కవనజ్యోతి పక్షాన కవితాగానం సీౙన్ 5 నిర్వహిస్తున్న పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీ
నిర్వహణ: శివునూరి లలితాక్రిష్ణ
అంశం : తెలుగు భాష
*****************
కవివరుల జాబితా
1.
******************
1. కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
2.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
3.జి.సూర్యనారాయణ గారు
4. మండ నాగేశ్వరరావు గారు
5.తరణికంటి సూర్యలక్ష్మి గారు
6. కోరాడ నరసింహారావు గారు
7.మద్ది. పుల్లారావు గారు
8.తిప్పా వఝల నరసింహమూర్తి గారు
9.కూని అంక బాబు గారు
10. సింహాద్రి వాణి గారు
11.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
12. గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు
13.దోసపాటి వేంకటరామచంద్రరావు గారు
14.కవిత వెంకటేశ్వర్లు గారు
15.తోట సులోచన గారు
16.మధు అమరగాని.గారు
17.గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్) గారు
18.గడ్డం కృష్ణారెడ్డి.సూర్యాపేట గారు
19.తంగిరాల నాగలక్ష్మి గారు
20.పిన్నక నాగేశ్వరరావు గారు
21.అపరాజిత రెడ్డి గారు
22.వాణి సరోజిని లక్కరాజు గారు
23.గంటి .మీనాకుమారి గారు
24.లలితాచండి గారు
25.పిళ్ళా వెంకట రమణమూర్తి గారు
26. డా బల్లూరి ఉమాదేవి గారు
27.కొండేటి రాధిక గారు
28.చంద్రమౌళి, కుప్పిలి గారు
29. డా.వేమూరి సత్యవతి గారు
30.డా.భమిడిమఱ్ఱీ గారు
31.చంద్రమౌళి కుప్పిలి గారు
32.చేబియ్యం శ్రీనివాసరావు గారు
***** ********* *****
1
కవితాగానం సీజన్ 5
శ్రావణ మాసం పౌర్ణమి కవితలపోటీకి
తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా..
అంశం :::తెలుగుభాష
శీర్షిక::: *గిడుగు... తెలుగు వెన్నెల మడుగు*
స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు,
పాతర్లపాడు, ఖమ్మం.
27.08.2024
❇️❇️❇️❇️❇️❇️❇️❇️
పురాతనమే ఈ తెలుగు, అయినా పరిమళిస్తూనే ఉంది
సరస సంభాషణలతో పారిజాతంలా,
త్రిలింగ భూమిని
హరి హర సుర విరి పురముగ తీర్చి,
జానపదులతో పరివేష్టించి,
చెలగుతోంది మనలోని తెలుగు వెలుగే!!
అమ్మాయిని తోలుకుని రా, అనిన కోటిరత్నాల వీణైనా!
ఆడపడుచును తీసుకు రా, అనిన కృష్ణా గోదావరి నురుగైనా!!
బేగ రమ్మని పిలిచిన విశాఖ ప్రణయ గానమైనా
బిరిన రమ్మని గోము చేసిన పెన్నా సన్నాయి రాగమైనా!!
అజంతాలతో అందాలు గుమ్మరించి,
ఆబాల గోపాలాన్ని అలరించు తెలుగు భాష!!
అదేమి వింతయో!
ఎటునుంచి చదివినా పదమదేవచ్చు పరవశించ,
ఏకాక్షర పద్యాలతో మోకరిల్లజేయు...
అవధాన ప్రక్రియతొ అమరపురినే అవనికి దింపెడి
తేనె లొలుకు తెలుగు, తెనుగు ప్రజల వరము!!
వ్యాకరణం,ఛందస్సు, అలంకార పదగుంఫనంతో
నన్నయార్యుడు,తిక్కనార్యుడు, ఎఱ్ఱనార్యుడు,
భక్తిని ప్రభోదించిన పోతనా మాత్యులాదిగా,ఎందరో!?
తెలుగు భాష వెలుగులో తేజరిల్లిన తాపసులు!!
గిడుగు గొడుగెత్తి గ్రాంధిక భానుడి దూకుడాపి
వాడుక భాషకు వలపు పులిమి,చందన గంధాలనలది వీథివీథులందు వేడుకల వేదికలెక్కించగ
కోటి సూర్యుల వెలుగై కమ్ముకొనియె!!
గురజాడ దరువులో గుడిసెలన్నియు ఊగుచుండ
బడుగుల గుండెలు హాయిగా నవ్వుచుండ
పంచదార చిలుకలై తియ్యగా, తెలుగు పలుకు చుండె!
త్రిలింగ దేశాన తీర్థాలు ఎన్నున్నా,
ప్రార్ధనల అర్థాలు ఒక్కటే నంటూ
తేనె లూరు చలమ తెలుగు పలుకు !!
ఇది నా స్వీయ రచన
2
కవితాగానం సీజన్ 5
శ్రావణ పౌర్ణమి పోటీలకు
తేదీ....27.8.24
పేరు.... అయ్యల సోమయాజుల ప్రసాద్
ఊరు...హైదారాబాద్
అంశం:- తెలుగు భాష
శీర్షిక:- తేనె లొలుకు తెలుగు
..............................
ఆదికవి నన్నయ్య నుంచి
అన్నమయ్య వరకు
శ్రీకృష్ణదేవరాయల నుంచి
రాయప్రోలు వరకు
శ్రీ శ్రీ నుంచి సిరివెన్నెల వరకు
తెలుగు భాష మాధుర్యం వర్ణింపతరమా.....!!
పోతన భాగవత పద్యాల మకరందం
వేమన,సుమతీ శతకాల
జీవిత సత్యాల విషయం
తెలుగు జాతి మనది
నిండగ వెలుగు జాతి మనది అన్న సి.నా. రె
వ్యావహారిక తెలుగు
ప్రజల హృదయ పరివర్తనకు కారణం అన్నగిడుగు
విశ్వనాథ వారి కిన్నెరసాని
గురజాడ వారి కన్యాశుల్కం
ఎందరో, మరెందరో తెలుగు భాష ఔన్నత్యమును వసుధైక కుటుంబానికి చాటిన మహానుభావులు.
మమ్మి డాడీలన్న పిలుపుకన్నా
అమ్మ, నాన్నలన్నదే ముద్దు
మాతృభాషలో ప్రాథమిక విద్య అవగాహనని పెంచి
అభివృద్ధి కలుగు.
దేశాభాషలందు తెలుగులెస్స అన్నది అక్షర సత్యం.
తేనెలొలుకు మనతెలుగు
వసుధైకానికే ఆదర్శం...!!
............................
ఇది నా స్వీయకవిత
పేరు:-
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
.............................
3
కవితా గానం సీజన్ 5
శ్రావణ మాసం పౌర్ణిమ కవితల పోటీకి..
అంశం: తెలుగు భాష
రచన: జి.సూర్యనారాయణ
ఊరు : అవనిగడ్డ
చరవాణి :6281725659.
శీర్షిక : తెలుగు భాషే మన వారసత్వ సంపద ..!
తెలుగుభాషే ..మన వారసత్వ సంపద ..!
**************************
దేశ భాషలందు తెలుగు లెస్స
దేవరాయలు పోషించిన కావ్య
భాష
వసుధలో వర్ధిల్లుతున్న విశిష్ట భాష..!
అచ్చులు హల్లులతో అల్లుకున్న అజంతా భాష
తలకట్టులతో నిలిచిన పంచె కట్టు భాష
పరదేశీయులను ఆకట్టుకున్న
మంజుల భాష
అవధానాలుగా అవతరించిన
మధుర గాంధర్వ భాష
వేదికల మీద వెలుగుతున్న దేదీప్య భాష..!
తెలుగు పదాలలో ప్రతిధ్వనించే సంగీతం
పలుకుతుంటే పెదాలలో జాలువారే మాధుర్యం..!
పరభాషలను కలుపుకుంటూ
పలుకుబడి యైన కలకండ భాష
మాండలికాలను గుండెలలో
నిలుపుకున్న గుండ్రని లిపిగల భాష..!
వేనవేల చరిత్ర గల ఘనతర భాష
శాసనాలలో శ్వాసలు నింపుకున్న
రాతిగుండె భాష
జాతిని జాగృతం చేసే ఆత్మగౌరవ భాష
పాలకులకు పట్టని అతి ప్రాచీన భాష..!
పల్లెలలో పల్లవిస్తున్న అపూర్వ భాష
పత్రికలలో బతుకుతున్న అక్షయ భాష
సుందర తెలుగును అందరం మాట్లాడుకుందాం
వారసత్వ సంపదగా మాతృభాషను
కాపాడు కుందాం..!
*******************
హామీ పత్రం
__________
ఆర్యా..సదరు కవిత నా స్వంతం.దేనికీ అనువాదంకాదు.అనుకరణ లేదు. మీ పోటీకీ ప్రత్యేకంగా రాశానని హామీ ఇస్తున్నాను.
జి.సూర్యనారాయణ.
4
తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా,
శ్రావణమాసం పౌర్ణమి కవితలపోటీకి....
అంశం: నా తెలుగుభాష
శీర్షిక:
నాతెలుగు భాష..🙏🙏 🏵️=====🏵️=====🏵️
భాషలందు నా తెలుగుభాషే మేటి
తెలుగుభాషకు రాదు వేరేది సాటి..!!
గ్రంధమైన,ఏ ప్రబంధమైన
ఆంధ్రసంస్కృతమందె పసందుగనుండు..!!
తేనెలూరు తియ్యందనము
మల్లెపూవంటి తెల్లందనము
నాతెలుగుభాష కమ్మందనము!!
అమ్మప్రేమను మించు అరుదైనభాష
ప్రాణమును నిలబెట్టు విలువైనశ్వాస
పండితులు పామరులు ఎవరైన ప్రేమించిపూజించు ఘనమైన మనభాష!!
తెమ్మెరలు వీయించు మనమాతృభాష..!!
చెవులకింపుగనుండు ఈవేదఘోష...!!
పరిహాసమైన, ఇతిహాసమైనా
ఆక్రందనైన, ఆవేశమైనా నా
తెలుగులోనె ఆ'భావముండు !
ఈ భాషలోనె అమృతమ్ముమెండు!!
ఆకాలమైన ఈకాలమైన ఏకాలమందైన నాతెలుగుభాషే నాకనులనుండు!!
పరభాషనేనాడు దూషించకోయి నీభాషనే ప్రతిదినము ప్రేమించవోయి!!
ప్రియమార పలికింప కృషిచేయి భాయి!!
మాండలికమేదైన మధురమే మనభాష!
నీఆశ నీశ్వాస..నీతెలుగుభాష!!
విరులన్ని కలగలిసి విరబూసినట్టు
భువిపైన తరువులే జడలూపినట్టు
ఇలలోన జడివాన నిలిచికురిసేటట్టు...
నాతెలుగు ప్రతినోట ప్రతిచోట
ప్రతినతో పలికింప కరుణించవమ్మా!!
వరమీయరావమ్మ ఓశారదాంబా!!! 🙏🙏🙏
మండ.నాగేశ్వర్రావు.
సరిపల్లి, పెందుర్తి.,
7793939724.
5
తెలుగు భాష దినోత్సవ సందర్భంగా
శ్రావణమాసం పౌర్ణమి కవితల పోటీకి
అంశం: - "తెలుగు భాష ఘనత "
ఆ! (1)
మాతృభాషలోని మాధుర్యమంతయు
తెలుగుభాషనుండె తేటగాను
తేనెలూరుభాష తెలుగుభాషయొకటి
తెలుగుభాషఘనత తేజరిల్ల!
ఆ ! (2)
వేలపదములన్ని వెలుగొందెతెలుగులో
కవులచేతనున్న కలములోన
సంధుచేసుకొనియె శతకాలయందున
తెలుగుభాషఘనత తేజరిల్ల!
ఆ! (3)
తెలుగుసంస్కృతంత తెలిపెడి గీతము
జాతిగౌరవమ్ము చాటుచుండె
రచనచేసెశంక రంబాడిదానిని
తెలుగుభాషఘనత తేజరిల్ల!
ఆ! (4)
కట్టుబొట్టుతీరు కనగానెజనులకు
తెలుగుపద్దతులును తేటపరచు
ప్రాంతమునకునున్న పద్దతితెలియును
తెలుగుభాషఘనత తేజరిల్లు!
ఆ! (5)
సంస్కరించెతెలుగు సాంప్రదాయములన్ని
తరతరాలసంస్కృ తంతనిలిపె
ప్రగతిపథములోన పయనించెనాంధ్రులు
తెలుగుభాషఘనత తేజరిల్ల!
ఆ! (6)
రాష్ట్రభాషయంత రాజసమొప్పగ
తెలుగులోనేపలుకు తేటగాను
యింటపరులభాష నిసుమంతపలుకకు
తెలుగుభాషఘనత తేజరిల్లు!
రచన తరణికంటి సూర్యలక్ష్మి.
*****
6
కవితాగానంపౌర్ణమికవితలపోటీ ( తెలుగు భాష) కన్నతల్లి స్థ న్యమంత శ్రేష్ట మైనది మన మాతృ భాష..!
కోరాడ నరసింహా రావు
*****************
అమ్మ స్థన్య మంత అద్భుత మైనదికదా మన మాతృభాష!
హాయి హాయీ యనుచుఅమ్మ
స్థన్యమునిస్తు అలవరచినది మన తెలుగువభాష ..!
అమ్మ, నాన్నా ,...అత్త, తాతా యంచు...
మనము వరవడిగనేర్చినది
తెలుగుభాష...!
పరిసరమ్ముల ప్రాధమికజ్ఞాన మును అలవోకగా మనకు తెలియ జేసినది మన తెలుగుభాష...!
కవులును - పండితులు..., ఖ్యాతి నార్జించిన గొప్పవారి నెందరినో అందించినది మన తెలుగు భాష...!
వేరే భాషకూ లేని పద్యముతొ
పరిమళించినదిమన తెలుగు భాష...!
విన సొంపు గలిగినకమ్మనైనది
మన తెలుగు భాష..!
దేశ భాష లందు తెలుగు లెస్స యని, కృష్ణరాయలచేత కొని యాడబడె మన తెలుగుభాష!
ఆవుపాలకంటె , పుట్ట తేనియ కంటె కమ్మనైనదిమన తెలుగు భాష...!
తొట్ట తొలుత నీవు మన మాతృ భాష యైన తెలుగు భాషను నేర్చి , పిదప వేరే భాష నైననూ...నేర్వరా తెలుగు వాడా !
మాతృభాష కన్నతల్లి, పర భాష పినతల్లి...
సత్యముతెలుసుకోర తెలుగోడ!!
*********************
7.
కవితా గానం సీజన్ 5
శ్రావణమాసం కవితల పోటీకి
27/08/2024
పేరు :మద్ది. పుల్లారావు
ఊరు:నందిగామ, ntr జిల్లా
9951287113
అంశం:తెలుగు భాష
ప్రక్రియ:వచనకవిత
శీర్షిక:తెలుగును వెలిగిద్దాం
------------
భలే భలే తెలుగు భాష
బంగారం లాంటి భాష
చక్కెరలను చిందునట్టి చిక్కనైన తెలుగు భాష
ముత్యాలను గుచ్చునట్టి ముచ్చటైన తెలుగు భాష
వీణ తీగె మీటినట్టు వినిపించే తెలుగు భాష
తెలుగు భాషను మాట్లాడుట మన తపఃపలం
తెలుగు ను వెలిగించు ఘనులకుపాదాభివందనం
పద్యాల మధురిమ గద్యాల సరిగమ తెలుగు
సంది,సమాసాల సవ్వడి మన తెలుగు
గుండెలోతుల్లోని భావాలు ప్రసరించేది తెలుగు
కరుణను కలిగించేది కవితను రప్పించేది తెలుగు
గలగల పారే సెలయేరు
జలజలపారే ప్రవాహం
సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబం తెలుగు
నవరసాలొలుకు నవనవోన్మేషమైన తెలుగు
నన్నయ్య నయగారాలు తిక్కన తియ్యందనాలు
కృష్ణశాస్త్రి కోకిల పలుకులు
సి. నా.రె అమృతవాక్కులు శ్రీ శ్రీ విప్లవగీతం
మరపురాని మన తెలుగింటి
మరవమన్న మరువద్దోయి
పోతన కమ్మని భాగవతం మన తెలుగు
గురజాడ వెలుగు బాట మన తెలుగు
గిడుగు తీర్చిదిద్దిన వ్యవహారం మన తెలుగు
నందమూరి పోషించిన పౌరాణికం మన తెలుగు
ఆంగ్లకోరల్లో చిక్కుకుంది నేటి మన తెలుగు
మాతృభాష పరిరక్షణ మన కర్తవ్యం
తెలుగులో మాట్లాడి తెలుగు ఖ్యాతి ని పెంచుదాం
.......
హామీ పత్రం.
ఇది నా స్వీయరచన
8
కవితాగానం
శ్రావణ మాస పౌర్ణమి నగదు బహుమతుల పోటీకి
అంశం:తెలుగు భాష
శీర్షిక:తేనెలూరు భాష
అత్యంత ప్రాచీన చరిత్ర కలిగింది మన తెలుగుభాష.
సస్యశ్యామలమైంది మన మాతృభాష.
అచ్చుతో అంతమయ్యే ప్రత్యేకతకలిగింది మన తల్లి భాష.
వినడానికి శ్రావ్యంగా ఉండే మధురమైన భాష మనతెలుగు భాష.
ఏ భాషనైనా తనలో ఇముడ్చుకోగలిగే సామరశ్యంకలిగింది మన మాతృభాష.
చక్కని
పలుకుబడులు,నుడికారాలు తో విలసిల్లేది మనతెలుగుభాష.
అవధానప్రక్రియ ఉన్న ఏకైక అధ్బుతభాష తెలుగు భాషే.
తలకట్టు ఉన్న అక్షరాలతో విలసిల్లే ఒకే భాష మన మాతృ భాష.
సంగీత, సాహిత్య ప్రక్రియలలో సులభంగా ఇమడగలిగేది తెలుగుభాష.
నోరు తెరిచి ఉచ్చరించగలిగే ప్రత్యేకత ఉన్న అచ్చులుండే భాషమన ఆంధ్ర భాష..
కర్ణాటక సంగీతపాటల్లోఅత్యధిక పదాల వాటా కలిగిన భాష తెలుగుభాష.
సంధులు సమాసాల తో సంక్లిష్టమైంది మన మాతృభాష.
ద్వర్ది,త్య్రర్ది పద్యా లతో అలరించే భాష మన తల్లి భాష.
తిక్కన,పోతన లాంటిమహాకవులందించిన తేనెలూరు పద్యాలతో విరాజిల్లే భాష తెలుగు భాష.
మమ్మీ లాంటి మృత పదాలుండకుండా అమ్మలాంటి అమృత పదాలుకలిగింది మన
మాతృభాష.
ఇన్ని ప్రత్యేకతలు కలిగిన అమ్మ భాష ఉండగా పరాయి భాషపై మోజెందుకు?
ప్రావీణ్య ముండాలి పరభాషల్లో కూడా.
దానికి ముందు సాధించాలి తెలుగులో పట్టు.
తెలుగులోనే మాట్లాడుదాం,మాతృ భాష మృతభాష కాకుండా కాపాడుకుందాం.
తిప్పా వఝల నరసింహమూర్తి
బుచ్చిరెడ్డి పాళెం, నెల్లూరు జిల్లా
9
కవిత గానం చేసిన 5
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగ శ్రావణమాసం పౌర్ణమి కవితల పోటీకి
అంశం: తెలుగు భాష
శీర్షిక:తెలుగు గొప్పది కాదంటార?
తెలుగులో మమకారం లేదంటారా?
తెలుగు గొప్పది కాదంటారా?
ఆరేళ్ళ బుడతడు
పదారేళ్ళ కుర్రాడిని మామయ్యా అంటే
ఆ కుర్రాడు ఆనందించడా
అదే బుడతడు అంకుల్ అని అనేస్తే
ఆ కుర్రాడు కృశించిపోడా
అవమానంతో తలదించుకోడా
మరి తెలుగు మధురం కాదంటారా?
బుడిబుడి నడకల చిన్నారి
పడుచు పిల్లని అత్తమ్మా అని పిలిస్తే
ఆ పడుచు పరవశించి పోదా
అదే చిన్నారి ఆంటీ అని అనేస్తే
ఆ పడుచు హడలిపోదా
అవమాన భారంతో పారిపోదా
మరి తెలుగు ఘనత తక్కువంటారా?
అమ్మా అని పిలవడంలో
నాన్నా అని పలకడంలో లేని మమకారం
కనిపించని ఆప్యాయత
మమ్మీ అంటేనో డాడీ అంటేనో
కనిపించునా?వినిపించునా?
విచిత్రంగా ఉండదా? విడ్డూరంగా ఉండదా?
మరి తెలుగులో మమకారం లేదంటారా?
తెలుగు గొప్పది కాదంటారా?
కూని.అంకబాబు
నెల్లూరు - 2
10
కవితా గానం సీజన్--5
తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా
శ్రావణ మాసం పౌర్ణమి కవితల పోటీకి అంశం:-- తెలుగు భాష
తారీఖు:--27/8/2024
వారం:--మంగళవారం
రచన:-- సింహాద్రి వాణి
ప్రక్రియ:-- వచన కవిత్వం
శీర్షిక:--తెలుగు భాష
ఊరు:-- విజయవాడ
చరవాణి:--7569820873
నా మనసున ఆనందం పొంగి పొరలు తున్నది, తీయనైన తెలుగుపాలు తాగి పెరిగి నందుకు, కమ్మనైన మాతృభాష అమ్మ నేర్పి నందుకు.
దేశ భాషలన్నిటిలో ఘనమైనది తెలుగుభాష, రూపు రేఖలందు చూడ సొగసైనది తెలుగుభాష.
అమ్మ కడుపులోనె మనం విన్నా ములె అమ్మభాష. సుమ తావీ పరిమళంలా ఇంపైనది మాతృభాష.
నన్నయ, తిక్కన, పోతనాదులును, ప్రాచీన మధ్యయుగం అధునాతన ఆంధ్రకవులు, రచియించిరి గేయములు,పద్య గద్య ప్రక్రియలెన్నో
ఆ రచనల విభవంతో మారుమ్రోగు దిగంతాలు. తెలుగుజాతి కవియె చూడ తరిగిపోని సిరులగనులు.
జిగిబిగి యున్న చక్కని సజీవ పదాలు వెలుగు తెలుగుభాష. గిరులు, సంద్రముల వలెనే యుగాలు తరాలుగా సాగి వచ్చు మాతృభాష.
పరభాషా వ్యామోహం మత్తు లోన మునిగి జనం, అమ్మభాష నెంతగానో నిరాదరణ చేయుచుండె.
ఆంధ్రభాష, అమ్మభాష, అంతరించి పోకముందె, ప్రతి ఒక్కరు నడుంకట్టి, అమితంగా పట్టుపట్టి, తెలుగు భాష వైభవాన్ని నలుదిక్కుల చాటాలి.
భాషలెన్నో నేర్వండి. అభివృద్ధి బాటపైన నడవండి.
కానీ, తెలుగు భాష విస్మరించి, అంతరింప చేయకండి. తెలుగువారితో ఎపుడూ తెలుగులోనె మాట్లాడండి.
హామీ:-- ఇది నా స్వీయ రచన.
11.
కవితాగానం
పౌర్ణమి కవితల పోటి :
తేది : 27/08/2024
అంశం : తెలుగుభాష
శీర్షిక : సుధామాధురి నా తెలుగు
సుధలు చిలుకు మధురిమలతో /
సొగసు లొలుకు పదబంధములతో /
ఆ బాలగోపాలము నలరించే...
సుధామాధురి నా తెలుగు /!
అమ్మ పాలలా అమృతం చిలికే /
అమ్మ ప్రేమలా మమకారము బలికే /
అమ్మ చూపులా హాయిదనము నొసగే /
అమ్మ మాటలా చల్లగదనము నింపే...
సుధామాధురి నా తెలుగు /!
అన్నమయ్య పదాలలో అమృతము వర్షించిన /
అన్నార్తుల హృదయావేదన
అక్షరీకరించిన/
అన్ని భాషలందు మిన్నయని ప్రణతులందిన /
అష్ట దిగ్గజ కవులకే యశస్సు నొసగిన...
సుధామాధురి నా తెలుగు /!
మానవ నవ జీవనానికి మార్గదర్శియైన మహాభారతాన్ని /
మానవ సంబంధాలకు ఊపిరిలూదిన రామాయణాన్ని /
మహోన్నత మనుగడకు పసిడి పధము పరచే భగవద్గితను /
మానవతా విలువలను ఇతోధికంగా వృద్ధిపర్చిన/ ఇతి హాసాలను ప్రపంచ దేశాల్లో ప్రజ్వలింప చేసిన...
సుధామాధురి నా తెలుగు /!
అలతి అలతి పదాలతో అతులిత భావము నొసగే /
పండిత, పామరుల నాలుకలపై నాట్యమాడే /
జానపదుల గీతాలకు జావళియై నిలిచే /
విశ్వశాంతిని అనవ్రతము కాంక్షించే...
సుధామాధురి నా తెలుగు /!!!
************************
రచన :
ఆళ్ళ నాగేశ్వరరావు
కవి... రచయిత... ఆర్టీసీ కండక్టర్
ఇంటి సంఖ్య :1-45-2
సంకవారికొట్ల బజారు
నాజరుపేట
తెనాలి... 522201
గుంటూరు... జిల్లా
ఆంధ్రప్రదేశ్... రాష్ట్రము
చరవాణి : 7416638823
------------------------------------
హామీపత్రము :
ఆర్యా నమస్సులు!
మీరు నిర్వహిస్తున్న పౌర్ణమి కవితల పోటీకి నేను రాసి పంపుతున్న పై వచన కవిత నా స్వీయరచన అని, ఇది దేనికీ అనువాదం, అనుసరణ కాదని, ఇది ఎప్పుడు, ఎక్కడ ప్రచురణ, ప్రసారం కాలేదని హామీ ఇస్తున్నాను.
12.
కవితా గానం సీజన్ 5
@@@
శ్రావణమాసం కవితల పోటీ
@@@
అంశం: తెలుగు భాష
శీర్షిక: వెలుగు భాష
గజవెళ్ళి శ్రీనివాసాచారి
కాజీపేట హన్మకొండ జిల్లా
&&&
తల్లి లేనిదే
మనిషికి రూపమే లేదుగా
భావవ్యక్తీకరణకు
భాష అవసరమేగా
అమ్మ, అమ్మభాష
జన్మభూమి అపురూప భావనలే
తెలుగు వారందరికీ
భాషే జీవం, జీవనం
అటు పాలనలో
ఇటు బోధనలోనూ
నిరాదరణే మన భాషకు
పరభాషా ఆధిపత్యానికి
బలౌతున్న తెలుగు
తెలుగు వాచకంలో
అదరగొట్టే పద్యాలు
గ్రాంథిక భాషను
తొలగించిన రోజే
తెలుగు భాష
వెలుగు భాషై వర్ధిల్లు
తెలుగువారంతా ఏకమై
తెలుగు భాషకు
కట్టాలి పట్టాభిషేకం
@@@
హామీ పత్రం
ఈ కవిత నా స్వంత రచన
13
కవితాగానం సీజన్-5
శ్రావణపౌర్ణమి నగదుపురస్కారాల కవితలపోటి
అంశం:తెలుగుభాష
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం
శీర్షిక:అక్షయపాత్రలాంటి భాష
అమ్మ ఒడిలో నేర్చుకున్నభాష
అమ్మపాలతో అందించిన భాష
అదే మాతృభాష
మన తెలుగుభాష
గిడుగుచూపిన భాట
గురజాడ పలికిన మాట
గోదావరిగలలో
కృష్ణవేణితరంగాలలో
కిన్నెరసాని పదసవ్వడిలో
పరుగిలిడి పరవశించేభాష
మన తెలుగుభాష
కృష్ణరాయలు కీర్తించి
దేశభాషలందు లెస్సైన భాష
సుందరతెలుంగని సుభ్రమణ్యభారతి స్తుతించిన భాష
పద్యములలో ప్రశస్తమైన భాష
అవధానములలో పేరెన్నికగన్న భాష
మనభాష తెలుగుభాష
అక్షయపాత్రలా ఆలరేభాష
మనతెలుగుభాష
విదేశీయులుసైతం నేర్చిన భాష
విదేశాలలో ఘనకీర్తి పొందుతున్నభాష
మన తెలుగుభాష.
ఇది నాస్వీయరచన.
14
కవితాగానం సీజన్ 5
27.8.24 .. మంగళవారం
అంశం::*తెలుగు భాష దినోత్సవం*
శీర్షిక:: తెలుగు వెలుగు
రచన:: కవిత వెంకటేశ్వర్లు
ఊరు:: కర్నూలు
సెల్:: 8309920625
తెలుగు మధురము
పలికిన మధురాతిమధురము
చిలికిన వెన్నలా తియ్యందనము
అన్ని భాషల్లో తెలుగు ఘనము
తెలుగింటి ఆడపడుచులా
ఆవకాయ కలిపిన భోజనములా
తెలుగు వారికిష్టమైన గో0గూరలా
నోరూరించే పులస కూరలా
సంగీత సాహిత్యలకు అనువైనది మన తెలుగు
పద్యాలను హృద్యంగా ఉండేందుకు సులువైన తెలుగు
ఛందస్సు యతి ప్రాసలకు
శబ్దాలంకారానికి అలంకారమైన
భాష మన తెలుగు
కీర్తనలకు సంకీర్తనలకు పాటల
పల్లవులకు అతికినట్టుగా ఉన్న
భాష మన తెలుగు
అమ్మాలా మన తెలుగు
అమ్మాయి అందములా తెలుగు
అపరంజి బొమ్మలా తెలుగు
అమృతములా తెలుగు
మన కంటికి ఇంటికి వెలుగు!!
స్వీయ రచన అని హామీ
15
కవితా గానం సీజన్ -5
శ్రావణ మాసపు పౌర్ణమి కవితల పోటీ
అంశం తెలుగు భాష
శీర్షిక తెలుగు మన కంటి వెలుగు
తెలుగు భాష తెలుగు వారందరికి
కంటివెలుగైన జీవన మాధుర్యం
విశ్వ విఖ్యాతి చెంది,యిటాలియన్
ఆఫ్ థి ఈస్టని,దేశభాషలందు తెలుగులెస్సగా
అందాల అజంతా భాషయై మెరుస్తుంది
ఏ భాషకు లేని ప్రత్యేకతలెన్నింటినో సొంతం
జేసుకుని హరివిల్లులా గగనసీమలో ధగధగలే
పండిత శ్రేష్టుల కరములలో పద్యమై భాసించి
గిడుగు గొడుగు క్రింద వ్యావహారికమై పులకించి
పామర జానపదుల తొలకరి జల్లుగా పరవశించి
ప్రతి పదం లయాత్మకమై జీవనాడుల స్పృశించి
మమతలను మాటలలో మూటగట్టుకుని
అమృత పానమై మధురిమలను చిలికిస్తూ
మానసవీణపై అనురాగ స్వరాల నాస్వాదిస్తూ
తెలుగు వారి ధీర,వీర, పౌరుషాలను
అణువణువున అక్షరాల స్వరూపమై
ప్రకృతి యున్నంత వరకు సజీవమై నిలుచు
పరభాషా వ్యామోహాన్ని త్యజించి, తేనె
లొలుకు తెలుగును మన శ్వాసగా శ్వాసిస్తూ
ప్రతి యింటా తెలుగునే భాషిద్దాం
తెలుగు మధురిమలను వాడ వాడలా
చాటి, పూర్వ వైభవాన్ని సంతరింపజేసి
గుండెలో గుడి కట్టి పూజిద్దాం
తెలుగు తల్లి మెడలో పూలమాల నవుదాం
తోట సులోచన
నెల్లూరు
చరవాణి 9490173053
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతమని హామీ
16.
కవిత గానం సీజన్ 5
శ్రావణ పౌర్ణమి కవితల పోటీ
అంశం: *తెలుగు భాషా దినోత్సవం*
రచన: మధు అమరగాని
9177860792
శీర్షిక *అజంత భాష*
అమ్మలోని ఆత్మీయత
నాన్నలోని అనురాగం కలిగున్న భాషరా
తనలోన భాషలెన్నో మిళితం చేసుకోవడం మీరు చూశారా.
సంగీతాన్ని శిఖరాలకు చేర్చుతూ
సాహిత్యానికి సరిగమల సొబగులద్దిన కమ్మదనం
అమృత కవనాల పుట్టిల్లు నా తెలుగు
అజంత భాష నాది అందమైన యాస నాది
దానితో సరితూగేది ఏది?
పూలరెమ్మ మకరందం చిగురుకొమ్మ లేతదనం
నా తెలుగు కావాలి లోకానికి వెలుగు
పదహారణాల పడుచుదనం
భాషలందు తెలుగు లెస్సయన్న తెగువ గుణం
యాభైయారు వర్ణాల పూలవనం
నిశీదిని నిలువున చీల్చే వెలుగుదనం నా తెలుగు
లాలపోసిన లాలిపాటల ఊట
జోలా పాడిన ప్రశ్నల పోరుబాట
అమ్మ అన్న మాటేంతో సింగారం
తెలుగు భాష బంగారం
అమ్మ భాష కమ్మదనం
తెలుగు మాట తియ్యదనం
తేనే వంటి తీపి గుణం
తెలుగు భాష గొప్పదనం
ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ నా భాష
ఎంతసక్కగుంటదో అందుట్ల దాగున్న యాస
తేనె వంటి తియ్యనైన భాష నాది
ఈ కవితకు నా భవితకు నేడది పునాది
✍️ మధు అమరగాని.
హామీ :ఇది నా స్వీయ రచన
17
కవితా గానం సీజన్ 5
శ్రావణమాసం కవితల పోటీకి
27/08/2024
పేరు :గొర్రెపాటి శ్రీను
అంశం:తెలుగు భాష
ప్రక్రియ:వచనకవిత
శీర్షిక : అమృతభాష
అమ్మ నేర్పిన కమ్మనైన భాష మన తెలుగు !
అజంతా భాషగా గుర్తింపు పొందిన భాష..
"ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్"గా పేరెన్నికగన్న భాష..
"దేశ భాషలందు తెలుగు లెస్స" అంటూ
శ్రీ కృష్ణదేవరాయలచే కీర్తినందుకున్న మధురమైన భాష..
ఆదికవి నన్నయ్య నుండి..
నేటి కవులు సినారె,సుద్దాల అశోక్ తేజ,చంద్రబోస్ వంటి
ఆధునిక కవుల కలాల నుండి అమృతమై జాలువారిన రసరమ్యమైన భాష..
తమిళకవి సుబ్రహ్మణ్య భారతి చేత "సుందర తెలుగు"అంటూ ప్రశంసించబడిన సుమధురభాష..మన తెలుగు !
అమ్మని ఎంతగా ప్రేమిస్తామో..అమ్మ పరిచయం చేసిన సుధలూరుభాషను ..
మన మాతృభాష తెలుగును సైతం అంతగా ప్రేమిద్దాం ..పూజిద్దాం !
మాతృభాష సేవలో తరిద్దాం !
రచన : గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)
చరవాణి: 9652832290
18.
కవితాగానం సీజన్ 5
శ్రావణమాసం కవితల పోటీకి, 27/8/2024
గడ్డం కృష్ణారెడ్డి.సూర్యాపేట
అంశం:: తెలుగుభాష.
ప్రక్రియ:: పద్యము
శీర్షిక:: అమృత భాష.
ఆ.వె.💐💐💐
తల్లిభాష తెలుగు తనివితీర జదివి
మరవబోకు పుత్ర మాతృభాష
విద్య గూర్చి మనకు విలువలు బోధించు
తెలుసుకోర కృష్ణ తెలివితోడ...
ఉగ్గుపాలు బట్టి ఊయలూపుచు తాను
నడక నేర్పి నాకు నడత గూర్చె.
అవనిలోన నిదియె అమృతంపు భాషని
తెలుసుకోర కృష్ణ తెలివితోడ.
బాపుబొమ్మలోన భాగవతమ్మున
ఘంటసాల వారి యింటిలోన
మొల్ల రచనలోన మురిపాల రూపాన
తెలుగు వెలుగులీనె తెలుసుకోర..
అన్నమయ్య పాట అన్నదాతల నోట
ఉయలపాటలోన నురకలేయ
పల్లెసుద్దులందు పరిఢవిల్లిన భాష
తెలుసుకోర కృష్ణ తెలివితోడ..
19
తంగిరాల నాగలక్ష్మి:
అంశం: తెలుగు భాష
జేజేలు మనతెలుగు భాషకు కవితా గానం తో పలుకుదాం
ఆహ్వానం:
తెలుగు వెలుగు జిమ్ము దేశమ్ము నాదిరా తేనె లొలుకు భాష తెలుగు భాష తెల్ల వారి కెదురు తిరిగినజాతిరా/తెలుగు వీర చాటె దేశ భక్తి ఎక్కడున్నా ఏమిచేసినా తెలుగు తల్లిని మరువకు కష్టాలు అడ్డు వచ్చినా వెరవకు మాతృమూర్తి మాతృ దేశ మాతృ భాషలు మనుగడ నిచ్చెరా మనకు
భావవ్యక్తీకరణకు భాష కావలెనురా తీయనైన తేలికైన తెలుగుభాషనుతెలియ జెప్పు తెలివిగా తెలుగు బిడ్డగ మసలు తెలుగు గడ్డ ఘనత పెంచు తెలుగు భాష మనది ఎందరోవీరుల త్యాగఫలమది గలగలపారే కృష్ణా గోదావరీ నదులలో వినవయ్య సోదరా తెలుగు భాష సూర్య కాంతిలో నేర్చుకో తెలుగు భాష చల్లనివెన్నెలలో వెచ్చని కవితలల్లరా తెలుగు భాషలో అమృత గుళికరా తెలుగుభాష యన్న బాస జేయరా భాష నిలుప తెలుగు లో మాటాడు, పాటపాడు, తెలుగు తోటలో పద్యపుష్పాలను పుష్పిపజేయరా కావ్య నాటక గ్రంధాల పందిరి వేయరా తెలుగు కవుల అక్షర నిధుల బాటవేయరా తెలుగు జాతికి వన్నె తెచ్చుతెలుగు భాషనుఇంటింటాపదిల పరచు జై కొట్టు తెలుగోడ తెలుగు తల్లికి పడగొట్టు అవినీతిని తరిమికొట్టు అక్రమాన్ని పదునుపెట్టు కలానికి చేపట్టు భాషాభివృద్ధిని
20
కవితా గానం(సీజన్ 5). 27--8--2024.
పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
శ్రావణ మాసం పౌర్ణమి కవితల పోటీకి... ...
అంశము :-- తెలుగు భాష.
శీర్షిక :-- తీయనైన తెలుగు భాష.
1.సీ.
యతియు,ప్రాసలనెడు వ్యాకరణ నియమా
లున్న తెలుగుభాష యున్నతంబు
ఛందస్సు,గణములు పొందికగా నుండు
తెలుగు పద్యము తేట తేనెయగును
అయ్యలంకారాలు నాభరణాలుగా
కలిగిన పద్యమ్ము కమ్మనగును
అలరింప జేసెడు నవధాన ప్రక్రియ
మన తెల్గు భాషకే మకుటమగును
తే.గీ.
దేశభాషల యందున తెలుగు లెస్స
యనుచు రాయలు కీర్తించినట్టి భాష
యమృతమును మరపించెడు నమ్మ భాష
తేనెలూరెడు తీయని తెలుగుభాష.
2.సీ.
అమ్మ,నాన్న యనుచు కమ్మగా పిలువక
మమ్మి,డాడీ యను మాటలేల?
మామ,అత్త పిలుపు మధురమౌ తెలుగులో
అంకులాంటీ లనుచు నాంగ్లమేల?
కార్యాలయాలలో కార్యకలాపాలు
సలుపగా వలె తేట తెలుగులోన
నామాలు సూచించు నామ ఫలకముపై
తెలుగు మాటలు తీర్చి దిద్దవలయు
తే.గీ.
మాతృ భాషలో చేవ్రాలు మరువ వలదు
తెలుగులోనె సంభాషణ పలుక వలయు
తెలుగు నున్నత స్థానాన నిలుప వలయు
ననుచు ప్రతినబూన వలయు నందరమును.
3.తే.గీ.
తల్లిదండ్రులు,గురువులు పిల్లలకును
మాతృభాష గొప్పదనము మరువనీక
తెలుగుభాష యందాసక్తి కలుగునట్లు
తీర్చి దిద్దెడు బాధ్యత తీసికొనుడు.
4.తే.గీ.
దేశ దేశాలలో నున్న తెలుగువారు
తెలుగు సంప్రదాయము,సంస్కృతిని
సతతము
నాదరించుచు మరువక నాచరింప
తెలుగు వెలుగులు లోకాన తేజరిల్లు.
**************************************
21
అంశం : తెలుగుభాష
శీర్షిక: అమ్మభాష
పేరు: అపరాజిత్ రెడ్డి
ఊరు : సూర్యాపేట
పాల బువ్వ తిన్నట్లు
జున్ను పాలు తాగినట్లు
లేత కొబ్బరి తిన్నట్లు
లేగదూడ అంభా అన్నట్లు
ముద్దు ముద్దు మాటల పసిపాప
అమ్మ పాలు తాగుతూ హాయిగా
అమ్మ ఒడిలో నిద్దరోయినట్లు
వెన్నెల్లో ఆటలాడే పిల్లలు
ఉల్లాసంగా గంతులేస్తూ
పండు వెన్నెల జాబిల్లిని పట్టుకున్నట్లు
కమ్మ కమ్మని శీతాఫలాలు ఆరగించినట్లు
అమ్మ చేసిన కమ్మని అరిసెలు తింటున్నట్లు
జుంటితేనె జుర్రుకుంటున్నట్లు
చెట్టుపై జామపండును రామచిలుక
ముక్కుతో కొడుతున్నట్లు
ఒక్కొక్క అక్షరం నేర్చుకుంటున్న పాప
పాలకోవా లాంటి అక్షర సముదాయాలను పలుకుతున్నట్లు
తీయ తీయని పలుకుల అమ్మదనం
కమ్మనైన తెలుగు భాష గొప్పదనం!
తంగెడు పూల లేత పసుపు స్వచ్చదనం
గోరెంట పూల అందాల మొక్కల్లా
గళగళ పారే సెలయేళ్ళు
తెలుగు నేల పులకరించేలా
రైతన్నలు చేసే సేద్యం
సుతారంగా సుతిమెత్తని తెలుగు భాష
నిలవాలి కలకాలం ఈ కమ్మదనం
నిన్ను కన్నతల్లి తెలుగు తల్లి
మరువకు మరియెప్పుడూ
తెలుగు భాష తెలుగు యాస!
అపరాజిత్
హామీపత్రం : ఈ కవిత నా కలం సేత యని ఏ గ్రూప్ కు పంపలేదని హామీ.
22
కవితాగానం
శ్రావణ. మాసం పౌర్ణమి కవితల పోటీ
అంశం తెలుగు భాష
శీర్షిక తేటతెలుగు
వాణి సరోజిని లక్కరాజు
హైదరాబాదు
949105482
అచ్చులు హల్లులు అక్షరసుమాలై
వత్తులు దీర్ఘ గుడింతాలు సుమసూత్రమై
తెలుగు తల్లి కంఠాన వెలుగు లీను మందార మాల
మన తెలుగుభాష.
దేశభాషలందు తెలుగులెస్స.
ఇది నేటిమాటకాదు.రాయలనోటిమాట .
తరతరాలుగా తెలుగుభాష ఔన్నత్యాన్ని ,
యెలుగెత్తి చాటే కృష్ణ రాయల హృదయ స్పందన
లేత కొబ్బరి వూట మనతెలుగు భాష
పలుకు పలుకున తేనెలు చిలుకు భాష
భావానికి అమృత గుళికై ప్రాణం పోసేభాష.
కవనగాంభీర్యతకు చవులూరింపజేసే భాష
గద్యం ,పద్యం ,గేయం ,పాట, కథ ,నాటకం ,
ప్రక్రియ యేదయినా పొదిగిన వజ్రంలా
వొదిగి పోతుంది మన తెలుగుభాష .
ఛందో వ్యాకరణాదులతో , చక్కని వర్ణన లతో
ప్రబంధేతిహాసాలు పలుకావ్య పురాణాలు
అందమైన తెలుగులో అక్షర రూపం దాల్చాయి
మరేభాషలందులేని అష్టావధాన ప్రక్రియ
తెలుగుభాష లోనే వెలుగులీను తున్నది .
నవ్యసాహిత్యం నవరస భరితమై ,
సరళ ప్రక్రియలలో నేడు సందడి చేస్తున్నది
పరభాష మానవ , మనుగడకు ప్రధానమైనా
మాతృ భాష మనయింటి యిల వేల్పు
మరువ. రాని మధుర బంధం .కాపాడు కొనుట మన కర్తవ్యం
స్వీయరచన
23
కవితా గానం సీజన్ 5
శ్రావణమాసంపౌర్ణమికవితల పోటీకొరకు
తెలుగుభాష దినోత్సవం సందర్భంగా
అంశం: తెలుగు భాష
శీర్షిక: " తేనెలొలుకుభాష "
రచన: గంటి .మీనాకుమారి
ఊరు: శ్రీకాకుళం
_________________________
తేట తెనుగు భాష
తేనే లొలుకు భాష
అమృతధారలుపెదవులచిలుకుభాష
కవిత్రయము వారి చేతఅద్భుతముగపద్యముల
నమరుభాష
శ్రీనాధకవినోట"దేశభాషలందు తెలుగు లెస్సని "తొలుత పలుకబడిన భాష
పోతన్న నోట భక్తి పారవశ్యమునందు భాష
శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానమున భువన విజయమై వెలుగొందు భాష
ప్రబంధ కవులచే ప్రకృష్టముగా వెలుగొందిన భాష
సుభ్రమణ్య భారతిచే సుందరతెలుంగని కొనియాడబడిన భాష
ఆధునికకవులచే క్రొత్త పుంతలు త్రొక్కినభాష
గుండ్రని ముత్తియముల వంటి అక్షరములతో అందముగా అలరారు భాష
పలుప్రక్రియలతో పరవశింపజేయు భాష
పంచదార కన్న,పనస తొనలకన్న,జుంటితేనియలకన్న
మిన్న యైన భాష
__నాతెలుగు భాష
_________________________
పై కవిత నా స్వీయ రచనని
హామీ ఇస్తున్నాను .
_________________________
24
కవన జ్యోతి
కనితాగానం సీజన్ 5
శ్రావణ పౌర్ణమి పోటీలకు
అంశము తెలుగుభాష
శీర్షిక ---- *అమరభాష*
రచన --లలితా చండి
***** ***** *****
పూలతాసీమలలో పట్టుతేనెలొలుకు తెలుగు
చిలుకపలుకులతో పలుకు పలుకులో రసరమ్య వృత్తాల అలంకారాలను ఒదుగు తెలుగు పంచదార అచ్చుల రసగుళికలతో కలసి ఓం కార నాదము పలికించు ధ్యానమే చేయించు హల్లులన్నీ అచ్చులతో చేరి ధీర్ఘ రాగాలతో కావ్యగానాలు చేసే...
వత్తులతో దీపాలు వెలిగించి
గద్యమై పద్యమై అల్లసాని వారి అల్లికలతో మనుచరిత్ర కావ్యమై
అవధానాలు చేసేను
పోతన చెంత చేరి భాగవతసుధలు పలికించిన తెలుగు, కవిత్రయముతో కలిసి మహాభారతాన్ని తెనిగించి గద్దెనెక్కి సంగ్రామమే నడిపెను
ఒక్క మాటలో అమృత ధారలు కురిపించు అమరభాష మనకు మాత్రమే సొంతమై సొగసులూరినది
మాండలికాలతో వున్న జానపదులలో చేరిన
అన్నమయ్య పదమై త్యాగరాజ కీర్తనలు చేసేను
ఆకాశన చవితి చంద్రుడు వలె మబ్బుల చాటున చేరుతోంది మన తెలుగు
గణనాధుని కొలిచి మనసార వీణావాణిని పిలిచి
మరవకుండ మనసార పలుకుదాం
తెలుగు వెలుగులను దశదిశలలో చిన్నారులకు ఉగ్గుపాలతో రంగరించి చిరుదరహాసలతో నేర్పుదాం.
లలితాచండి
న్యాయవాది /రచయిత్రి
9885552922
హైదరాబాదు
నాస్వీయ రచన ✍️
27-8-2024
25
*కవితా గానం సీజన్ -5*
*శ్రావణ పౌర్ణమి* కవితల పోటీ నిమిత్తం వ్రాసిన కవిత
*తే: 27-08-20234దీ*
అంశం: *తెలుగు భాష*
*************************
శీర్షిక: *లలితాంతరంగ నా తెలుగు భాష*
శ్రీ విజయాభయ నిర్మల ధీ విభవ ప్రభల నొసగు తెలుగు చదువుచు ..
శ్రేయః ప్రసన్నమౌ ధీయుత జయశంఖపద్మ దీప్తులగుచు..
కంఠమాత్మానుభూతికి గంటకాగ శ్రుతి లయాన్విత సంగీత మతినగుచు..
మోహినీ లావణ్య పూర్ణ ప్రకాశమై పలుకుల ఒయ్యారమొలుకుచు!
అక్షరాక్షరమందు ఆ సరస్వతి రూపు ప్రత్యక్షమొనరించు..
ప్రాతః కాల సమీర రమ్య వేదగానాలకే విభ్రాంతి కల్గించు..
నన్నయాదుల నుండి నవయువ కవిదాక ఆత్మశక్తిని గూర్చు..
గొడ్ల కాపరి కూడ గొంతెత్తి కోయిలై పద్యమాలపించు!
వెలయ త్యాగయ్య కృతులలో రవళించిన వెన్నపూసల మాలయై..
విభుడు కృష్ణ రాయుని ఆముక్తమాల్యద లో ప్రభవించిన కౌముదీ కిరణ హేలయై..
సురలోక ధేనువే కరుణించి అరుదెంచి క్షితిపైన కురిపించిన క్షీర ధారయై..
తరములు తరములు తరియింప ఇంటింట ప్రవహించు వరసుధీ వంశధారయై!
తల్లిదండ్రులపైన తగు కృతజ్ఞత కల్గు సుతుల పూజ్య భాషగా..
ఆత్మ లొక్కటియైన ఆలుమగల నడుమ శ్వాసగా సాగు విశ్వాస భాషగా..
సీమంతవేళలో స్త్రీ మూర్తి గర్భాన చేమోడ్చి ప్రార్థించు శిశువు భాషగా..
దేహమును వదిలెడి ధీరులౌ వృద్ధుల నాలుకపై జీరాడు శ్రీ రామ నామ భాషగా!
వడిగ,విడిగ,సందడిగ, నానుడి గా సాగు బుడి బుడి బుడి సుడుల తిరుగుడుల భాషయై..
గుసగుసల మసలు పసి కిసలయముల మసలెసగిన పదనిసల భాషయై..
గండ్ర యిసుక ప్రక్క కడు మెత్తగా చేరి మంచితెలిపెడి ఒండ్రు మట్టి భాషయై..
కర్మ ఫలమును గూర్చు శ్రీ కాంత లలితయై, చక్కెర కలిపిన తియ్యని మీగడతరకలాంటి భాష నా తెలుగు భాష!
*************************
*హామీ పత్రం*
ఈ కవిత నా ఆలోచనా స్రవంతి లో జాలువారిన కవితయే అని,మరి ఏ ఇతర సాహిత్య సమూహాలకు పోటీ నిమిత్తం పంపలేదని ఎక్కడా ముద్రించబడలేదని హామీ ఇచ్చుచున్నాను.
**********************
పిళ్ళా వెంకట రమణమూర్తి విశ్రాంత సంస్కృత అధ్యాపకుడు
బి వి కె కళాశాల విశాఖపట్నం
26
కవితా గానం సీజన్ 5
శ్రావణమాసం పౌర్ణమి కవితల పోటీ కొరకు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా
అంశం: తెలుగు భాష
శీర్షిక తీయనైన తెలుగు
రచన డా బల్లూరి ఉమాదేవి
ఊరు:ఉడుపి
1ఆ.వె:అగ్రగామి వౌదు వమ్మ భాషను నేర్వ
కల్ల గాదు వినుము గట్టి నిజము
మమత లూరు నట్టి మాతృభాష నెపుడు
మరువ బోకు మయ్య మహిని నీవు
26ఆ.వె:తెలుగు వారి తెలివి దీటుగా చూపించు
తెలుగు కవుల ఘనత తేట పరచు
తెలుగు భాష యున్న దీప్తి పుంజమ్మని
గళము లెత్తి చాట కదలి రండు.
3ఆ.వె:పాలు తేనె కన్న పనస తొనల కన్న
నెన్న గాను తెలుగు మిన్న గాదె
అమ్మ పాల వంటి కమ్మని భాషను
వీడి పరుల భాష వెంట పడకు.
4ఆ.వె:తెలుగు భాష యన్న వెలుగుచూపెడిదివ్వె
తెలుగు భాష తీపి తేనె వంటి
దనుచు చాటి చెప్ప నాలసింపక రండు
విజయ ఘోష లిడగ వేగ మిచట.
5
.ఆ.వె:ఆటుపోట్ల నెల్ల నధిగమించిన భాష
పర పదముల నెల్ల వాసి గాను
కలుపు కొనుచు సాగు ఘనమైన దీభాష
దేశ భాష లందు దిట్ట తెలుగు/
6
ఆ.వె: ఆంధ్రభాష నేర్వ అఖిలమ్ము నరచేత
పొంద వచ్చు నండ్రు పుడమి యందు
మాతృభాష నేర్చి మహిత యశము నంది
తెలుగు దీధతులను తేట బరచు/
27
కవిత గానం పౌ ర్ణమి పోటీలు గాను
పేరు కొండేటి రాధిక
ఊరు రాయదుర్గం
అంశం తెలుగు భాష
శీర్షిక... వెలుగు... జిలుగు
అమ్మ భాష...
అమ్మలా ఆదరించే భాష...
జన జీవన స్రవంతితో మమేకమైన యాస...
ఆంగ్లేయుల రాకతో అంకురించిన, దేశంలో ప్రవేశించిన ఆంగ్లం అండపిండ బ్రహ్మాండాన్నంతా ఆక్రమించి ,అనంత విశ్వాన్ని శాసిస్తోంది, తెలుగుకు తెగులు పట్టించింది....
అన్ని కార్యకలాపాలలోనూ ఆంగ్లమే పై చేయిగా పురోగమిస్తోంది ప్రగతి పతమై ...
వ్యాపార ఉద్యోగ వ్యవహారాలన్నింటిలోనూ తెలుగులో రాయాలి... తెలుగులోనే జరగాలి... మెదళ్ల మొదళ్ళలో నాటుకుపోయిన పర భాషా వ్యామోహపు మత్తును వీడాలి...
తుప్పు పట్టిన జనులకు తెలుగనే ఇనుము రుచిని చూపాలి...
మట్టిలో దాగిన మాణిక్యమైన తెలుగు వెలికి తీసి మరింత మెరుగులు దిద్దాలి...
అత్యంత సౌందర్య రుచి కలిగిన తెలుగు భాషకు జాతీయ భాషగా గుర్తించి ఔన్నత్యం తేవాలి...
తెలుగు కవనాలతో కళకళలాడే తెలుగు సాహితీరంగం మహోజ్వలమై వెలుగొందుతుండగా, పిల్లలు పెద్దలు అధికార అనధికార అన్ని కార్యాకలాపాలలోనూ తెలుగులో మహోజ్వల భవితతో రంకెలేసే గుర్రమై విశాల భూభాగమంతా పరుగులు తీస్తుంది, అలవక, సొలవక...
ఆ చంద్ర తరార్కంగా వెలిగే సూర్యబింబం తెలుగు..
అజరామరమై నిలిచే వెన్నెల కిరణం తెలుగు.
28
నా తెలుగు
**********
అమృత భాష నా తెలుగు
అవధానం నా తెలుగు
ఆది కావ్యమున తెలుగు
ఆదికవిగ నా తెలుగు
తిక్కనార్యము నా తెలుగు
చక్కదనమే నా తెలుగు
జానపదమున నా తెలుగు
జ్ఞానపథమే నా తెలుగు
త్యాగరాజము నా తెలుగు
తేనె మధురిమ నా తెలుగు
అన్నమయ్యగ నా తెలుగు
వెన్నముద్దల నా తెలుగు
శ్రీనాథుచాటువు నా తెలుగు
శ్రీ శ్రీ పదగుంభన నా తెలుగు
అల్లసాని అల్లిక నా తెలుగు
చల్లనైన వెన్నెల నా తెలుగు
గురజాడ అడుగుజాడే నా తెలుగు
శ్రమజీవుల చెమటజాడే నా తెలుగు
అన్నార్తుల ఆకలి నా తెలుగు
అన్నదాతల కేకే నా తెలుగు
శిల్పికారుల శిల్పం నా తెలుగు
అల్పంలో అనల్పం నా తెలుగు
గోదావరి గలగల నా తెలుగు
కృష్ణవేణి నడకే నా తెలుగు
రామదాసు కీర్తన నా తెలుగు
వేమనాటవెలదే నా తెలుగు
జాషువా గబ్బిలం నా తెలుగు
ఎంకి సుబ్బులపాటే నా తెలుగు
గ్రాంథికం భాషే నా తెలుగు
వాడుకను భాషే నా తెలుగు
గిడుగు గొడుగై నా తెలుగు
జనుల అడుగే నా తెలుగు
పల్లె పదమే నా తెలుగు
తొల్లి బడిలో నా తెలుగు
తెలుగుతేజము నా తెలుగు
వెలుగు రాజము నా తెలుగు
నా తెలుగు ఇది జగతికి వెలుగు
జగతికి వెలుగు ఇది నా తెలుగు
---------------చంద్రమౌళి, కుప్పిలి
MEO Srikakulam
9346457223
ఇది నా స్వీయ రచన...🙏
29
[28/08, 1:02 pm] Lalita Sister: శ్రావణ మాస పౌర్ణిమ కవితల పోటీ!
27-8-2024.
శీర్షిక....."అమ్మ- ఆశీస్సు"
అజంతమై,అష్టావధానమై అలరించుతున్నా!
ద్విపదనై, గద్యమై,జానపదమై దరిచేరాను!
గేయమై, గానమై ఆనందహేలనయ్యాను...!
పద్యమై,ప్రబంధమై, తెలుగుల ప్రత్యేకతనయ్యాను!
ఛందస్సునై..ఆటగా మేథస్సుకి పదును పెట్టాను!
ఇతిహాసమై, కావ్యమై,శారద మందహాసమయ్యాను!
పలుకుబడులతో.. సామెతలతో..పరవశింపచేస్తూ...,
రూపకంగా..నాటకంగా..కనువిందు చేస్తూ..
జాతీయమై..నుడికారమై..వీనులవిందు చేస్తూ...
చాటువులలో.. ఆశువునై చమత్కారమయ్యాను!!
హరికథనై..బుర్రకథనై మనసును మురిపించాను!
కోలాటమై,తరంగమై,చెక్కభజనగా తాళ మయ్యాను!
తారంగమై..లాలిపాటనై బాలగోపాలమయ్యాను!
శతకమై,నీతులసారమై..భక్తిభావభరితమయ్యాను!
పదకవితలసంకీర్తనగా,కృతిగా ముక్తిపథమయ్యాను!
తత్త్వమై,వైరాగ్యపుతలుపుతీసి వెలుతురయ్యాను!
పలుకుల చమత్కారాలతో..పన్నీరు చల్లాను!
పొడుపుకథనై,ఎత్తిపొడుపునై, తీవ్రతచూపాను!
వచనకవితనై..లఘుకవితగా..పరుగుపెడుతున్నాను!
అమ్మనికదా.!. నిన్నెంతో లాలిస్తూ..అలరిస్తూవుంటా!
ప్రపంచమంతాపరచుకుంటూ,కోట్లాదిసంతానమున్నా,
"వ్రాతలేనికూత ఎగరలేని బావుటా" అని. గమనించి,
తెలుగుభాషామతల్లి వెలుగుదారి చేరాలంటే..
నీభాషకి..మాతృమూర్తికి చేయెత్తి జైకొట్టు తెలుగోడా!
అపుడూ,ఇపుడూ,ఎపుడూ, ఘనకీర్తి నీదేకదా!!
########
అమ్మ-ఆశీస్సు" అనే ఈ కవిత నా స్వంత రచన!
డా.వేమూరి.సత్యవతి.
9885136308.
30
శ్రావణమాసపు కవితలపోటీకీ నాకవిత
పేరు : డా.భమిడిమఱ్ఱీ
కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
అంశం : తెలుగుభాష
శీర్షిక: అజరామరం
మధురం మధురం మధురాతిమధురం మనభాష తెలుగుభాష
అజరామరం,అమృతతుల్యం, అజంతం, అఖండం,అద్భుతం
నన్నయరసరమ్యాక్షరాల రవళి
తిక్కనతేటతెనుగుపదాల కాహళి
శ్రీనాథ జాతీయతల జావళి మనభాష
పాల్కురికి నోట కులికి పులకించిన భాష
నన్నెచోడ కలికిరాయలు నడిపించిన భాష
అన్నమయ్యపదాల నలరించిన భాష
త్యాగయ్యరామభక్తిని చాటినభాష
గురజాడ,విశ్వనాథ , సినారెల
సాహిత్యసౌరభాలభాష
శ్రీరంగంవిప్లవ శంఖారావాల భాష
కిన్నెరమ్మసొగసులు,కూనలమ్మ కులుకులభాష మనభాష తెలుగుభాష
రాజమహేంద్రవరపుభాష
రాజసం ఒలుకుభాష
భాగ్యనగరం భాష ఐకమత్యంగల భాష
తెలంగాణాభాష తేటనైనభాష
నల్గొండభాష , నరనరాల చైతన్యభాష
పవిత్రకృష్ణాగోదావరులభాష సరిగమలభాష ,ఘుమఘుమలభాష మనభాష
రతనాలపేట, ముత్యాలబాట
మమతలవెలుగు,మనభాష
వెన్నెల చల్లదనం,తేనెల తీయదనంపువ్వులమెత్తదనం
గలభాష మనభాష తెలుగుభాష
అందాల అక్షరాల హరివిల్లు
ముచ్చటగొలుపు పదాల పొదరిల్లు మనభాష
తెలుగుభాషరా
దేశభాషలందు తెలుగులెస్స
పైకవిత నాస్వంతం.
31
[27/08, 10:05 pm] +91 93464 57223: నా తెలుగు
**********
అమృత భాష నా తెలుగు
అవధానం నా తెలుగు
ఆది కావ్యమున తెలుగు
ఆదికవిగ నా తెలుగు
తిక్కనార్యము నా తెలుగు
చక్కదనమే నా తెలుగు
జానపదమున నా తెలుగు
జ్ఞానపథమే నా తెలుగు
త్యాగరాజము నా తెలుగు
తేనె మధురిమ నా తెలుగు
అన్నమయ్యగ నా తెలుగు
వెన్నముద్దల నా తెలుగు
శ్రీనాథుచాటువు నా తెలుగు
శ్రీ శ్రీ పదగుంభన నా తెలుగు
అల్లసాని అల్లిక నా తెలుగు
చల్లనైన వెన్నెల నా తెలుగు
గురజాడ అడుగుజాడే నా తెలుగు
శ్రమజీవుల చెమటజాడే నా తెలుగు
అన్నార్తుల ఆకలి నా తెలుగు
అన్నదాతల కేకే నా తెలుగు
శిల్పికారుల శిల్పం నా తెలుగు
అల్పంలో అనల్పం నా తెలుగు
గోదావరి గలగల నా తెలుగు
కృష్ణవేణి నడకే నా తెలుగు
రామదాసు కీర్తన నా తెలుగు
వేమనాటవెలదే నా తెలుగు
జాషువా గబ్బిలం నా తెలుగు
ఎంకి సుబ్బులపాటే నా తెలుగు
గ్రాంథికం భాషే నా తెలుగు
వాడుకను భాషే నా తెలుగు
గిడుగు గొడుగై నా తెలుగు
జనుల అడుగే నా తెలుగు
పల్లె పదమే నా తెలుగు
తొల్లి బడిలో నా తెలుగు
తెలుగుతేజము నా తెలుగు
వెలుగు రాజము నా తెలుగు
నా తెలుగు ఇది జగతికి వెలుగు
జగతికి వెలుగు ఇది నా తెలుగు
---------------చంద్రమౌళి, కుప్పిలి
MEO Srikakulam
9346457223
ఇది నా స్వీయ రచన...🙏
32
[27/08, 10:46 pm] చేబియ్యం శ్రీనివాసరావు గారు: కవితాగానం సీజన్ 5 కొరకు
రచన : చేబియ్యం శ్రీనివాసరావు
ఊరు : గుజరాతిపేట, శ్రీకాకుళం
అంశం : తెలుగు భాష
శీర్షిక : నా తెలుగు.... నా తెలుగు భాష
సోయగానికి సాటి ఎవరంటా
సెలయేటి అలలా
మురిసేటి తల్లిలా
అందాల హరివిల్లులా
ఆకలికి ఏడ్చు పాపలా
ఆనందపు అడుగులులా
ఆత్మీయ పలకరింపులా
గోదావరి గల గలలా
కృష్ణమ్మ పరవళ్లులా
సముద్రపు సందడిలా
వయ్యారి సోయగాలలా
ప్రియురాలి కొంటె చూపులా
కోరమీసపు కుర్రాడి దొంగ నవ్వులా
శ్రీనాధుని శృంగార కల్పనలా
పోతన భక్తి పారవశ్యం లా
ముక్కు తిమ్మాన పారిజాతాపహార కధనం లా
చంటిపాప నవ్వుల పువ్వుల్లా
పక్కింటావిడ కాఫీ అప్పులా
తాతగారింట మనవడి పనుల్లా
నా తెలుగు.... నా తెలుగు భాష
సోయగానికి సాటి ఎవరంటా
హామీపత్రం : ఇది నా స్వీయ రచన
Comments
Post a Comment