ఆశ్వయుజ మాసం
✳️✳️✳️✳️✳️✳️✳️
కవి వరుల జాబితా
1. పి లక్ష్మణరావు గారు
2. కోరాడ నరసింహారావు గారు
3. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
4. గొర్రెపాటి శ్రీను గారు
5.మండ.నాగేశ్వర్రావు గారు
6.పిన్నక నాగేశ్వరరావు గారు
7. డా. పిళ్ళా వెంకట రమణమూర్తి గారు
8.జి.సూర్యనారాయణ గారు
9.ఆళ్ళ నాగేశ్వరరావు (కమల శ్రీ)*గారు
10.తంగిరాల నాగలక్ష్మి గారు
11.డా.వేమూరి సత్యవతి గారు
12.పిరాట్ల . వేంకట శివరామకృష్ణ ప్రసాదు గారు
13.డా..భమిడిమఱ్ఱి కమలాదేవి గారు
14.వనపర్తి గంగాధర్ గారు
15.కొంజేటి. రాధిక గారు
16.ఏ . భూపతి గారు
17.కాల్వ రాజయ్య గారు
18.:డా బల్లూరి ఉమాదేవి గారు
19. గుండ్ల రాజు గారు
20.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
21.మొహమ్మద్. అఫ్సర వలీషా గారు
22.వాణిసరోజిని లక్క రాజు గారు
23. సింహాద్రి వాణి గారు
24.మన్నె లలిత గారు
✳️✳️✳️✳️✳️✳️✳️✳️
1
*అగ్ని ఉవాచ*
పి.లక్ష్మణ్ రావు
**************
ఎంత ఎత్తుకి ఎగిరినా
జీవం కోల్పోయాక
క్రింద పడి
మట్టిలో కలవాల్సిందేనని
*తారాజువ్వ సందేశం!*
పలకరింపు కొద్దిసేపైనా
చిరునవ్వుల వెలుగులు
పంచమని
*చిచ్చుబుడ్డి ఆదేశం*
శబ్దం పెద్దదయితే
పెనవేసుకున్న బంధం
తునాతునకలైపోతుందని
*బాంబు చేస్తుంది హెచ్చరిక*
పనిగట్టుకొని వెలిగిస్తే
మన చుట్టే తిరుగుతుంది
*భూచక్రం*
అనుబంధాల్ని పలకరించమని
దాని సంకేతం!
నిశ్శబ్దంగా
వెలుగు జిలుగుల
ఆనందం వెదజల్లమని
*కాకర పువ్వొత్తు*
అభిభాషణం !
కారణాలు ఎన్ని వున్నా
కారు చీకట్లు తొలగించాలని
*వెన్న ముద్ద* అనుశాసనం !
బాణాసంచాలో
*అనల సందేశం* దాగి వుంది
తత్వం బోధపడితే
వ్యక్తిత్వం విప్పారుతుంది !
*పి.లక్ష్మణ్ రావ్*
వియనగరం
@ విశాఖపట్నం
9441215989
9381881083
2.
నవ్యకాంతుల దివ్య దీపావళి
కోరాడ నరసింహా రావు
***********
సంభవామి యుగే యు గే...!
లోక కంటకులను పరిమార్చగా....
యిచ్చిన మాటను నిల బెట్టు కుంటూ...
మత్స్య,వరాహ,కూర్మ వామన, పరసురామ, రామావ తారముల నెత్తిన శ్రీహరి...
ఎందరో దుష్టులను పరిమార్చగా... కృష్ణావ తార మెత్తి...
బాల్యము నుండే... దై త్య నిర్మూలన మొదలు పెట్టి...
ఆశ్వీజ చతుర్దశ దినమున సతీ సమేతుడై...
నరకాసురిని వధియించి...
నరక చతుర్దశ గా వినుతి కెక్కించ....!
లోక కంటకుని పీడవిరగడైనదని....
ప్రజ లెల్ల దీపతోరణాల తో...ఆనందోత్సాహాల పండుగ జరుపుకును రోజిది..!!
రావణ వధకు దసరా, సంక్రా0తులు జరుపుకొనగా...
నరకునివధతో దీ పావళి జరుగుతున్నది!
బాధల చికట్లు తొలగి ఆనందాల వెలుగులు నిండే పండుగిది...!!
సత్య,క్రుష్ణుల స్మరించుట కన్న....
శ్రీ మహా లక్ష్మిని ఆరాధించుట...
ఈ పండుగ లోని విసి ష్ఠత...!
దీపావళి మరుసటి దినము నుండే
హరుని ఆరాధించు
కార్తీక మాసం
హరి హరుల అ భేదత్వమునకు ప్రతీక !!
3
అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు Poet Vizag: కవితాగానం సీజన్ 6 పౌర్ణమి కవితా పోటీలకు
అంశం.. దీపావళి
పేరు..
అయ్యలసోమయాజుల ప్రసాద్.
సెయింట్ లూయిస్
అమెరికా
శీర్షిక..
అమావాస్య నాటి పున్నమి రేయి
................................
పేద గొప్ప తారతమ్యాలు లేక
చిన్న పెద్ద అసమానతలు చూపక
భరతావనిలో ప్రజలంతా ఆనందోత్సాహాలతో
జరుపుకునే ఏకైక పండుగ దీపావళి.
లోక కంటకుడు నరకాసురుని సంహారం చేసి
సత్యభామ విజయం సాధించిన సందర్భంగా
రావణాసురుని సంహారం చేసి
శ్రీరాముడు ధర్మపత్ని సీతమ్మ ,సోదరుడు లక్ష్మణునితో
అయోధ్యా నగరానికి వచ్చిన వేళ
ప్రజలంతా ప్రమిదలలో దీపాలు ఇంటి ముంగట పెట్టి
బాణాసంచాలు కాలుస్తు ఆనందంతో
అసూయ ద్వేషాలు మాని అహంకారమనే
అసుర ప్రవృత్తులను విడనాడి
అనురాగ ఆప్యాయతలతో
దేశ ప్రజలంతా ఒకరికొకరు
మిఠాయిలు పంచుకొని ఏడాది అంతా సుఖమయంగా ఉండాలని
చెడుపై మంచికి విజయం అని
సుఖసంపదలు కలగాలని మహాలక్ష్మి పూజ చేసే
అమావాస్య నాటి చీకటిని
పున్నమినాటి వెన్నెలగా
మార్చే
దీపావళి ఆనందాల కేళి..!!
.............................
ఇది నా స్వీయ కవిత
అయ్యలసోమయాజుల ప్రసాద్
సెయింట్ లూయిస్
యు ఎస్ ఎ (ప్రస్తుతం)
.................................
4
కవితాగానం వారి కవితల పోటీ కోసం ప్రత్యేకంగా రాసిన కవిత.
శీర్షిక:"నావ్యకాంతుల వేడుక..దీపావళి!"
కమ్ముకున్న చీకట్లను పారద్రోలే వెలుగుల వేడుక దీపావళి !
సత్యభామాదేవి నరకాసురుడనే రాక్షసుడ్ని వధించిన సూచికగా..
శ్రీరాముడు దశకంఠుడైన రావణాసుడ్ని సంహరించి
లోకానికి శాంతి ని,సౌభాగ్యాన్ని ప్రసాదించి
సీతా సమేతుడై అయోధ్య చేరిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని
మనమంతా ఆనందంగా జరుపుకునే పర్వదినం దీపావళి!
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా..
అమావాస్య నాడు ఆకాశమంత చీకటి సైతం మాయమైనట్లుగా..
బాణాసంచాల వెలుగుల్లో ప్రపంచం పునీతమవుతుంది!
వెన్నెల జాతరలు ఆకాశమంతా జరుగుతుంటే..
నింగి,నేల సంపూర్ణంగా కాంతివంతమవుతుంది !
కుల,మత,జాతి విబేధాలు మరిచి మానవాళి అంతా ఒక్కటిగా
దివ్య దీపాలు వెలిగిస్తుంటే ..
మతాబులు,చిచ్చుబుడ్లు,తారాజువ్వలు,రాకెట్ల,లక్ష్మీబాంబులు,కాకరపువ్వొత్తుల
వెలుగుల సంబురాలు ప్రత్యక్షమవుతుంటే ..
దీపావళి ..జన హృదయ సమ్మోహనావళి !
స్వచ్ఛమైన మనసులతో ప్రతి ఇంటా కాంతులు విరబూస్తుంటే..
నవ వసంతపు వెలుగులతో జగమంతా నిండిపోతుంది!
రచన : గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్) చరవాణి:9652832290.
5
దీపావళి🔥
===×====
ఈ అమావస్య రోజు
పున్నమిలా వెలిగింది.
ఈరోజే తెలిసింది
అందరి మొఖాలూ
మతాబులౌతాయని...
పిల్లలచేతిలో పువ్వొత్తు
చూసి,తాతయ్య మొఖం
మతాబులా వెలిగింది!!
నాయకులు పేలుస్తున్న
బాంబుల్ని నమ్మకండి
ఎప్పటిలాగే తుస్సుమంటాయ్!!
పేలదనుకున్న బాంబే
గమ్మత్తుగ పేలుతుంది
అందుకనే ఆదమరచి
ఉండకండి!! ఎపుడైనా పేలొచ్చు!!
జువ్వలా దూసుకుపోతేనే
అందాల్సింది అందుతుంది
లేకపోతే మన బతుకు
చీదేసిన చిచ్చుబుడ్డే!!
పేలాల్సిన టైం లో పేలితేనే
బాంబుకి విలువ..
లేకపోతే పేలని బాంబని
పెంటలో పడేస్తారు!!
మతాబు వెలిగినా
వెలక్కపోయినా పొగ రావాలి
అపుడే విషపు దోమలు
చచ్చినట్టు ఛస్తాయి!!
వెలుగుతున్న తాడుతాను
మరోవత్తిని వెలిగించినట్టే
చేతనైన ఉపకారంతో
మరోజీవికి చేయందించు..!!
ఆ అనుభూతిని నీకునువ్వే
మనసారా ఆనందించు!!!
సమాజపు ప్రమిదలో
వివేకమనే నూనె పోసి
విజ్ఞానమనే వత్తివేసి
జ్ఞాన దీపంవెలిగించి చూడు
ప్రతిక్షణం దీపావళే!!
---- మండ.నాగేశ్వర్రావు,✒️
7793939724.
సరిపల్లి,పెందుర్తి..
6
కవితా గానం దీపావళి రచన.
పిన్నక నాగేశ్వరరావు. 8--11--2026.
హైదరాబాద్.
అంశము :-- దీపావళి.
1.తే.గీ.
వరము పొందిన నరకుడు గర్వమ్ము తోడ
మునులు,మహిళలు,సురలను మూర్ఖమతిని
పట్టి బంధించి హింసలు పెట్టుచుండ
వేడె వారంత హరిని కాపాడమనుచు.
2.తే.గీ.
అభయమిచ్చి వారిని సాగనంపి హరియు
ననికి సిద్ధపడ సతి 'సత్య'యును తాను
వచ్చెదనన,సమ్మతిఁ దెల్ప భవితెఱింగి
కృష్ణ,సత్యలు రణభూమి కేగిరపుడు.
3.తే.గీ.
పోరు సల్పుచు మూర్ఛిల శౌరి యంత
సత్య గమనించి స్థితిని తక్షణమె తాను
విల్లు,శరములను గొని యా వీరనారి
శౌర్యమును జూపి నరకుని సంహరించె.
4.తే.గీ.
దుష్టుడైనట్టి నరకుని దునిమినట్టి
దినమునందున ప్రజలెల్ల తిమిరమింక
తొలగె ననుచును ప్రతి యింట తోషముగను
దీపముల వెలిగించ దేదీప్యముగను
నదియె దీపావళి పర్వమయ్యె నేడు.
***************************************
7
కవితా గానం సీజన్ 7
అంశం : *దీపావళి తేదీ: *08-11-2026*
---------------------------------------
శీర్షిక:: *తీయని గురుతులపేటి*
శ్రీ వైభవ దీపాల అనుక్రమసరళి
ఈ దీపావళి..
తేజో ద్వాహ సకలజనుల కేరింతల రవళి..
భువనాధీశుడు కృష్ణుడాడిన విధిని ముల్లోకాలు మెచ్చగా..
సన్మహితాత్ముడౌ భవుని చక్కని లీలయందిదొక్కటి కాగా!
దానవ సంచయము నట దండన జేయగ ..
అత్తరిధీరుడై వెలిగె అద్భుత రీతిని
కదనరంగమున..
అప్పరమాత్ముని సన్నిహితమై మెరిసే ధనుర్ధారియై సత్యభామ..
రక్కసుని సంహరించి వెన్ను దన్నుగ నిలిచె ధరణీ లలామ!
ఆనందోత్సాహాల పండుగై వచ్చింది దీపావళి..
తీయని గురుతులకు పేటియై జ్యోతులతో వెలిగింది ప్రతి వాకిలి..
కాంతుల నీను దీపములగాఢ సుగంధం కమ్మిన
ప్రతి లోగిలి..
ప్రీతి నలరింపజేసెడు బాలల ప్రమోద వీచికల నవశోభావళి!
యింటింటా
శ్రీమహాలక్ష్మిని కొలవగా..
దివ్వెల వెలుగుల వేకువసృష్టిద్దాం అనంతంగా..
యింత కన్న
యేమి భాగ్యం మనది పరమాత్ముని రూపమే కనుల కెదురుకాగా!
**************************
*హామీ పత్రం*
పైన పోస్ట్ చేసిన కవిత
నా ఆలోచనా స్రవంతిలో జాలువారిన కవితయే అని, కేవలం కవితాగానం సీజన్ 7 వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీపావళి కవితల పోటీ నిమిత్తం వ్రాసిన కవిత యని హామీ ఇచ్చుచున్నాను.
"""""""""""""""""""""""""""'''''''''''''""""""""
డా. పిళ్ళా వెంకట రమణమూర్తి
విశ్రాంత సంస్కృత అధ్యాపకులు
బి వి కె కళాశాల విశాఖపట్నం.
విశాఖ జిల్లా.
8
కవితా గానం7 పౌర్ణిమ కవితల పోటీ
అంశం: దీపావళీ
శీర్షిక:
*దీపావళీని ఎలాగ స్వాగతించాలి..?*
వరుస పెను తుపానులతో
చిత్తడై పోయిన చిరు బతుకుల్లో
మట్టి దీపాలను ఎలా వెలిగించాలి
దీపావళీని ఎలాగ స్వాగతించాలి..!
పత్తి వత్తులు నవ్వినా
సకల కల్తీల చమురుతో
జంట వత్తుల తోటి చంటి
దీపాలు వెలగటంలేదు..?
చిటపటలాడే ధర వరలతో
చిచ్చుబుడ్డిని ఎలా అంటించను..?
మైనంలా కరిగి పోయిన మోముతో
మతాబులాగ ఎలా నవ్వగలను..?
తమస్సులా పెరిగిపోతున్న
నరకాసురులను తరిమేందుకు
ఉషస్సుల తోరణాలను
ఊరూరా కడుతున్నాను
బాణా సంచాను పైకి ఎగరేసి
చీకటిని పటాపంచలు చేస్తున్నాను..!
అవనిలో అకృత్యాలను అరికట్టేందుకు
సిసీంద్రీలకు ఉన్న శక్తి చాలటం లేదు..?
వాడవాడలో సత్యభామలు రావాలి
చీకట్లుగా మారిన నరకాసురులను
కోటి దీపాల కాంతి పుంజాల
పంజా దెబ్బలతో సాగానంపాలి..!
*జి.సూర్యనారాయణ,6281725659.*
సదరు కవిత నాసొంతమని హామీ.
9
కవితాగానం వారి కవితల పోటీ కోసం ప్రత్యేకంగా రాసిన కవిత
అంశం : దీపావళి
ప్రక్రియ : వచన కవిత
తేది :8/11/2026
పేరు : డా. ఆళ్ళ నాగేశ్వరరావు ( కమల శ్రీ )
తెనాలి
గుంటూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము
చరవాణి :7416638823
కవితా శీర్షిక :
*చీకటిలో వెలుగు పూవు*
చీకటి అంటే ఏమిటో తెలియని వారికి,
వెలుగు విలువ తెలియదు.
వెలుగును చూడని వారికి,
చీకటి భయం తెలియదు.
చీకటి రాత్రిలో,
ఎవరూ చూడని చోట,
ఎవరూ విత్తనం వేయని నేలలో,
ఒక పూవు పూస్తుంది.
అది మామూలు పూవు కాదు,
అది వెలుగు పూవు.
దాని రేకులు పూల రేకులు కాదు,
దీపపు జ్వాలలే రేకులై విచ్చుకున్నాయి.
దాని సువాసన పూల వాసన కాదు,
ఆశా గంధమే గాలిలో పరిమళిస్తోంది.
దాని మీద మెరిసే మంచు బిందువులు కాదు,
అవి ఆనందంతో రాలిన కాంతి బిందువులు.
ఆ పూవు ఎవరి కోసం పూస్తుంది?
ఎవరూ అడగని ప్రశ్నకు సమాధానంగా,
ఎవరూ వెలిగించని చోట వెలుగు కోసం,
ఎవరూ నమ్మని చోట ఆశ కోసం పూస్తుంది.
చీకటి దాన్ని మింగాలని చూస్తుంది,
కానీ చీకటికే తెలియదు -
పూవును మింగితే, ఆ పూవే
చీకటి గుండెల్లో దీపమై వెలిగిపోతుందని.
మనిషి జీవితం కూడా అంతే,
కష్టం అనే చీకటిలోనే,
మనిషి అనే వెలుగు పూవు పూయాలి.
ఏడ్పు అనే రాత్రిలోనే,
చిరునవ్వు అనే దీపం వెలగాలి.
ఈ దీపావళికి మనం కోరుకోవాల్సింది ఇదే -
ప్రతి ఇంట్లో ఒక దీపం కాదు,
ప్రతి గుండెలో ఒక వెలుగు పూవు వికసించాలని.
ఆ పూవు వెలిగితే, ఇల్లు కాదు,
ఈ లోకమే దీపావళి అవుతుంద!!!
*********************
పై వచన కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను.
ఇట్లు
రచయిత
*- ఆళ్ళ నాగేశ్వరరావు (కమల శ్రీ)*
*తెనాలి
10
దీపావళి కవిత;
రుచి లేని వంటకం లా
ఛందస్సు లేని పద్యం లా
మనసు లేని మనిషిలా
భావం లోపించిన కవిత లా
వెన్నెల దాచుకున్న చీకటి లా
మూగబోయిన గళం లా
తన్మాత్రలు లేని ఇంద్రియముల లాగ
ప్రాణం లేని జీవం లా
చిగురించని మోడు బారిన చెట్టులా
రస సారములేని సంసారములా
జీవన కాళరాత్రి లో మనుగడ సాగిస్తున్న
నరకాసురుని పాలనలో
వెలుగు విరిసింది
మెరుపు మెరిసింది
ఆసురీ బాధలకు స్వస్తి పలుక కృష్ణ పరమాత్మ సత్యభామతో కూడి
నరకాసుర వధ గావించిన శుభ మహోదయం ద్వాపర యుగం లో
దీపావళి పండుగకు నేపథ్యం
రావణాసురుని శ్రీరాముడు హతమార్చిన దీరోజే త్రేతాయుగంలో
యుగ యుగాలకు
తర తరాలు ఆనందముప్పొంగ
దీపాల కాంతిలో టపాసుల మ్రోతలలో
తీపి పిండివంటలతో
క్రొత్త బట్టల సౌందర్యం తో ధన్వంతరీ, లక్ష్మీ కుబేరుల,దీప లక్ష్మి,ధనలక్ష్మీ పూజలతో
ఉత్సాహంగా శర్దృతువులో ఇంటింటింటా పిన్నలు,పెద్దలు అందరూ జరుపుకునే పండుగ
దీప్తులలరు దీపావళి🔯🔯🔯🌹🪷🥭🎊🥇🎉
రచన
తంగిరాల నాగలక్ష్మి
చరవాణి :7416638823
11
శీర్షిక.
"అపుడో-ఇపుడో"
"అపుడు ఇరవై రోజుల ముందే దీపావళి ని మోసు కొచ్చేవి ప్రత్యేక సంచిక లు!!
"వ.పా" చిత్రాలతో..
వహ్వా అనిపించే కథలతో..
వాకిట్లో ఎండబెట్టిన సూరేకారం, గంధకం,రజనులు!
చినుకులు పడితే అమ్మో!
తాటిగుల్లలు తిప్పుడుపొట్లాలకి,
మొవ్వతాటాకులు గుమ్మటాలకి,
జమ్ము పుల్లలు మతాబా గొట్టాల తయారీకి,మందు కూరటానికీ,
సేకరణ పిల్లలదే!
ఇంటిల్లిపాదీ హడావిడే!
కొమ్ము మిఠాయి, తొక్కుడు లడ్డు తీపి తినాలి గా!
నరకచతుర్దశి-నలుగుస్నానాలు,కొత్తబట్టలుకుట్టించటాలు!
వయసు, భయాలను బట్టి అగ్గి పుల్ల, పాము బిళ్ళ నుండి లక్ష్మి బాంబు దాకా!కాకరపూవొత్తి,మతాబా,ఏది కావాలి?
తాటాకుటపాకాయ,.సీమటపాకాయ, పేక, ఏదిపేల్చగలవో చూసుకో!
భూచక్రమా?విష్ణుచక్రమా? నీకేది కావాలి?
"తిప్పు తిప్పు దీపావళి!
మళ్ళీ వచ్చే నాగులచవితి!" జ్వలించే గోగుకాడల తిప్పుళ్ళు!
"నేనే కాల్చా భయంలేకుండా"గర్వం తెచ్చేపండుగ!
జాగ్రత్త చెప్పే వృద్ధులు!
మరి ఇపుడో--
పగలంతా బుల్లితెరలో భాగవతాలు!!
"ఆన్ లైన్ అప్పచ్ఛులు"!
రెడీ మేడ్ డ్రెస్సు
లు!
కాలుష్యభయంతోనరకాసురుడు
కొండెక్కాడనేమొ,
ఆకాశంలో కెళ్ళేక్రాకర్స్!
రంగు రంగుల నిప్పురవ్వలవిన్యాసాలు!
ఎవరు కాలిస్తే ఏం?
మెడ ఎత్తి తిలకిస్తేనే దీపావళి!!
"వాట్సాప్"ల్లో శుభాకాంక్షలవెల్లువలు కురిపిస్తే నే దీపావళి!!
++++
డా.వేమూరి.సత్యవతి.
విజయవాడ(.9885136308)
12
: పిరాట్ల వేంకట శివరామకృష్ణ ప్రసాదు
9849476315
_*పౌర్ణమి కవితల పోటీ అంశం : దీపావళీ*_
*1. చంపకమాల*
ఢమఢమలాడెపృధ్వికనుడందరుదిక్కులుపిక్కటిల్లగన్
ధిమిధిమినాట్యమాడెపలుతీరులనీప్రజసంతసమ్మునన్
తమగృహదీపముల్మెరిసెతామును చంద్రసమానకాంతులన్
అమవసనాడెపున్నమనియందరుపల్కిరియక్కజమ్ముగన్.
*2. ఉత్పలమాల*
దివ్వెల నవ్వులే భువిన దీపపు కాంతిగనోలలాడ,తా
మువ్వల సవ్వడుల్ సిరుల మూలము శ్రీమహ లక్ష్మివచ్చె, యం
దివ్వగ భోగభాగ్యములు,దీపపు యావళి దివ్యకాంతులన్
రివ్వున మాశమాయమయి,రేతిరి,పున్నమ సాంద్రమోచ్చహో!
*3. ఆటవెలది*
కర్ణ భేరి పగులు కఠినమైన ధ్వనులు
యింటి కప్పు గూల్చు, మందు గుండ్లు
తట్ట, బుట్ట, బట్ట, తగలెట్టు తళుకులు
అవని నిదియె గాదె అమవశన్న
*4. ఆటవెలది*
గుండె చప్పుడాపు, గుబులొల్పు బాంబులు
దట్టమైన పొగలు, దమ్ము నాపు
తుస్సు, బస్సు , యనుచు, దుమ్మెత్తు జువ్వలు
యింట, బయట, నొదులు,నింత చెత్త.
*రచన: పిరాట్ల . వేంకట శివరామకృష్ణ ప్రసాదు*
9849476315
13
అంశం : దీపావళి
పేరు : డా.భమిడిమఱ్ఱి కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
తేది : 8-11-26
శీర్షిక:- దివ్యదీపావళి
దీపాల ఆవళి దీపావళి
అంటే దీపాల వరుస
దీపావళి...
ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు
వచ్చే పండుగ దీపావళి..
భారతీయ సంస్కృతికి
ప్రతిబింబంగ
వెలుగొందే
పండుగలలో ఒకటి
దీపావళి
నరకాసుర సంహారము
జరిగిన మరుసటి రోజు ఆనందంతో జరుపుకునే పండుగదీపావళి.
రావణ సంహారా
నంతరం శ్రీరాముడు
అయోధ్యకు చేరిన
నాటి పండుగ దీపావళి
జాతి,కుల,మత, వర్గ
భేదరహితంగ దేశ
మంతట జరుపుకునే పండుగ దీపావళి..
చీకటిని పారదోలుతు
వెలుగులు జిమ్ముతూ
వచ్చే దివ్వెలపండుగ
దీపావళి
చెడుపై మంచి గెలుచు పండుగ.
దుష్టశిక్షణ పండుగ దీపావళి
లక్ష్మీదేవి పూజల పండుగ,
కేదారేశ్వర
వ్రతకల్ప పండుగ
దీపావళి.
ఐదురోజుల ఆనందాల
హేళి చైతన్యాల దీపావళి పండుగ..
ధన్ తేరస్. నరక చతుర్దశి,
గోవర్దనపూజ , చివరిరోజు
భయ్యాదూజ్ జరుపుకునే
పండగ దీపావళి
నిరాశల చీకట్లు పోయి.నవోదయ ఉషస్సుల
పండుగ దీపావళి
సంతోషాల పండుగ
సంబరాల పండుగ
సహస్రదీపాల పండుగ.దీపావళ
ఆనందాల పండుగ
ఆచారాల. పండుగ
ఐశ్వర్యాల పండుగ
దీపావళి
శుభములను గూర్చు శుభావళి,
శోభను
చేకూర్చుశోభావళి
దీపావళి..
కొత్తబట్టల రెపరెపల ,
పిండివంటల ఘుమ ఘుమల పండుగ, బాణసంచాల పండుగ
దీపావళి
జగతిని జాగృతంచేసి
చైతన్య దీప్తులను
విరజిమ్ము పండుగ
దీపావళి.
పైకవిత నాస్వంతం
14.
వనపర్తి గంగాధర్
*అంశం: దీపావళి*
*శీర్షిక:నవ్య దీపావళి*
మనుషుల మనుసులన్నీ నిశీధి వీధులు
హృధిలో స్వార్ధపు తిమిరాలు నిండిన మానవులు
ఎటు చూసినా విషపు గుండెల పలకరింపులు
ఆనందం మచ్చుకైనా కానరాని నిషాచరాలు
అనుబంధాలు బంధాల చిరునామాలెక్కడ
స్నేహితుల చిరు పలకరింపులెక్కడ
ఆత్మీయ పిలుపుల కాంతులెక్కడ
అంతా అమావాస్య చీకట్లు అలుముకున్నాయి
నేడు ఎక్కడ చూసినా నరకాసురులే
మానవ రూపంలో సంచరిస్తున్న రక్కసులు
మానవతను మరచిన దానవులు
ప్రతి సంఘటన భయానక దృశ్యాలు
నాడు సత్యభామ అరకాసురున్ని వధించింది
ప్రజల గుండెల్లో దీపావళి వెలుగులు నింపింది
నేడు స్త్రీలపై అత్యాచారాలు చేస్తున్న
మానవ నరకాసులను చంపే సత్యభామ లేరి
వనితల కళ్ళల్లో వెలుగు దివ్వెలు పూయాలి
అతివla హృదయాల్లో దీపాలు వెలగాలి
వారి చిరునవ్వులు తరాజువ్వలవ్వాలి
అదే అదే అసలైన నవ్య కాంతుల దీపావళి
*పేరు: వనపర్తి గంగాధర్*
*ఊరు:హన్మకొండ*
*చరవాణి:9440146435*
హామీ పత్రం: ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
15
పేరు... కొంజేటి. రాధిక
ఊరు... రాయదుర్గం
అంశం దీపావళి
శీర్షిక... వెండి వెలుగులు
నేలంతా వెలుగు పూలు పరచుకున్నట్టు,
అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి జాతిని జాగృతం చేయడానికి,
దీపపు కాంతులతో కల్లాపి చల్లినట్టుంటుంది దీపావళి నాడు...
ఆశ్రయిజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా పిలుచుకుంటూ,
ద్వాపరయుగాన ద్వారకాధీశుడు దేవేరి సత్యభామతో నరకాసుర వద గావించగా,
సంతోషంతో ప్రజలు దీపాల వెలుగులతో సంబరాలు జరుపుకునే దీపావళి పండుగ...
అమావాస్య చీకట్లను పారద్రోలి, బాణా సంచాను కాల్చి జరుపుకునే అనందరవళి దీపావళి...
రావణ సంహారం అనంతరం సీతారామ లక్షణులు అయోధ్యపురికి ఏ తెంచిన శుభ సందర్భంగా ప్రజలు జరుపుకునే ఆనందాల రవళి దీపావళి...
చెడుపై మంచి సాధించిన విజయం కులమతాలకతీతంగా జరుపుకునే పండుగ పెద్ద చిన్న అందరూ కలిసి ఇంటిలిపాది పసరుతులు లేని శ్రావ్యమైన దీపపు కాంతుల సంగీతాలను జరుపుకుని,
కాలుష్య రహితంగా,
జాగ్రత్తలు పాటిస్తూ
పర్యావరణను పరిరక్షిస్తూ
నవ్వుల దీపావళిని జరుపుకోవాలని అంగరంగ వైభవంగా...
చిన్నపిల్లల అరుపుల్లా డాం డాం అనే శబ్దం వచ్చేటపాసులు,
యౌవనపు పొంగులతో పైకి ఎగసే చిచ్చుబుడ్లు,
రయ్ మని పైకెగసి,
చప్పున నేల పడే రాకెట్లు,
భూ మండలమంతా తిరిగి తిరిగి,
ఆఖరికి చేరేది స్మశానమేనని తెలిపే భూచక్రాలు,
ఆచార సాంప్రదాయాలను ఆకలింపు చేసుకుని,
జరుపుకుందాం ఆనందాల దీపావళిని.
16
అంశం...దీపావళి
శీర్షిక....ఆనందం
పేరు . ఏ . భూపతి, హైదరాబాద్, 9989218154..
8.11.26
యుగాల నాటి యాది ,
తరాల నాటి స్మృతి,
మరవలేదు మన జాతి,
చిన్న పెద్ద తేడా లేదు,
ఆడమగ బేదం లేదు,
కులాల కుళ్లు లేదు,
మతాల మత్తు లేదు
చెడు, చేదు పై మంచి
మానవత్వం ,మరియు యుద్ధంలో ,
పోరాటాల పర్వం లో
సాధించిన విజయం తో
ఆనందమయం ఐన వేళ
వెలుగులు చిమ్మిన పండుగ,
సంతోషాల లోగిలి లో
ముంచిన పండుగ రోజు
దీపావళి , నలు దిక్కు ల కాంతులు విరజిమ్మె చిన్న
పిల్లల చిరు గంతుల కేరింతల
పండుగ దీపావళి , ఊరూర ప్రతి వయస్సు కు వెలుగు
చూపే పండుగ దీపావళి,
కథలు ఎన్ని ఉన్నా కష్టాన్ని
మరపించ శక్తి దీపావళి,
హద్దులు లేని ఆనందం లేగ , పసిడి
మనసు లకు సొంతం దీపావళి ,
ఈ కవిత నా సొంతం, అనువాదం కాదు ..
17
Kalva Rajaiah
శీర్షిక; దీపావళి
సీ.
నరకాసురుని జంప నారాయణా మూర్తి
సత్యభామగలిసి చక్రమేయ
దుష్టుడు మరణించి దుర్మార్గ మెడలగా
దీపాలనెలిగించె దివ్యముగను
అన్యాయమొదిరించి అవనినీ గాపాడి
చీకటి నిటబాపి చేర్చె వెలుగు
నాడు దీపావళి నవ్యంగ జరుగగా
అదియేపండుగనరి హర్షమొంది
ఆ.వె
లక్ష్మి పూజ లన్ని లక్షణముగ జేయ
సిరులనిచ్చునమ్మ చింతదీర్చు
వెలుగులింటనింపి వెతలన్ని బాపియు
జయము లిచ్చు లక్ష్మి జగతి వెలుగ
కాల్వ రాజయ్య 🖊️
తెలుగు ఉపాధ్యాయులు
9177494235
18
అంశం: దీపావళి
శీర్షిక: దివ్వెల పండుగ
పేరు:డా బల్లూరి ఉమాదేవి
8/11/26
దీపావళి
కనరండి కనరండి దీపావళి ధగధగల
నిశి రేయిన వెలిగేటి స్వచ్ఛదీప కాంతుల
దుష్టులను శిక్షించగ అలనాడా కృష్ణుడు
సాగాడు సతితోడ భూదేవి సుతు నణచ
అర్ధాంగికి అసలు అర్థ మొసగునట్టులాసత్య
పతిని కూడి సారించె నారిని యలవోకగ
శరము తాకగానె సమరంలో కూలాడా నరకుడు
నాటినుండె మొదలైంది రంగుల దీపావళీ
ఇలలోని దేవతలు భువిలోనిమానవులు
పొందారు ఆనందం జరిపేరు సంబరం
ఇంటవెింటా వెలుగులే వూరంతా కాంతులే
రంగులీను కాంతులతో జరుపుదాం పండుగను
అతిత్వరలో జరుగబోవు తెలుగు కవుల
పండుగను విజయవంత మొనరించగ
వినిపిద్దాం కవితలను మురిపిద్దాం శ్రోతలను
శుభమైన తరుణమిది మించపోవ దొరకనిది
కవితా శంఖం పూరించగ త్వరితగతిన
తరలిరండు కదలి రండు .
స్వీయ రచన
డా బల్లూరి ఉమాదేవి
19
Gundla Raju గారు
దీపావళి శుభాకాంక్షలతో...*🪔🪔🪔
సీసపద్యము,
తారజువ్వలు మింట తనరారుచుండునే
దీపాల పర్వాన దివ్యముగను
భూచక్రములునేల పురవీధులందున
దేదీప్యమైవెల్గు దివ్యముగను
చీకట్లు తొలగించి చిచ్చుబుడ్లన్నియు
తిమిరసంహరణమౌ దివ్యముగను
కాకరవత్తులు కష్టాలనెడబాపి
దివ్య సంపదలిచ్చు దివ్యముగను
తేటగీతి,
రక్కసుల బాధలను దోల *సత్యభామ*
సంగరమునందు దూకెనా సాహసమున
*నరక* సంహారమొనరించి నవ్యముగను
సజ్జనులను రక్షించెనా సరసిజాక్షి!!
కందపద్యము,
కరమున శరమును దాల్చియు
నరకుని సంహరణ చేసె నానా విధముల్
విరులెన్నియొ వెదజల్లిరి
ధరపై దేవతలు చూడ ధగధగ మెరిసెన్!!
సీసపద్యము,
దీపాలకాంతులు దివ్యమౌ శ్రేణులు
పాపాలు తొలగించు పాటిగాను
మానవత్వముగల్గు మనసైన దీపాలు
వెలిగించి ప్రసరించు విరివిగాను
వరవదాన్యమునెల్లవైభవమ్ముగజేయ
సిరులనే సమకూర్చు శీఘ్రముగను
సజ్జనాళికెపుడు సాయమ్ము నొనగూర్చి
సంవిధానమొనర్చు సౌమ్యముగను
తేటగీతి,
కలియుగమ్మున కలలైన కనగలేని
మానవులకెప్పుడునునీవు మమత పంచి
నడత నేర్పిన నవనిపై నవ్యముగను
కాంతి ప్రసరించు మనుజుల కన్నులందు!!
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
*గుండ్ల రాజు*🙏
:దీపావళి శుభాకాంక్షలతో
ఉత్పలమాల పద్యము
దివ్వెల వెల్గు గాంచగనె దీనజనావళి మోదమెచ్చు నా
దివ్వెలు కాంతు లీనగనె దివ్య మనోహర తేజమిచ్చు నా
దివ్వెలు వెల్గు పంచగనె దిక్కులనన్నిటపూలు విచ్చు నా
దివ్వెల కాంతి చూడగనె దీవెన లిత్తురు దివ్య దేవతల్!!
గుండ్లరాజు
20
అంశం :::: దీపావళి
స్వీయ రచన, సాహిత్యరత్న కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, హైదరాబాద్, సెల్ ఫోన్::: 62816 979 82 .
శీర్షిక: దివ్య దీపాల నర్తనశాల !
ఆశ్వయుజ అమావాస్య నిశీధిలో, అవతరించిన శరత్కాల కాంతి తోరణంలో,
చీకటి తెరలను చీల్చుకుంటూ సాగే, చేతనత్వపు నవ చైతన్య రథమిది!!
మట్టి ప్రమిదల గర్భగుడిలో, చిరునవ్వులు చిందించే జ్యోతిర్మయ రూపాలతో,
ఆవునేతి సుగంధాల పరిమళంలో, అజ్ఞాన భంజన దీపాల విన్యాసాలు!
నరకాసురుల లాంటి దుర్గుణాలను, దహించివేసే సంకల్ప జ్వాల ఇది,
సత్యభామ సమర శౌర్యానికి, సమర్పించిన విజయ నీరాజనమిది!
రాఘవేంద్రుని రాకతో అయోధ్య, రత్నదీపాల హారతిగా మారిన క్షణమిది!
ముల్లోకాలు మురిపెంగా మంగళ వాయిద్యాలు
మ్రోగించిన సమయమిది!!
కరచాలనం చేసే కాకరపువ్వొత్తులు, గగనాన మెరిసే తారా జువ్వలు!
చిచ్చుబుడ్ల రంగుల చిద్విలాసాలు, భూచక్రాల భ్రమరీ నాట్యాలు!
పగలు రేయి ఒక్కటైనట్లుగా, పటాసుల మోతతో పరవశించే జగతి!
ముంగిట విరిసిన రంగుల ముగ్గులు, ఇంటికి తెచ్చే లక్ష్మీ కటాక్షపు సిరులు!
ధనలక్ష్మి పూజల మంత్రోచ్ఛారణతో, ధరణి పులకించే ఆధ్యాత్మిక వేళ!
బాలల కళ్లలో మెరిసే కాంతులు, వృద్ధుల పెదవులపై విరిసే దీవెనలు!
కొత్త వస్త్రాల కాంతులలో, కోటి ఆశల హరివిల్లులు!
ఈ కాంతి జైత్రయాత్రలో, కనుమరుగై పోవాలి కపటత్వపు కారుచీకట్లు!
ప్రతి హృదయంలో ద్వేషాన్ని తుడిచే, ప్రేమామృతపు తియ్యని మిఠాయిలు.
మమతల పందిరి కింద, మనసారా మురిసిపోయే బంధుమిత్రుల కలయికలు!
ఆశల ప్రమిదలలో ఆనందాల తైలం, పోసి వెలిగించిన విశ్వశాంతి దీపం!
మతాల హద్దులు చెరిపేసి, మానవత్వాన్ని చాటే సమైక్యతా గీతం!
పల్లె పడుచుల నవ్వుల తోరణాలు, నగర వీధుల విద్యుత్ కాంతుల హారాలు! అలా!!
నిరుపేద ఇంట సైతం, నిండుగా కురవాలి వెలుగుల జల్లులు!
కాలం అనే కాన్వాస్‌పై, దీపావళి ఒక అద్భుత వర్ణచిత్రం!
అదే మన మనసుపై నిలిచిన ప్రతిబింబం!!
ఇంటింటా వెలిగే దివ్య దీపాల నర్తనశాల , రేపటి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు కళాశాల !!
21
అంశం.... దీపావళి
శీర్షిక....అన్నదాత పండుగిది
నరకాసుని వధించిన విజయానికి గుర్తు
దీపావళి పండుగ
అధర్మం మీద ధర్మం సాధించిన
గెలుపు బావుటా ఇది
జగమంతా జరుపుకునే
వెలుగుల పండుగ ఇది...
మట్టి ప్రమిదలో నూనె పోసి
భక్తి అనే ఒత్తిని చేర్చి
జ్ఞాన దీపాన్ని వెలింగిచిన వేళ
మనసులోని మాలిన్యాన్ని
పటాపంచలు చేసే పండుగిది ...
ఆకాశ పందిరిలో తారాజువ్వలు
సంతోషాల హారాలై
చీకటి తెరలను చీల్చాలి
చిటపటలాడే చిచ్చుబుడ్లంటి మనస్తత్వాలు
మనుషుల్లోని ద్వేషాలను తొలగించి
ప్రేమను పంచాలి
వెండి వెలుగుల కాకర పూవొత్తులు
చిన్న పిల్లల నవ్వుల్లా
ప్రతి మోములో దివ్య కాంతియై వెలగాలి....
తీపి వంటకాలతో ఇళ్ల ముంగిళ్ళు నిండాలి
కారు మబ్బులు తొలగాలి
ప్రకృతి కరుణించి
రైతు కన్నీరు తుడవాలి
అప్పుడే కదా అసలైన దీపావళి
అవనిని ఏలే అన్నదాత పండుగిది...!!
హామీ... నమస్తే 🙏ఈ కవిత నా స్వీయ రచన అని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను.
మొహమ్మద్. అఫ్సర వలీషా
ద్వారపూడి. (తూర్పు గోదావరి జిల్లా).
22
పౌర్ణమి కవితల పోటీ
దీపావళి
ప్రక్రియ పద్యం కందం
వాణిసరోజిని లక్క రాజు
కం.
నరకాసుర సంహారము
ధరలో నానందమనగ ధర్మ ము గెలువన్
నరయగ కొడుకని యెంచక
సురభూసురులెల్లబొగడ సుదతియె గూల్చెన్
చెడుపై మంచియె గెలువగ
విడిపోయను తిమిరమనుచు విరియగ వెలుగుల్
కడుసంబరమున దివ్వెల
వడివడి వెలిగించి రింట వాకిటి లోనన్
తప్పులు సేయగ శిక్షలు
తప్పవు, తనవారికైన ధరణిని యనుచున్
చెప్పక చెప్పెచు సత్యయె ,
నప్పలుకులు సత్యమనగ యవనిని జాటెన్
నింగిన చుక్కలు నవ్వుచు
చెంగున భువిజేరినట్లు చెలువము మీరన్
రంగుల కాంతుల దివ్వెలు
హంగుగ వరుసలు దీరుచు నవనిని మెరసెన్
మెరయుచు తళతళ మిలమిల
సురసుర నింగికి నెగిరెడి జువ్వల తోడన్
గిరగిర తిరిగుచు భువిపై
మురిపించుచు నుండె వివిధ భూచక్రములే .
పిల్లలు పెద్దలు ముదమున
యెల్లలు లేనట్టి ప్రీతి యెలమిన లక్ష్మిన్
చల్లగ దీవించమనుచు
కొల్లగ దీపములబెట్టి కోరెద రింటన్.
23
కవితాంశం:-- దీపావళి
రచన:-- సింహాద్రి వాణి
శీర్షిక:-- నిజమైన దీపావళి
ఊరు:-- విజయవాడ
చరవాణి:--7569820872
ఆశ్వయుజ మాస అమావాస్య నాడు
చిమ్మ చీకటిని తొలగించి భూమ్యాకాశాలను
వెలుగు వెల్లువలో ముంచే దీపావళి విరజిమ్మే ప్రకాశం
జీవితాలలో నిండిన తిమిరాన్ని పారద్రోలేందుకు
పట్టుదలే సాధనమని ప్రబోధించే వెలుగుల పర్వం.
చెడు విజృంభించి తన ప్రతాపాన్ని
చూపిస్తున్నప్పుడు
తప్పకుండా సమాజం మేలుకోరే పరిష్కారం లభిస్తుందని తెలియజేసే నరకాసురుడు కోరుకున్న వరం, తల్లిచేతిలో మరణించాలని.
పెరుగుట విరుగుట కొరకే నని నిరూపించిన నరకుని చరిత్ర.
సమస్య ఒకటే అయినా పరిష్కారాలు పలు విధాలుగా వుంటాయి.
ఒక వైపు పరిష్కారాన్ని చూపిస్తున్నా, రెండవ వైపు ఉచ్చు బిగియ వచ్చు
జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేసినప్పుడే విజయం సొంతమౌతుంది.
అహంకార పూరిత అనాలోచిత చర్యలు మొదటికే మోసం తెస్తాయి.
సమాజంలో విలువైన జీవితం గడిపేందుకు,
ఈర్ష్యా ద్వేషాలు, కుళ్ళు కుత్సితాలను చీకట్లను తొలగించుకునేందుకు,
మనసులో మానవతాకాంతి
దీపాలను వెలిగించుకున్నప్పుడే
మనిషికి నిజమైన దీపావళి.
హామీ:-- ఇది నా స్వీయ రచన.
24
అంశం: దీపావళి
పేరు:మన్నె లలిత
ప్రక్రియ :పంచపదులు
శీర్షిక: దివ్వెల పండుగ
#################
1
మంచి పై చెడు విజయం సాధించిన రోజు ఇదేగా ...
సత్యభామ నరకుని వధించిన రోజు ఇదేగా ...
శ్రీరాముడు అయోధ్యకు వచ్చిన రోజు ఇదేగా...
ప్రజలు దీపాలపండుగ చేసుకున్న రోజు ఇదేగా ...
దీపావళి అంటే దీపపు వరుస అని అర్థమేగా లలిత!
2
పసుపు బొట్లతో గడప అందంగా తయారు చేస్తాము ...
కొత్త బట్టలు కట్టి సంతోషంగా తిరుగుతాము...
దీపావళి రోజు దేవుని పూజించి మొక్కుతాము ....
స్నేహితులతో కలిసి అలాయ్ బలాయ్ తిరుగుతాము ...
పటాకుల శబ్దంతో వీధులు సందడి చేస్తాము లలిత!
3
మతాబులు చిచ్చుబుడ్లు తలస్నానాలు కొత్త బట్టలు...
మట్టి ప్రమిదలు పోయి వచ్చాయి రంగు ప్రమిదలు ...
తులసమ్మ దీపములు ఇల్లంతా వెలుగులు ...
చీకటి తొలగించే పండుగ వెలుగులు లలిత!
4
దీపావళి సంబరం చేసుకోగానే సరికాదు కదా ...
పేదలు కూడా దీపావళి జరుపుకోవాలి కదా ...
ఒక కంటి నీరు మరో కంటికి సంతోషం కాదు కదా...
ఒళ్ళు కాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కదా ...
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం జాగ్రత్త లలిత!
##################
హామీ
ఇది నా సొంత రచన కేవలం కవితా గానం కోసం రాసినదేనని, ఏ సమూహాల్లోనూ పెట్టలేదని ,ప్రచురించలేదని హామీ ఇస్తున్నాను.
మన్నెలలిత
హైదరాబాద్.
Comments
Post a Comment