నిర్వహణ
వీరా గుడిపల్లి (వీరాజీ)
శివునూరి లలితా కృష్ణ
************
1 కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
2.వేమూరి సత్యవతి గారు
3.అపరాజిత్ గారు
4. ఆళ్ళ నాగేశ్వరరావు గారు
5.సింహాద్రి వాణి గారు
6.గజవెల్లి శ్రీ నివాసాచారి గారు
7.నాయకంటి నరసింహ శర్మ గారు
8.కోరాడ గారు
9.డా.భమిడి మఱ్ఱి కమలా దేవి గారు
10.వేదాంతం సురేష్ బాబు గారు
11.వనపర్తి గంగాధర్ గారు
12.ఏ.భూపతి గారు
13.గొర్రెపాటి శ్రీ ను గారు
14.జక్కిడి వెంకట్ రెడ్డి గారు
15.కవిత వెంకటేశ్వర్లు గారు
16.సింగీతం సంతోష్ కుమార్ గారు
17.లలితాచండి గారు
18.దోసపాటి వెంకట రామచంద్ర రావు గారు
19.మీనా కుమారి గారు
20.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
21.కొంజేటి రాధిక గారు
22.డా.బల్లూరి ఉమాదేవి గారు
23.దారల విజయ కుమారి గారు
24.తరణికంటి సూర్య లక్ష్మి గారు
25.తంగిరాల నాగ లక్ష్మి గారు
26.ముడుంబై తిరు వేంకటాచార్యులు
27.వురిమళ్ళ సునంద గారు.
28.శివునూరి లలితా కృష్ణ
29.వీరా గుడిపల్లి
****************
కల్తీకాని దైవం
14052023
వీరా గుడిపల్లి
*************
ఇప్పటి వరకు
కల్తీ కానిది
ఇంకెప్పటికీ కానటువంటిది
అమ్మ ప్రేమ
దేశమంతా నిన్ను తలకెత్తుకున్నా
ఏ తప్పుడు పనో చేసి
ప్రపంచమే వెలేసినా
లోపం కనిపించని ప్రేమ
ఎగరలేని సంతుకోసం
తనూ కార్చిచ్చు లో కాలిపోయింది
వదిలేసి పారిపోలే
తండ్రి కోసం కొడుకే
గొడ్డలితో తల నరికినా
చిరునవ్వుతో తల వంచి
ప్రేమను పంచింది
కొడుకు
దుర్యోధనుడైనా
ధర్మజుడైనా
అష్టా వక్రుడైనా
పురూరవుడైనా
సవ్యసాచి ఐనా
ఉత్తరుడైనా
ప్రేమించడం మానలే
ప్రేమించడం తప్ప
మరేమీ తెలియని పిచ్చి తల్లి
పాత్ర మారనంత వరకు
వేలెత్తి చూపలేమసలే
అమ్మంటే అంతే
తను ధ్వంసమై మట్టిలో కలిసి
మొక్కకు ప్రాణమిచ్చే
తల్లి మనసు విత్తనానిది
తనవలన కాకున్నా
కాకిని దోఖా చేసైనా బిడ్డకు స్వాగతం పలికే అమ్మ కదా కోకిల
అమ్మంటే
పిల్లల్ని తప్ప
మరేమీ చూడలేని ప్రాణి
ఎప్పుడైనా,ఎక్కడైనా
ఫస్ట్ ప్రయారిటీ పిల్లలకే
ఆ తర్వాతే
ఆయనైనా ఇంకెవరైనా
ఆమె కళ్ళు వెతుక్కునే ది మనల్నే
ఆమె చేతులు ఎత్తు కునేది మనలనే
తను హత్తుకునేది పిల్లల్నే
తానెప్పుడు తనకోసం బతికిందని
ఆ పాత్రలో ఉన్నంత వరకు
ఆమెప్పుడూ
ఓ తులసి మొక్క
ఓ బిల్వదళం
ఒక పారిజాత పుష్పం
కల్తీ లేని దైవం
----------------వీరా గుడిపల్లి
1
రచన:::కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
పాతర్లపాడు ఖమ్మం
********************************************************
అమ్మ! లేకుంటే !?
ఆత్మీయతకు రూపం ఎక్కడిది ?
అనురాగానికి
ఆ గానం ఎక్కడిది!?
కనిపెంచి
కోరకనే వరాలిచ్చు వేల్పు
కష్టాలను గెలిచే ధైర్యం
కన్నీళ్లు తుడిచే కారుణ్యం!!
పోరులో వీరుణ్ణి చేసే శక్తి
దీటుగా నడిపించే సంకల్పం
తీరైన మనిషిని చెక్కే శిల్పి
సాటిలేని మేటిగ నిలుపు యుక్తి!!
సమస్తం
ఆపాదమస్తకం
అమ్మ లేని అణువుందా నీలో
అసలు ఈ ప్రపంచం ఉందా?!
అమ్మ కాదు బ్రహ్మ
ఆయువు పోసే మర్మం
ఆమెకే సొంతం, అందుకే
ఏ మర అమర లేదు ఈ ఇలన !!
అమ్మ ప్రతిరూపం నీవే అందుకే
ఆత్మీయ రూపము కావాలి....
ఆ అమ్మ పేగు బంధం
ఆజన్మాంతం అమృతం వర్షించాలి ...
అందులో
అందరూ ఆనందంగా తడిసి ముద్దవ్వాలి!!
స్వీయ రచన:: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
2
భూమ్మీద కంటూ వచ్చాక
ధైర్యంగా,భద్రంగా,ప్రేమగా
అతి సమీపంలో నిలిచిన అమ్మ!!
పాలు గామారి,నోటిని తడుపుతూ...
ఆకలిని తెలియనీయకుండా..
మల, మూత్రాల రోత తెలియకుండా..
మెత్తని చేతుల భరోసా అమ్మ!!
చిట్టి అడుగులు,చిన్ని చేతులకి, నీరే దో ,నిప్పేదో తెలియనిబుజ్జాయి కి
అమ్మ చేయూత,అమ్మ-ఒడి అపురూప నిధి!
ఓర్పు చూపుతూ, ఓదార్పు నిస్తుంది!
ఆలోచన నేర్పుతూ సలహాల నిస్తుంది!
సభ్యత నేర్పుతూ.. నిలబెడుతుంది!
సంస్కృతి ని సవ్యంగా పాటిస్తూ ఆదర్శం గా నిలుస్తుంది!
ఎన్ని రోజులు
ఎన్ని నెలలు
ఎన్ని వత్సరాలు పరుగులు పెట్టినా
అమ్మ- ఒడి అపురూప నిధి కదా!
కుట్రలు,ద్వేషాలు,కోపాలు,రోషాలు అసూయలు తాకని ఆత్మీయత!
అమ్మ నీకు గృహవైద్యురాలు! ఇష్టమైన పిండివంట.!! మమతకి మారుపేరు!!
అమ్మ ప్రేమకి అందరం లొంగి పోదాం!!
అమ్మకి ఆనందాన్నిచ్ఛేలా..
జీవిద్ధాం!!
అమ్మకి ఒక రోజే మిటి? జీవితమంతా ఇచ్చి గౌరవిద్దాం!!
-+-+-+-
వేమూరి.సత్యవతి
విజయవాడ.
3
అమ్మా,,,,,,,,,,!
అమ్మా,,,,,,చిరుప్రాయంలో నాకు
మదిరోయగ ఎన్నో ఉడిగాలు చేశావు
చందమామను చూపిస్తూ గొరుముద్దలు తినిపింఛావు
చదువుల తల్లి సరస్వతిలా
గుణింతం చేసుకుంటూ చదవడం నేర్పావు
ఆటలాడి అలసిపోయి వస్తే
నిద్రపుచ్చెందుకు కాళ్లు వత్తావు
అన్నం కంటే కూరలెక్కువగా పెట్టి పెరుగన్నం,,,,,,,,,,
ఇలా తింటే ఆరోగ్యంరా కన్నా,,,,,,అన్నావు
కాలేజి చదివేటప్పుడు
నాన్న చాటుగా దాచుకున్న డబ్బులు ఇచ్చేదానివి
అమ్మా,,,,,,,అందరు నాలోని లోపం చూపించి
గేళిచేసి అవమానించి వేధిస్తున్నారని ఏడిస్తే
ఓదారుస్తూ చదువే నీ ఆయుదం
ఎవ్వరినీ పట్టించుకోకు
ధైర్యం ప్రోధి చేసుకుని కష్టపడి చదువు
నీవు ఎదిగినప్పుడు వాళ్లే మెచ్చుకుంటారు
అని బుద్దులెన్నో నేర్పావు
మనస్సు పరి పరి విధాల వేదనల సంవేదనలతో
కష్టాల కడలి ఈది ఈది
ఇద్దరు పిల్లల తండ్రినయి
ఉద్యోగంలో నిలదొక్కుకున్నాను
అర్ధాంతరంగా నాన్న పోయి
కుటుంబ సమస్యల ఆటు పోట్లతో
నీ జీవితమెప్పుడూ కష్టాల కన్నీళ్ల కడగళ్లే
నీవు వృద్దాప్యంలో కూడా మా పైనే ధ్యాస
పెద్దచెల్లె భర్త గతించి
బ్రతుకు అంధకారమై
పడరాని పాట్లు పడుతుంటే
నీవైనా నేను,చిన్నచెల్లె అయినా
సహాయం అందిద్దామంటె
అందించలేని పరిస్థితి
నీ కన్నపేగు పాట్లు అన్నీ ఇన్నీ కావు
మాకు పరమాన్నం పెట్టి
నీవు కటిక దారిద్యం అనుభవించావు
వృద్దాప్యం నీకు శాపంగా మారకుండా
నేను చిన్నచెల్లె చేదోడు వాదోడుగా వుంటామమ్మా
మా కళ్ళల్లో నలుసు పడ్డా భరించలేని దానివి
అమ్మా,,,,,,,,,నీకు ఏ ఊడిగం చేసినా రుణం తీర్చుకోలేం,,,,,,,,,,!!?!!
ఆపరాజిత్
4
సందర్బం: మదర్స్ డే
పేరు : ఆళ్ల నాగేశ్వరరావు
ఊరు : తెనాలి
జిల్లా : గుంటూరు
చరవాణి :7416638823
కవితా శీర్షిక :
"" అనురాగమయి ""
నీ రూపు గాంచక ముందే
నీ గొంతు వినక ముందే
నీ రూపును ఉహించుకుంటూ
నీ మృధుమధుర పలుకులకై నిరీక్షిస్తూ
నీవు పొత్తి కడుపులో తన్నే తన్నులను మమకారంతో భరిస్తూ
నిన్ను కడుపులో నవమాసాలు మోస్తూ
నీకు తన రక్తమాంసాలను పంచుతూ
నీ రూపుకు ఆకృతినిస్తూ
నీ ఆరోగ్య సౌభాగ్యంకై తాను మందులు మింగుతూ
నిన్ను కనేందుకు తాను ప్రసవ వెదనలను అనుభవిస్తూ
తాను పునర్జన్మను పొంది
నీకు జన్మను ప్రసాదిస్తుంది అమ్మ!
దైవం అంతటా ఉండలేక సృష్టించాడు అమ్మను
ఆమె సేవతో తరింప చేసుకో ఈ జన్మను!
ఆ అనురాగమయిని ఆప్యాయతతో ఆదరించు
కనుపాప కన్నా మిన్నగా ఆమెను సంరక్షించు!
****************************************************
పై వచన కవిత నా స్వీయరచనే నని హామీ ఇస్తున్నాను.
5
మదర్స్ డే సందర్భంగా
వచన కవిత
రచన:-- సింహాద్రి వాణి
ఊరు:-- విజయవాడ
శీర్షిక:-- అమ్మప్రేమ
చరవాణి:--7569820872
అమ్మ ప్రేమకన్న మిన్న ఇందులోన లేదు
ఏడేడు లోకాల ఏదీ సాటిరాదు
అమ్మా అనే పిలుపులోన అమృతం వుంది
అమ్మ మనసులోన ప్రేమజలధి పొంగుతుంది
లక్షణాలైన కోట్లైనా ఋణం తీర్చుకోవచ్చు
అక్షరాల అమ్మ ఋణం తీర్చలేరు ఎవ్వరూ
హరికైనా వుంది అమ్మ కరికైనా వుంది
అమ్మ లేని ప్రాణి లేదు లోకమందు ఏదీ
కమ్మనైన అమ్మప్రేమ పొందలేని వాడు
అన్నీ వున్న గానీ ఏమీ లేనివాడె వాడు
పిడికిలంత గుండెను ప్రేమకడలిగా చేసి
కడలియంత కష్టమైన పిడికిలిలో దాచి
తన బిడ్డల క్షేమమే కాంక్షించును అమ్మ
తన సుఖం చూచుకోని త్యాగజీవి అమ్మ
స్వార్థమంటె ఎరుగని నిస్వార్థ జీవి అమ్మ
ద్వేషమంటె తెలియని ప్రేమమూర్తి అమ్మ
6.
అంశం: అమ్మ
శీర్షిక: దేవత
...
అమ్మ
రెండు అక్షరాల పదం
అనంత ప్రేమను
ఆప్యాయతను
ఆత్మీయతను
మమతను
తనలోనే దాచుకున్న హిమశిఖరం
శిశువును
గర్భంలో నవమాసాలు మోసినా
పురిటి నొప్పులు భరించినా
నవజాత శిశువును చూసి
ఆనందంగా ముద్దాడేది అమ్మ
ఊయలలో శిశువు ఏడిస్తే
అమ్మా అని పిలిస్తే
ఆమె ఒక్క క్షణం ఆగదుగా
గబగబా వచ్చేసి పాలిస్తుందిగా
జోలపాడి నిద్రపుచ్చుతుందిగా
కష్టాలు, కన్నీళ్ళు తానే భరించి
సుఖాలను పిల్లలకు పంచే త్యాగమయి
చిరునవ్వులే ఆమెకు ఆభరణం
తొలి గురువై పాఠాలు నేర్పేది
పిల్లలకు సేవచేసేది
ఓటమిలో ధైర్యం నూరిపోసేది అమ్మ
ఎన్నో సుగుణాలు
అమ్మకేగా సొంతం
అమ్మ లేని ఇల్లు
శూన్య నందనం
ముసలితనంలో అమ్మలను
వృద్ధాశ్రమాలలో చేర్చడం
అమానుషము, అధర్మము
7
[13/05, 8:20 pm] నాయకంటి నరసింహ శర్మ గారు: కవితా గానం సీజేన్ 4
అంశం మదర్స్ డే
రచన డాక్టర్ నాయకంటి నరసింహ శర్మ
వనపర్తి
చరవాణి సంఖ్య 9 4 41357400
శీర్షిక అమ్మకు అమ్మే సాటి
ముద్దు మురిపాలని పాలతో రంగరించి
గోరుముద్దల ప్రేమతో తినిపించే కనిపించే దేవత అమ్మే
ఆనందాన్ని విషాదాన్ని హలాహలాన్ని అమృతాన్ని ఒకే రకంగా
తన హృదయ సంద్రంలో దాచుకునే
పిల్లల మనసు దోచుకునే
అనన్య సామాన్యమైన సృష్టి అమ్మ
కన్నీళ్ల జలపాతాలు కురుస్తున్నా
ఆనంద అమృత ధారలు వెలువలై పారుతున్నా రెంటికి సంధానం అమ్మ
అమ్మకు అమ్మేసాటి
పసికూనల కోసం నిప్పుకణికలను మంచు ముక్కల్లా
గా మ్రింగ గలదు
ప్రళయ ఘోష లాంటి ప్రసవ వేదనను కూడా
పూల పల్లకినిఅధిరోహించినంత సంబరంగా భరించేదే అమ్మ
బిడ్డఅరికాలికి ముళ్ళు నాటితే పంటితో తీసేదే అమ్మ
ఏటికి ఎదురీదైనా డొక్కలుఎండినాగుండె మండినా
పిల్లలకు మలయ మారుతపు హాయిని ఇచ్చేదే అమ్మ
అమ్మకు ప్రతిరూపం అమ్మే
అమ్మకు ప్రతిబింబం అమ్మే
అమ్మకు ప్రత్యామ్నాయం అమ్మే
అంగడిలో దొరకనిది అమ్మ అందరిలో కనిపించేది అమ్మే
హామీ పత్రం
ఇది స్వీయ రచన ఇంతకు మునుపు రాయనిది ఈ సమూహం కొరకే వ్రాసినది
8
[13/05, 8:30 pm] Korada: కవితాగానం :- కవితల పోటీ
అంశం :- మదర్స్ డే
శీర్షిక :- ఆ దివ్య మంత్రమే....!
... కోరాడ నరసింహా రావు.
****************
అమ్మ... ఆ పిలుపుతోనే..
చైతన్యం పొంగుకొస్తుంది !
సకల వరాలనూ ప్రసాదించే...
మహామంత్రం * అమ్మ * !!
తన ప్రాణాలను ఫణం పెట్టి...
మనలను కన్నది..." అమ్మ "
మనలను తన కడుపున మోసింది నవమాసాలే ఐనా...
అమ్మలాంటి మరో అమ్మను నీకు ఆలిగాచేసి, ఆమెకు నిన్నప్పగించే వరకూ నీ బరువు బాధ్యతలన్నీ ఆమె మోస్తూనే ఉంది.... !
నీ ఆనందంకోసం, తనసుఖాలనన్నీ వదులుకున్న వెలకట్టలేని త్యాగమూర్తి అమ్మంటే.... !!
అమ్మ కురిపించే ఆప్యాయత, అనురాగం... జీవితంలో ఆలి దగ్గరతప్ప వేరెక్కడైనా పొందగలిగావా... ?!
అమ్మ, నీమీది మమకారాన్ని చంపుకోలేక... నీ అభివృద్ధిని ఆనందాన్ని ఇంకా చూడాలనే కోరికతోనే... అమ్మే, నీకు ఆడబిడ్డగా పుడుతుంది... !
అమ్మను కేవలం ఏడాదికోమారు మదర్స్ డే పేరుతో... స్మరించి ఆరాధిస్తే సరిపోతుందా.... అమ్మా... అన్న నీ ప్రేమ పిలుపు జీవితాంతమూ నీనోట పలుకుతూనే ఉండాలి...,
. ఆ దివ్య మంత్రమే.... నీలో చైతన్యాన్ని నింపి, నిన్ను ప్రగతి పదం లో నడిపిస్తుంది.... !!
.. ******************
9
మాతృదినోత్సవ సందర్భంగా
కవితాగానం కొరకు
నాకవిత:
శీర్షిక: అమ్మకు అమ్మేసాటి
'అ'అంటే అనురాగం, 'మ' అంటే మమత
మమతానురాగాల మేళవింపు
అమ్మ
అమ్మతనంలో కమ్మదనం
అనిర్వచనీయం.
అనుభవైకవేద్యం ఆఆనందానుభూతి
ఆకలితీర్చేఅన్నపూర్ణ అమ్మ
ఆరోగ్యాన్నందించే అపరధన్వంతరి అమ్మ
మన జనన గమనాల సృష్టికర్త
అమ్మ ప్రేమ అనంతం, అమూల్యం,అమృతం, అద్భుతం
అంగడిలో కొనలేనిది, ఆప్యాయతలో అంతులేనిది
త్యాగంలో ఉత్తుంగ హిమాలయం
సహనంలో భూదేవత
మమతల కోవెల, మమకారాల హరివిల్లు అమ్మ
అమ్మను మించిన ధైవంలేదు
తొలిపలుకు అమ్మ, అమరవాణి అమ్మ పలుకు
అమ్మ'ఒడియే మన బడి
వెన్నలోని కమ్మదనం, తేనెలోని తీపిదనం ,పాలలోని స్వచ్చత
మధువులోని మాధుర్యం
అమ్మదనం
అమ్మదనంలో కమ్మదనం
వర్ణింప నశక్యము
అమ్మకు అమ్మే సాటి
ఇలలో అమ్మలాంటి వారు
మరొకరు లేరు, ఉండరు.
పేరు : డా.భమిడిమఱ్ఱి కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
చరవాణి : 9871096566
హామీపత్రం: పైకవిత నాస్వంతం.అనుకరణ,అనువాదం కాదు.
10
కవితా గానం సీజన్ - 4
అంశం:- మాతృ దినోత్సవం సందర్భంగా
శీర్షిక:- అమ్మంటే
*******************************
అమ్మయె సంస్కార జలధి
అమ్మంటే సంస్కృతి
అమ్మంటే స్వచ్ఛ ప్రేమ
అమ్మ కరుణ బంధము
అమ్మంటే శుద్ధాత్మ
అమ్మయె మమకారము
అమ్మంటే రామ కథా
అమ్మ కృష్ణ గీతయే
అమ్మంటే తొలి గురువు
అమ్మ శ్రేష్ఠ జ్ఞానము
అమ్మంటే ఆప్యాయత
అమ్మయె అనురాగము
అమ్మంటే నమ్మకము
అమ్మయె మన ధైర్యము
అమ్మంటే తొలి బోధన
అమ్మయె సంశోధన
అమ్మ చేతి గోరుముద్ద
కమ్మనైన భావన
బ్రహ్మ సృష్టి అమ్మైతే
అమ్మ సృష్టి మనమేగా
అమ్మ ఉన్న ప్రతి ఇల్లు
ఆనందాల విరిజల్లు
అమ్మ ఋణం తీర్చుకొనగ
బ్రహ్మ యైన సరిపోడు
అమ్మ లేని ఈ జగతి
అంధకార బంధురం.
****************************
🖋️ వేదాంతం సురేశ్ బాబు
11
[13/05, 8:44 pm] Vanaparthy Gangadhar Poet: *కవితా గానం సీజన్ 4*
*****************************
*శీర్షిక:త్యాగశీలి*
ఆప్యాయతకు ప్రతిరూపం అమ్మ
అనుభూతికి ఆనవాలు అమ్మ
త్యాగానికి నిర్వచనం అమ్మ
జగతిన నడయాడే దైవం అమ్మ
ప్రతిక్షణం నీకై తపించే అమృతమూర్తి
తన జీవితాన్ని నీకై అర్పించే త్యాగశీలి
తను ఓడుతూ నిను గెలిపించే కరుణామూర్తి
తను ఆరిపోతు నిను వెలిగించే సహనశీలి
నిను కని పెంచి పోషించి
నీ నడకలకు నడతలు నేర్పి
నిను ఉన్నత శిఖరాల నెక్కించి
తను ఆనందపడే అపురూపం అమ్మ
నీ జీవితానికి అందమైన దారి చూపేది
నీ బతుకున వెన్నెలలు నింపేది
నీ కళ్ళల్లో సంతోష జ్యోతులు వెలిగించేది
నీ అభివృద్ధిని ఎప్పుడు కాంక్షించేది
అమ్మా... నీకు పాదాభివందనం
తీర్చుకోలేము నీ ఋణం ఏ జన్మలో
చాలు ఈ జన్మకు నీవు పంచిన ప్రేమామృతం
మరుజన్మకైనా పుడతాను నీ కడుపున బిడ్డనై
*పేరు:వనపర్తి గంగాధర్*
*ఊరు:హన్మకొండ*
*చరవాని:9440146435*
ఈ కవిత నా స్వీయ రచన
12
సందర్భం ..మదర్స్ డే
శీర్షిక... అన్ని డే లు అమ్మ డే లే ..
పేరు .....ఏ . భూపతి
హైద్రాబాద్.. 9989218154 ..
అమ్మకో రోజు , ఆనందమో ,
ఆశ్చర్యమో , నిర్ణయించినోళ్ళ
ముందుచూపో , మారిన
కాలమాన స్థితో , తగ్గిన సంతాన
బంధనాల సిరో , అమ్మ స్థానం ,
ఎన్ని విధముల వర్ణించిన ,
ఎన్ని స్థానాల లో పొగిడిన
పుష్పక విమానం కంటే గొప్పది,
యుగాలు మారినా కాల
ధర్మం తిరిగిన ,మనుషుల ,
మనసుల , స్థితుల గతులు
తిరగబడ్డా , అమ్మవడి , లాలింపు అమ్మచేతి
ముద్దలో ఉన్న ప్రేమ మారదు ,
వయసెంతైన ఆపదలో తలిసే
మొదటి పలుకు అమ్మే ,అమ్మలోనే ఉన్నది ఆత్మీయత ల అమృతం ,
ఆది అంతం లో అమ్మే మెదులును ....అమ్మను మించిన
గురువు , వైద్యులు , జ్ఞాని , ప్రేమ ,
ఇలలో ఏ ఎల్లలలో దొరకదు
ఎన్నటికీ , ......మదర్ కి ఒక
డే లేదు ,అన్ని డే లు అమ్మ డే లే...
అందుకే అమ్మా నిత్యం నీ
ప్రేమలో తరించే భాగ్యాన్ని
ప్రసాదించు .....
ఈ కవిత నా సోతం అనువాదం కాదు .....
13
శీర్షిక : అక్షరాంజలి
అమ్మ..ప్రేమకి ప్రతిరూపం !
అమ్మ జన్మనిస్తుంది !
మనలోని ప్రతిభను గుర్తించి
ప్రోత్సహించి
ఉన్నతంగా తీర్చిదిద్దే తొలిగురువు అమ్మ!
జాబిలమ్మని చూపిస్తూ
గోరుముద్దలు పెడుతూ
ఆడిస్తూ
మురిపెంగా పెంచుతుంది అమ్మ!
మన ఆకలిదప్పికల అవసరాలని గుర్తించి
సకాలం లో అన్నీ సమకూర్చుతూ
ఆరోగ్యంగా ఎదిగేలా కృషి చేసే వాత్సల్యమూర్తి అమ్మ!
విద్యాబుద్దులు నేర్పించి
సమాజంలో మంచిపేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని
గౌరవంగా బ్రతుకుంతుంటే మన అభ్యున్నతిని చూసి
మనకంటే మిన్నగా సంతోషించే అనురాగమూర్తి అమ్మ!
అమ్మ ప్రేమని వర్ణించడానికి అక్షరాలు చాలవు
అమ్మ పంచే ప్రేమని అందుకున్న మనస్సులకే తెలుస్తుంది అమ్మ విలువ !
అమ్మ మనకోసమై ఇలలో వెలసిన దైవస్వరూపం !
రచన : గొర్రెపాటి శ్రీను
14
[13/05, 8:50 pm] Venkat Reddy Jakkidi Math Sa Poet: **అమ్మా... **
అమ్మంటేనే అద్భుతం
అమ్ముంటేనే ఆనందం !
అమ్మగురించి చెప్పేదేముంటది
అమ్మలేకుంటే.....
అసలు ఏముంటది ?
నీకంటు అస్తిత్వం
నీదంటూ వ్యక్తిత్వం....
నీవంటూ ఒకనివి ఉన్నావని
ప్రపంచానికి పరిచయము చేసిందే
అమ్మా !
మనిషి యెలాంటోడైనా ..
పుట్టుక ...చావూ
ఎట్లున్న....
పురుడునుండి
పుడకల్లో కాలేవరకు
నీవైనా ?...
నీదైనా !....
ఇంకేదైనా ....అమ్మ ఇచ్చిందే ....
నీ అనందాన్ని తనదిగా
మురిసే దే అమ్మ ...
అమ్మను మరిస్తే
నిన్నునీవు విడిచినట్టే .....
--- జక్కిడి వెంకటరెడ్డి .
15
[13/05, 8:51 pm] Kavita Venkateshwarlu Garu: కవితా గానం సీజన్ - 4
13.5.23...శనివారం
అంశం::మదర్స్ డే
పేరు:: కవిత వెంకటేశ్వర్లు
ఊరు:: కర్నూలు
సెల్:: 8309920625
అమ్మ లేనిది జననము లేదు
అమ్మ లేనిది దేహము లేదు
అమ్మ లేనిది జగము లేదు
అమ్మ లేనిది భోగము లేదు
నవమాసాలు మోసి
పురటి నొప్పులు భరించి
నవ శిశువుకు జన్మనిస్తుంది
ఈ లోకానికి తీసుకువస్తుంది
అలాంటి అమ్మకు మదర్స్ డే
ఒక్క రోజుకే పరిమితమా?
ఈ ఒక్క రోజు ఆనందమా?
ప్రతి రోజు అమ్మను పూజించాలి
ప్రతి పూట కడుపు నిండా
పెట్టాలి
ఏ లోటు లేకుండా చూసుకోవాలి
ఆమె ఇష్టాలను అభీష్టాలను
నెరవేర్చాలి
తల్లి ఋణము తీర్చుకోవాలి
అప్పుడే మదర్స్ డేకు అర్థం
పరమార్థం!!
ఈ కవిత నా స్వీయ రచన
అని హామీ
16
[13/05, 8:52 pm] సింగీతం సంతోష్ కుమార్: కవితా గానం సీజన్ 4
ప్రక్రియ:-గేయం
అంశం:- మదర్స్ డే
శీర్షిక:-
ప్రత్యక్ష దైవమే అమ్మ
కవి పేరు:-
సింగీతం సంతోష్ కుమార్
కామారెడ్డి జిల్లా
_______________________________
పల్లవి:-
ఈ జగతిలోనే గోనైన పదం అమ్మ అమ్మ
నవమాసాలు గర్భంలో పెంచి జన్మనిచ్చిన ప్రేమమూర్తి "అమ్మ".....
*చరణం:-1*
పాలు త్రాగించి,
తన చేతి వేళ్ళ స్పర్శతో నీ అమ్మనిర అంటూ
అమ్మ ముహంలో ఆనంద బాష్పాల తో
ఆహారం తినిపిస్తూ
"అమ్మ"......
*చరణం:-2*
పుట్టాక మనల్ని కంటికి రెప్పలా
కాపాడుతుంది అమ్మ
మనకు చిన్న గాయమైతే
తల్లడిల్లుతుండి అమ్మ....
*చరణం:-3*
సృష్టికి ప్రతిసృష్టి "అమ్మ"
మన ఆలనా పాలనా చూసి పెద్ద చేసేది "అమ్మ"
మనఇల్లునే ఆసుపత్రి గా మార్చి
వెజ్జుడిగా మరి
ఎంతో సేవ చేసే మన సేవ మూర్తి "అమ్మ"......
*చరణం:-4*
మమతానురాగాల రూపమే"అమ్మ"
త్యాగానికి ప్రతిరూపమే 'అమ్మ'
నీ రుణం ఏ జన్మకు తీర్చలేనిది
అమ్మ....అమ్మ.....
**************************************
హామి పత్రం:- ఈ గేయం
నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
17
[13/05, 8:53 pm] లలితాచండీ Poetess: కవితగానం సీజన్- 4
అంశం----మాతృదినోత్సవం సందర్భంగా
శీర్షిక ----అమ్మ
*అమ్మ*
అమ్మా జర భద్రం
మెల్లంగ చూసి నడవవే
జాగరత్తే, నీకాడ ఎవరూ లేకపోయే
నాతోడరమ్మంటే రాక పోతివి..
నేనింటికి పోక తప్పదాయె,
వయస్సు పైబడ్డది నీకు
చూపు మసకేసే
మా చెయ్యి పట్టి అడుగేయిస్తివి
ఇప్పుడేమో నీ చెయ్యి సడిలే
ఆడబిడ్డ పుట్టగనె
ఆ..డ..పిల్ల అంటిరి...
ఓఅయ్యకిచ్చి పెండ్లి చేసి పంపిరి
ఇంటి గుట్టు రట్టు చేయకంటు చెప్పిరి
గుండె కుంపటిలో వంటాయ
పిల్ల పీచు పెరిగి జీవితమే
పెద్ద చట్రమాయె
చిన్నప్పటి సంది
అమ్మ అయ్య భాధ్యత
నీది కూడా బిడ్డా
అని చెప్పకుండ పెంచిరి
నలుగురు బిడ్డలకు తల్లివాయె
దగ్గరెవరు లేరె తల్లి
దప్పిక తీర్చఒక్కరు
చూపు మసకేసే,కర్ర చేతికొచ్చె....
నే నీడ పిల్లనేనే తల్లీ...
నిను బిడ్దల్లే చూసుకుంటనె నాకాడకు రాయే అమ్మా...
*లలితా చండీ*
13-5-2024
18
[13/05, 8:53 pm] Dosapati Sir: కవితాగానం సీజన్4
మాతృదినోత్సవం సందర్భంగా కవితలపోటి
అంశం:అమృతమూర్తి అమ్మే!
అమ్మంటే అమ్మే
ఆమె కాదెవరికి సాటి
ఆమె రాదెవరికి పోటి
అమ్మంటే అమ్మే
జన్మదాత అమ్మ
జీవనప్రదాత అమ్మ
నవమాసామోసి ఈలోకాన్ని చూపుతుంది
చనుబాలిచ్చి సేదతీరుస్తుంది
గుండెలకు హత్తుకొని గుర్తింపునిస్తుంది
నడిపిస్తుంది
నడవడి నేర్పుతుంది
మనిషిగా మహామనీషిగా చేస్తుంది
అమ్మంటే అమృతమూర్తి
సహనానికి సజీవమూర్తి
క్షమకు శ్రమకు ప్రతిమూర్తి
అమ్మంటే అమ్మే!
ఇది నాస్వీయరచన.
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం.
19
[13/05, 8:59 pm] +91 94942 05334: కవితా గానం సీజన్ _4
మదర్స్ డే సందర్భంగా
శీర్షిక:"అమ్మ ప్రేమ అజరామరం
"ప్రక్రియ : వచనకవిత
పేరు:గంటి .మీనాకుమారి
ఊరు:,శ్రీకాకుళం
_________________________
అమ్మ అన్నపిలుపుఅమృతాలు చిలుకు
అవ్యక్తానందాన్ని కలిగించు
అమ్మా !నిను పొగడగ చాలదు నా జన్మ
నీగురించి చెప్ప అక్షరాలు చాలవు గదమ్మ
నీగర్భాలయంలో నవమాసాలు పదిలంగా దాచి నన్ను మోసావు
భువిపైకి నన్ను తెచ్చి సేవలెన్నో చేసావు
చందమామను చూపెట్టి ,గోరుముద్దలను పెట్టావు
కంటికిరెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసావు
నీఒడియే గుడిగమార్చి విద్యా బుద్ధులు నేర్పావు
బాధలెన్నొ మ్రింగి నీవు ,నా బ్రతుకును దిద్దావు
సహనంలోభూమాతవు
క్షమయాధరిత్రివీవు
ఆకలైనవేళనీవుఅన్నపూర్ణవైనావు
ఆవేదనకలుగువేళఓదార్పునిచ్చావు
ప్రేమామృతవర్షాన్ని నాపై కురిపించావు
అనుక్షణం నాకోసమే తపన ఎంతొ పడ్డావు
ఇంత ప్రేమ పంచి నీవు నిర్దయగా నన్ను విడిచి వెళ్ళావు
నీవొడిలో ఆటలాడ ఆశగాను ఉందమ్మా
అదిఈ జన్మకు తీరదని తెలిసినా పిచ్చి ఆశ చావదు గా
తొందరగామరో జన్మెత్తి నీ ఒడిలో ఆడుకుంటా
నీవేనాకు అమ్మగా పుడతావా మళ్ళీ
అంతవరకూ నాగుండె గుడిలో నిను పదిలంగా నిలుపుకుంటా
దేవతగా కొలువుండి దీవించ వమ్మా
_________________________
ఈ కవిత నా స్వంతమని హామీ ఇస్తున్నాను
__________________________
20
[13/05, 9:07 pm] అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు Poet Vizag: కవితాగానం సీజన్ 4
మదర్స్ డే సందర్భంగా
వచన కవిత
శీర్షిక:- ప్రత్యక్ష దైవమే ఆమ్మ
రచన:-
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు:- విశాఖపట్నం
చరవాణి:-9963265762..................................నవమాసాలు మోసి
పురిటి నొప్పులు పడి
పునర్జన్మ నెత్తి
పుడమి పైకి నినుతెచ్చి
పొత్తిళ్ళలో నినుచూసి
పరవశించిన అమ్మ.
పరదేవతా స్వరూపమే..!!
పసిప్రాయంలో మలమూత్రాదులను తుడిచి
పసిడిబొమ్మలా తయారు చేసి
ఆకాశాన చంద్రుని చూపి
పాలు బువ్వను తినిపించి
రక్తాన్ని చనుబాలుగా మార్చి నీ ఆకలిని తీర్చి
నీ కాళ్ళతో రొమ్ములను గుద్దినా
మురిసి బుగ్గపై ముద్దులిడిన మాతృమూర్తి అనురాగదేవతయే...!!
తాను తిన్నా తినకపోయినా
నీ కడుపునింపి తాను పస్థులండి
నీ క్షేమాన్ని కోరే అమ్మ కాశీ అన్నపూర్ణయే..!
నీవేమన్నా నీవు బాగుండాలని
నీ చేతులపై కడతేరాలని
ఆశించే ప్రత్యక్ష దైవమే మాతృమూర్తి
అందుకే
'న గాయత్రి పరమో మంత్రం
న మాతృ పరదేవత'
అన్నది వేదం....!!
........................
ఇది నా స్వీయ రచన
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం.
..............................
21
రాధిక
ఊరు రాయదుర్గం
అమ్మ మార్గదర్శి
ఉగ్గుపాలతో రంగరించి పెంచిన సంస్కారం ఏమైందో?
ప్రతినిత్యం కూరలో ఉప్పు కారంగా మమకారాన్ని వేసి పెంచిన అనురాగం ఏమైందో నన్ను వృద్ధాశ్రమంలో వదలడానికి?
పస్తుల ప్రయాణంలో ఆకలి రుచి తెలియనీక,
నా రక్తాన్ని వసగా పోసి, సాకిన అభిమానం ఏమైందో నన్ను చూడడానికి కూడా సమయం దొరకని పనులు ఎన్ని ఉన్నాయో?
స్వార్థాన్ని ఇంటి గడప లోకి రానీయక,
కుళ్ళు కుతంత్రాలను ఇంటి తలుపు తట్టనీయక, పగ ప్రతీకారాలను ఇంటి ఆవరణలోకి రానీయక, చూసుకున్న జాగ్రత్తలన్నీ ఏమయ్యాయో?
నా బిడ్డలు అర్థరహితమైన ఆలోచనల సుడిగుండంలో చిక్కి, అనర్థమైన వ్యర్థ స్వార్థంతో అడ్డుగోడలు కట్టుకుని, అమ్మను పట్టించుకోని స్థితి ఎందుకు వచ్చిందో?
పాతికమంది కుటుంబ భారాన్ని మోసిన నన్ను మోయడానికి ఏ కొడుకు మనసు కరగదు...
కొడుకు మనసు, కొండయి రాతిబండై రంగు నోట్ల వెనుక పరుగులు తీసే నైజానికి స్వస్తి వాచకం పలికి, తలకొరివి పెట్టడానికైనా కనికరం చూపిస్తారా లేదో కన్నతల్లిగా నేను చేసిన త్యాగం బూడిదలో పోసిన పన్నీరు అయిందని మాత్రమే బాధ.
యే సుఖం కొరక ,
బిడ్డలే ప్రపంచంగా బతికిన నాకు బహుమతిగా ఇచ్చిన ఒంటరితనానికి తోడు వృద్ధాశ్రమం లో ఇంత చోటు... బిడ్డలేదిచ్చిన అమ్మకు సంతృప్తేగా.
22
[14/05, 8:55 pm] Lalita Sister: డా బల్లూరి ఉమాదేవి
మాతృదినోత్సవ శుభాకాంక్షలతో
శీర్షిక: మాతృమూర్తి
ఆ.వె:తల్లి ప్రేమ విలువ ధరణిలో నెంచంగ
తరమె యేరి కైన దలచి చూడ
ముద్దు మోము గాంచి మురియుచు నాతల్లి
భాగ్యశాలి నంచు పరవశించు..
2.ఆ.వె:ఆకలెరగి తాను నడగక పోయినా
కడుపు చూసి నింపు కరుణ తోడ
సుంత బాధ పడిన సొమ్మసిల్లును తాను
అమ్మ ప్రేమ కిలను నంత మేది.
3.ఆ.వె:తల్లి ప్రేమ కెవడు ధరను గట్టగలడు
సాటిలేని యట్టి మేటి మమత
నంద చేయు శక్తి యమ్మదే మహిలోన
తల్లికన్న నెవరు దైవ మిలను.
4.ఆ.వె:విశ్వమందు తాను వేదనను భరియించి
జన్మ మొసగు నట్టి జనని యెపుడు
దైవ మేగ నెంచ ధరణిలో సర్వదా
దైవతములకెల్ల దైవమామె.
5.కం:అమ్మను మించిన దైవ
మ్మిమ్మహిలో నెందు గనిన నెచ్చట లేదే
కమ్మగ బిడ్డలు తల్లిని
నమ్మా యని పిలువగనె హాయిని బొందున్.
23
[14/05, 8:56 pm] Lalita Sister: కవితాగానం సీజెన్ 4
అంశం : అమ్మ
శీర్షిక : నువ్వే సృష్టి
14-5-2023
******************
నువ్వెవరు..?
జన్మజన్మల కు బాకీ పడిన బంధానివా
ఈ ఇనుప ముక్కను తాకిన పరుసవేది వా
నీ తోడుగా..జీవన తొలి పొద్దును చూసాను
చంద్రునికి విన్నపాలు చేసినా
గారాబపు గోరుముద్దలు పెట్టినా
ఆ ముద్దులకు..సుద్దులకు..పద్దులే లేవు
బ్రతుకు బాధల తీక్షణకిరణాలు పడకుండా
శాంతి తెమ్మెర వై కమ్ముకుంటావు
నీ చేతన అంతఃచేతన లోనూ నా సంక్షేమ తలుపులే
అమ్మ తప్ప అన్యమెరుగని శిశువును..
అహేతుకంగా ఈ జీవిని ప్రేమించే విరాట్ స్వరూపము నువ్వు
దుఃఖం చీదరలు నా దరికి రాకుండా
దడి కట్టే ఆ హృదయ ఆర్తిని కొలవగలనా
ఒడిలో లాలిస్తూనే నా భావి జీవిత గతిని
నిర్దేశిస్తావు
అరమరికలు లేని ఆత్మబంధువ్వు నువ్వు
ఆపదలో నిను మించిన ఆశ్రయం లేదు..
జీవితాన నువ్వుంటే ఆవిష్కృతమయ్యే
అందమైన చిత్రం మరేది లేదు..!
నీ కనుసన్నలతో నా జీవన లయను
తిప్పుతావు
నీ ప్రేమంతా నాకోసం పంచిపెట్టి నా
అంచుల మట్టుకు పొంగిపొర్లే అక్షయ పాత్ర నువ్వు
నామనసు మడతల్లో
విశాల దృక్పథం..వికసిత వ్యక్తిత్వం విరజిల్లాలని
నిత్యం తపించి.. పరమాత్ముని జపించి
నా ఋజువర్తనం కోసమే తపించి
నా మనఃతనువులను మృదువుగా స్పృశించావు
నీది విశ్వ మాతృత్వ సిద్ధాంతం
నీ పనే..ఒక జాతి నిర్మాణం
నువ్వు వ్యక్తి వో..శక్తి వో..తత్వమో..అద్వైతమో ..
అమ్మన్న పదం ఓంకారమై..
సృష్టంతా ప్రతిధ్వనిస్తుంది..
అఖండ జ్యోతై ప్రజ్వలిస్తుంది
డా.దారల విజయ కుమారి
24
[14/05, 8:56 pm] Lalita Sister: కవితాగానం సీజన్ 4
14/5/2023/ ఆదివారము
" మదర్చుడే సందర్భంగా "
శీర్షిక == " అమ్మ "
సీ !
కంటికెదురుగాను కనిపించుదైవము
తల్లికన్ననుమిన్న ధరణిలేరు
భువికి దొరికెతల్లి భూలోకదేవత
తల్లియెదైవము తనయులకును
అంగవైకల్యము అమ్మగాంచదెపుడు
ముద్దుబిడ్డడనుచు ముద్దుచేయు
తానుతినకయున్న తనయులకే బెట్టు
బువ్వపెట్టెడివేళ బుజ్జగిస్తు
ఆ !
దొంగయైనగాని దొరబాబతడుగాని
కన్నతల్లి బిడ్డకడుపునింపు
అమ్మ మనసులోని యాప్యాయతనుచూడ
మహిని దెలియరాని మనుజులెవరు !
తరణికంటి సూర్యలక్ష్మి .
*****
25
[14/05, 8:58 pm] Lalita Sister: 🙏🙏🙏🙏🙏
ఓ అమ్మ స్పందన
మాతృదేవో భవ
అమ్మ యనగ అమ్మే రా
అమ్మ మర బొమ్మ కాదురా
అమ్మకి సాటి లేదురా
జన్మ నిచ్చినది అమ్మ
అనుది నమను క్షణం ఆత్మీయత జూపురా
అన్నమ్మ ,కన్నమ్మ, చిన్నమ్మ, చెల్లమ్మ తులసమ్మ ,గురవమ్మ,, గంగమ్మ,.....
అమ్మలెందరో ....
కంటికి రెప్పలా కాపాడు కన్నమ్మ
అన్నము పెట్టి ఆకలి తీర్చు అన్నపూర్ణమ్మ
చిన్నారి చేష్టల చిలిపితనమున చేరదీయు చిన్నమ్మ
పుట్టినింట మెట్టినింటను తిరిగాడి
పూర్ణ కళల శోభించు చెల్లెమ్మ
సర్వవేద సర్వ దేవ సర్వతీర్ధమయి తులసమ్మ
తొలిగురువైన గురవమ్మ
గారాబముతో కరుణపొంగించు గంగమ్మ
సత్యదామమునకు తోడ్కొను సత్యమాత సత్యానందామయి
అక్షరాలా మొదటి అక్షర మే 'అ'తో మొదలిడెగా
ఆ ఆ లు నేర్పి చదివించు చదువులమ్మ
అంతరంగాన అధిష్టించు అక్షర రూపమే
అమ్మ
మాయమ్మ ముద్దు గుమ్మ
అడుగులో అడుగేసి నడిపి తప్పటడుగులు దిద్దురా
అమ్మ కన్న మీద లేదురా జగతిన
ప్రకృతి మాత, గోమాత, భూమాత,దేశ మాత ,వేదమాత శ్రీమాత, జగన్మాత ప్రతిరూపాలు రా అమ్మ
💐💐💐💐💐
అమ్మలగన్న అమ్మలు
అమృతానందమయిలు
అందరికీ అభివందనాలు
మూలమైన పెద్దమ్మకు శిరసా మనసా వచసా సర్వదా పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏
ఏమైందో
26
[15/05, 12:12 am] Lalita Sister: ముడుంబ తిరువేంకటాచార్యులు, మానుకోట.
**** ***** *****
# మాతృ వందనం#
ఒక జీవకణం
తనకో రూపాన్ని సంతరించుకోవడానికి
మాతృగర్భాన్ని ఆశ్రయించిన వేళ,
తనలో కలిగిన మార్పులను, వికారాలను
పసిగట్టిన మాతృహృదయం ఆనందార్ణవం.
తల్లి గ్రోలిన ఆహారపానీయాలను తనరూపనిర్మాణానికి ఉపయోగించుకుంటూ ఎదుగుతున్న గర్భస్థశిశు
విన్యాసాలను అనుభూతి చెందుతూ మురిసిపోతుంది.
రాబోయే పసికూన అందచందాలను
ఊహించుకుంటూ ఆనందలోకాల్లో విహరిస్తుంది.
తనలోనే పెరుగుతున్న శిశు ఆరోగ్యం కోసం తన ఇష్టాయిష్టాలను త్యాగం చేసి, వెచ్చాలను మింగుతూ, వైద్యసలహాలను తు. చ. తప్పకుండా పాటిస్తూ, తన కన్నులపంట రూపసౌందర్య వీక్షణం కోసం నవమాసాలపాటు నిరీక్షిస్తుంది.
ఆ గర్భస్థ శిశువు తల్లి హృదయస్పందననే స్వరస సంగీతంలా, తల్లి స్వరాన్నే లాలిపాటగా ఆస్వాదిస్తూ, తన చిన్ని సామ్రాజ్యంలో అనేక విన్యాసాలు చేస్తుంది.
శిశూదయవేళ, ప్రసవవేదనలో పునర్జన్మ నెత్తి, తన ప్రతిరూపాన్ని చూసుకొని ఆనంద తన్మయత్వంతో గుండెలకు హత్తుకుంటుంది.
మాతృ స్తన్యామృతాన్ని గ్రోలిన శిశువు శుక్ల పక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్థమానమై, అమ్మవొడినే "అనన్వయ స్వర్గం" చేసుకొని అమ్మకు తానే సర్వస్వమై భాసిల్లుతుంది.
రూప గుణ మేథో సామర్థ్యాలకు అతీతంగా తమ సంతానాన్ని అపురూపంగా ప్రేమించే
మాతృమూర్తులందరికీ భూరి వందనాలు.
##### ##### ####
ఈ రచన నా స్వంతం. అనువాదం కానీ, అనుసరణ కానీ, అనుకరణ కానీ కాదు. 🙏
27
[15/05, 12:12 am] Lalita Sister: *కవితా గానం సీజన్ -4*
అంశం: అమ్మ
తేదీ:14/05/2023
వురిమళ్ల సునంద ఖమ్మం
****************
అమ్మా !అని మొదటి సారి పలకకున్నా
చిరునవ్వుతో మురిసిపోయిన పిచ్చి తల్లివి!
ఆకలి అని అడగకుండానే
కడుపు నింపిన మాతృ మూర్తివి!
చదువు కోసం బడికి వెళ్ళకుండానే
బతుకు విలువలు నేర్పిన పంతులమ్మవి!
కష్టాల కడలిలో కూరుకు పోయినప్పుడు
చేయి పట్టుకుని ఒడ్డున చేర్చిన గజ ఈత గాడివి!
నష్టాల ఎడారిలో చిక్కుకున్నప్పుడు
సేద తీర్చి ఓదార్చిన ఒయాసిస్సువి!
అవమానాలతో మనసును ముక్కలు చేసినా
చిగురించిన ప్రేమతో మళ్ళీ మళ్ళీ హత్తుకునే తరువమ్మవు!
కంటి పాపల పహారాలో చంటి పాపాయిని చేసి
బతుకంతా కంటి రెప్పలా కాపాడే మమతానురాగాల
మాతృ మూర్తివి!
నీ ఋణం తీర్చుకునేందుకు
ఈ జీవితం సరిపోదమ్మా!
నీ ప్రేమ పొందేందుకు ఎన్ని జన్మలైనా సరిపోవమ్మా!
*వురిమళ్ల సునంద, ఖమ్మం*
28
అజరామృతం
***********
నిదురించదు నీరసించదు...
ఎక్కడిదాశక్తి???
ఎవ్వరికీ అంతు చిక్కదు..
చిరాకులకు
చీదరింపులకు.
చిరునవ్వుల
మారాకు తొడుగుతూ...
తనయుల క్షేమంకై తపిస్తూ...
అదే సార్థకతగా పరమార్థంగా భావించే నిస్వార్థపు కొమ్మ..
పురిటినొప్పుల్లో పునర్జన్మను పొంది..
ప్రేమపొత్తిళ్లలో పెంచిన బిడ్డ
ఉన్నతి కోసం
కళ్ళల్లో వొత్తులేసుకుని చూసే
తడి ఆరని చెమ్మ..
అమ్మంటే
పేగుబంధమయ్యాక
మల్లెలాంటి మనసైనా
మాలిన్యపు మనసైనా లాలించడమే తెలిసిన పాత్ర....
మమతల మాధుకరాన్ని ప్రసాదించే అక్షయపాత్ర
అజరామృతం..
విశాల విశ్వమని
మార్మిక సంద్రమని
ఉన్నత శిఖరమనే
ఉపమానాల మాలలెన్నల్లినా
పదబంధాల
గంధాలనెంతగా అలదినా...
ఊరటనివ్వదు
ఋణం తీర్చుకోలేని బంధం
త్యాగమనే పదానికి రూపం ......
********శివునూరి లలితాకృష్ణ
29
కల్తీకాని దైవం
14052023
వీరా గుడిపల్లి
*************
ఇప్పటి వరకు
కల్తీ కానిది
ఇంకెప్పటికీ కానటువంటిది
అమ్మ ప్రేమ
దేశమంతా నిన్ను తలకెత్తుకున్నా
ఏ తప్పుడు పనో చేసి
ప్రపంచమే వెలేసినా
లోపం కనిపించని ప్రేమ
ఎగరలేని సంతుకోసం
తనూ కార్చిచ్చు లో కాలిపోయింది
వదిలేసి పారిపోలే
తండ్రి కోసం కొడుకే
గొడ్డలితో తల నరికినా
చిరునవ్వుతో తల వంచి
ప్రేమను పంచింది
కొడుకు
దుర్యోధనుడైనా
ధర్మజుడైనా
అష్టా వక్రుడైనా
పురూరవుడైనా
సవ్యసాచి ఐనా
ఉత్తరుడైనా
ప్రేమించడం మానలే
ప్రేమించడం తప్ప
మరేమీ తెలియని పిచ్చి తల్లి
పాత్ర మారనంత వరకు
వేలెత్తి చూపలేమసలే
అమ్మంటే అంతే
తను ధ్వంసమై మట్టిలో కలిసి
మొక్కకు ప్రాణమిచ్చే
తల్లి మనసు విత్తనానిది
తనవలన కాకున్నా
కాకిని దోఖా చేసైనా బిడ్డకు స్వాగతం పలికే అమ్మ కదా కోకిల
అమ్మంటే
పిల్లల్ని తప్ప
మరేమీ చూడలేని ప్రాణి
ఎప్పుడైనా,ఎక్కడైనా
ఫస్ట్ ప్రయారిటీ పిల్లలకే
ఆ తర్వాతే
ఆయనైనా ఇంకెవరైనా
ఆమె కళ్ళు వెతుక్కునే ది మనల్నే
ఆమె చేతులు ఎత్తు కునేది మనలనే
తను హత్తుకునేది పిల్లల్నే
తానెప్పుడు తనకోసం బతికిందని
ఆ పాత్రలో ఉన్నంత వరకు
ఆమెప్పుడూ
ఓ తులసి మొక్క
ఓ బిల్వదళం
ఒక పారిజాత పుష్పం
కల్తీ లేని దైవం
----------------వీరా గుడిపల్లి
Comments
Post a Comment