోతున్న చిరునవ్వుల నుంచి
తన ఎక్కడో రాలిపోయింది
అనురాగాల ఆవలిగట్టుపై
సాధికారత కోసం ఎదురు చూసి చూసి
అస్తిత్వాన్ని వెతుక్కుంటూ ఎటో వెళ్లిపోయింది
యుగ యుగాల చరిత్ర లో
ఖ్యాతి గాంచిన ధరిత్రిలో
తలవంచని నిండైన ఆకృతి
అర్ధనగ్నంగా నిలబడలేక
ప్రచారమాధ్యమాల మనుగడకాలేక
తను కనిపెంచిన దేశ ఘనతను చూసి
పెదవి విరుస్తూ పయనమై పోయింది
చనుబాలతో సాగిన సంస్కృతిని
ముద్దు మురిపాలతో నేర్పిన నీతిని
చత్రపతిని తీర్చిదిద్దిన అమ్మతనాన్ని
ఆ అమ్మతనాన్ని కూడా అద్దెకిచ్చే
బీదతనాన్ని చూసి గుండె పగిలిపోయింది
అడుగడుగునా సవాళ్లే అధిగమించిన
ఆత్మస్థైర్యం ఆత్మగౌరవాల సవ్యసాచి
కట్టుబాట్లు కంచెలేవో తెగుతున్నై అనుకునేలోపే
కాచుకున్న కాట్ల కుక్కల నోటికి చిక్కి
నిశ్శబ్దం రాజ్యమేలిన నిశీధిలో
ఆమె ఒంటికంటిన మకిలిని కడిగిన
పెట్రోలు మంటల్లో కాలిపోయింది
నాటికీ నేటికీ నిత్యాగ్ని పరీక్షల సీతగా
సమసిన చరితల్లో తను వెళ్ళిపోయింది
ఈ కవిత నా స్వీయ రచన. అనువాదం అనుకరణ కాదు.
శ్రీ శివ లక్ష్మి రాజశేఖరుని
11
కవితా గానం సీజన్ 4
...
గజవెళ్ళి శ్రీనివాసాచారి
కాజీపేట హన్మకొండ జిల్లా
...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
...
ఆకాశంలో సగము
అవనిలో సగము
ఆమెదే జగము
ప్రపంచవ్యాప్తంగా
కొందరు మహిళలే
సామాజిక, ఆర్థిక
రాజకీయ, సాంస్కృతిక రంగాలలో
ఎన్నో రంగాలలోనూ
విజయాలను నమోదు చేయగ
లింగ సమానత్వం
సామాజిక మార్పు
మహిళా సాధికారత
ఇలా..సాధించవలసిన
మైలురాళ్ళెన్నో
ఒక కార్మిక ఉద్యమం నుంచి
పుట్టుకొచ్చింది
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మహిళల హక్కుల కోసం
సాధికారత కోసం
చట్టసభలలో సమానత్వం కోసం
త్యాగాలు చేసిన
ఉద్యమకారులెందరో
స్త్రీ వాద ఉద్యమానికి
ఊపిరి పోసిన
ఉద్యమకారులెందరో
అబలలు సబలలేయని
ఏదైనా సాధించగలరని
ముందడుగు వేయాలి మగువలు
ప్రసంగాలు
సన్మానాలు కాదు
ఆలోచనలోనూ
ఆచరణలోనూ
రావాలి గుణాత్మక మార్పు
12
కవితాగానం సీజన్ 4
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
తేది:-06-04-24.
పేరు:-
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు :-విశాఖపట్నం
శీర్షిక:-
మహిళా నీకు వందనం
.................................
ప్రసవవేదన పడుతు పునర్జన్మ నెత్తి
పుడమిపైకి మము తెచ్చి
పరవశంతో పొత్తిళ్లలో పెట్టుకుని
రుధిరాన్ని చనుబాలుగా మార్చి మా ఆకలి తీర్చి
మలమూత్రాదులను తుడిచి పసిడి బొమ్మలా దిద్ది
మా చేయి పట్టుకు నడక నేర్పిన మాతృమూర్తి వైన
మహిళా నీకు వందనం.
.
మూడుముళ్ళ బంధంతో
కన్నవారిని, తోడబుట్టిన వారిని వదలి అత్తమామలకు
అతిధి అభ్యాగతుల సేవచేసి
తాను తిన్నా తినకపోయినా భర్త, పిల్లల ఆకలి తీర్చి
జీవితాంతం తోడునీడగా కష్టసుఖాలలో
భర్తని కంటికి రెప్పలా కాపాడే
మహిళా నీకు వందనం.
నేటి సమాజాన పురుషులతో సమానంగా
శాస్త్ర సాంకేతిక రంగాలలో
అంతరిక్ష పరిశోధనలోను,
దేశభద్రతలోను , ప్రజాప్రతినిధులుగాను పనిచేస్తుకూడా
గృహిణిగా ఇల్లు,పిల్లల బాధ్యతను చూస్తు
సవ్యసాచివై పనిచేస్తున్న
మహిళా నీకు వందనం..!!
.............................
ఇది నా స్వీయరచన
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
9963265762.
........................
13
ఆమెకూ..కచ్చడం
************
ఆమె జీవన దశలన్నిటినీ
అణగబెట్టింది
కట్టడి కచ్చడాలే..!
సొర బీర పొట్ల కు రాళ్ళు కట్టినట్టు..
కొమ్మల స్వేచ్ఛ ను కత్తిరించి
ఎదుగుదలను అదుపు చేసి
పెద్దరికాల ఫెన్సింగులు చుట్టి
అనువైన రూపాలకు మళ్ళించుకోవడం
అసలది..
అది పరిరక్షణో..హక్కుల భక్షణో..!
తల తుట్టె నిండుగా
పేరబెట్టుకున్న ఆలోచనలు..
సహజ సిద్ధమైన నైపుణ్యాలున్నా..
తన ప్రమేయమే లేని
క్రియల ఎజెండాలు..
ఆధిపత్య చెట్టు నీడలలో
ఎదగలేని మొక్క తాను..
తరాలుగా ఆర్జించిన జ్ఞానము
సాధించుకున్న హక్కులు
వందల కొద్దీ పోరాటాలను చేసినా..
కొలత బత్తెంలా జీవనం
బంధింప బడిన..తన జీవిత పరిణామం
ఇక్కడ
తన ఆత్మవిశ్వాసాన్ని
పోగొట్టు కోవడమో..లాగేసుకో బడటమో
సంప్రదాయాల ముసుగులోని ఇదో అరాచకం
ఆమె మౌనం..
తెలుసా..అదే పెద్ద నిరసన !
మరీ వత్తిడి చేస్తే
బద్దలయ్యే..అతి పెద్ద ఆకాశమామె !
డా. దారల విజయ కుమారి
14
పేరు కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం
శీర్షిక... మహారాణి
సహనంపై ఉలితో మేకులు దించినా...
ఆమె ఆత్మ అభిమానం పై మాటల సూదులు గుచ్చినా మౌనమే...
రాయి రాయి రాపిడి లోంచి అగ్గి రాజేసినప్పటి కాలంలో నాటిన వివక్షత విష బీజాలు మహావృక్షాలై సమాజంలో కూకటి వేళ్ళతో నాటుకుపోయాయి పెకిలించ లేనంత బలంగా...
అవరోధాలు అంపశయ్యపై ఊపిరి పోసుకుని,
ఆటంకాల కట్టుబాట్లు చితిమంటను పేర్చినా... నేలన పడిన బంతిలా ఎగసి ఎగసి రాకెట్లా ప్రగతి పతం వైపు దూసుకెళుతోంది అంతరిక్షం దాకా...
అబార్షన్ల ఆస్త్రాన్ని విస్ఫోటనం గావిస్తూ... బాల్య వివాహాలనే అణు బాంబుల్ని చేదిస్తూ... అత్యాచారాలు చేసే కామమృగాల్ని నేలలో పాతి పెడుతూ...
తనపై విరుచుకుపడే దుష్ట శక్తులపై అపర కాళికై దునుమాడుతూ... వంటింట్లోంచి ప్రపంచాన్ని పాలించే అధినేతగా మారిన ఆదిశక్తి మగువ... మార్పు ఎక్కడా అని? చట్టాలు కాగితాలకే పరిమితమై, చట్టాలు సహకరించిన మానవ నైజంలో రాని మార్పు... రాజ్యాంగము లిఖించదు శాసించదు...
మగువకు మానసికంగా శారీరకంగా స్వేచ్ఛ హక్కులు సమానతను కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరిదీ...
అతివల పెదాలపై చిరునవ్వుల పూలు పూయిస్తేనే లోక కళ్యాణం...
త్యాగాల పద్మవ్యూహంలో నలిగే మగువకు కీర్తి కిరీటం పెడితే చాలదు, మగువను మహారాణిని చేయాలి...
మనసు అనే కాగితంపై మగువను దేవతగా గౌరవభావాన్ని కల్ఫిస్తేనే లోకక్షేమం...
మగువల కంట కన్నీరు మహికి ఇంటికి మగాడికి కంటకమే...
ఇకనైనా మారి మీరు రాసే ఆడదాని తలరాతను మార్చి రాసే విధాతలైతేనే మనుగడ లేదంటే జీవితాల్లో ప్రకంపనలే...
గుణంలోనూ, రణంలోనూ ఆమె ఎప్పుడూ సానబెట్టని వజ్రమే.
15
అంశం.....మహిళా దినోత్సవం సందర్భంగా
శీర్షిక...మరో అడుగు వేయనీ
సిగ్గు పరదాలను
తొలగించుకొని వస్తున్న
ఆ మొగ్గను ఆదిలోనే
తుంచేయకు......
ఆశయాల దుప్పటి
పరుచుకున్నఆహృదిని
అక్కడికక్కడే అది మేయకు...
ఆకాశానికి నిచ్చెన వేసి
జ్ఞానవిజ్ఞాన తారా చంద్రికలను
తెంపే ఆలోచనలకు
అంధకారం పులమకు ....
అందరి ఆత్మీయతను కోరే
ఆ మేలిముత్యం మనసుకు
మలినపు మాలలు కట్టకు.....
హరివిల్లు వర్ణాల ఆ పసిడి
అందానికి అనుమానపు
ముసుగు వేయకు...
శ్రమల దారంతో అల్లబడిన
ఆ దేహానికి ఆంక్షల సూదితో
గుచ్చకు....
పగలు రేయి తేడా తెలియని ఆ వంటగది దాటి మరో అడుగు వేయనీ
తను కోరుకున్న గమ్యం చేరనీ......!!
మొహమ్మద్ .అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ గో జి )
16
పేరు-దామర్ల నాగేశ్వరరావు
హైదరాబాద్
+++++++++++++++++++++++
ఓ మహిళా .
సృష్టికి మూలం నీ వే,
నీవు లేనిదే సృష్టి లేదు,
అమ్మ గా నీ పని అమరం,
ఓర్పు కు నీవే ప్రతి రూపం,
సహనం నీకు ఆభరణం,
పిల్లలు పెంపకం నాకు నీవే ఆధారం
భర్త తో కలిసి పాలు,నీరుగా
లీనమవుతావు,
నేడు పాఠశాల లన్ని స్త్రీలు సామర్ధ్యం గా నడుపు చున్నారు,
దేశ ప్రధానులు, అధ్యక్షులుగా
మహిళలు పరిపాలన చేస్తున్నారు
జయహో మహిళా జయం,విజయం
హామో-ఇది నా స్వీయరచన.
*****************************
17.
కోరాడ నరసింహా రావు
@ తెలిసి కొనుము...!
******************
జన్మ నిచ్చు అమ్మె మూలమీ
జగతికి... సృస్టి కాధార మీ
ఆదిశక్తి....!
ఈ పాంచబౌతిక ప్రపంచమున
ఆమె చైతన్య శక్తి యై...
అలరారు చుండె...!
అమ్మగా, అక్కగా.. అత్తగా, వదినగా.. ఆలి యై వచ్చి ...,
సేవలందించునీ సహన శీలి..!
చిట్టిపాపయై..,నట్టింటనదయాడి సిరుల కురిపించునీ శ్రీ మహా లక్ష్మి...!
ఆడదని ,అబలయని, అన్ని0ట ఆమెను అలుసుజేసి...,
అణగద్రొక్కినుకదా ఎన్నొనాళ్లు
పురుషాహంకార పసు బలము నేజూపి...అధికారమును చలా యించి ర హొహో...!
తిరగబడి, ఎన్నియో పురాటములు జేసి,
చదువు, సంధ్య లలోన చక్కగా రాణించి... పురుషులకు అన్నింట ధీటుగా నిలచి...,
ఆ నాటి మహిళను కాను..,
నేటి మహిళను నేను...
మాకన్నఎందైన ఎవరుమిన్న ?
యనుచు... నిలిచె నామె నిజ శక్తి రూపి యై...!!
అణు వుగా ఒదిగిన ఆటమికశ క్తి తను...!
తను విష్పోటనము చెందేనా..
ఆ విశ్వ రూపము గాంచ నెవని తరము...!?
ప్రేమ పంచి నీవు గార వించితి వా... , నీ జీవితము ఆనందా ర్ణవ స్వర్గ సీమె...!
ఆమె కంట కన్నీ రొలికించితివా
నీ బ్రతుకు నరకమే తెలిసి కొనుము...!!
********************

Comments
Post a Comment