Skip to main content

కార్తీక పౌర్ణమి కవితల బ్లాగు 25102025


నిర్వహణ 
_*మిత్రులందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు*_
_కార్తీక పౌర్ణమి కవితల పోటీ కోసం వచ్చిన కవితలు 
*********************
మొదట పోస్ట్ చేయబడిన కవిత
1.  _కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారిది_ 
*****"*****"***********
_2.పిళ్ళా వెంకట రమణమూర్తి గారు_
_3.డా. బల్లూరి ఉమాదేవి గారు_ 
_4.అఫ్సర్ వలీషా గారు_ 
_5.సింగీతం సంతోష కుమార్ గారు_
_6.మండ నాగేశ్వరరావు గారు_ 
_7.కాసుల ధీరజ్ శర్మ గారు_ 
_8.గొర్రెపాటి శ్రీను గారు_
_9.కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు_
_10.డా.కమలాదేవి గారు_ 
_11.తాతపూడి సోమశేఖర శర్మ గారు_
_12.పిన్నక నాగేశ్వరరావు గారు_ 
_13.తరణికంటి సూర్యలక్ష్మి గారు_ 
_14.జి.సూర్యనారాయణ గారు_
_15.కొంజేటి రాధిక గారు_
_16.ఉదయగిరి మధుమోహన్ గారు_
_17.కూని అంకబాబు గారు_
_18.తోట సులోచన గారు_ 
_19.డా.వేమూరి సత్యవతి గారు_
_20.సింహాద్రి వాణిగారు_
_21.వాణిసరోజిని లక్కరాజు గారు_ 
_22.మధు అమరగాని గారు_ 
_23.నెల్లూరి వెంకటలక్ష్మి గారు_
_24.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు_
*************************************
1
శీర్షిక::: ఆధ్యాత్మిక సారం 

స్వీయ రచన కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, పాతర్లపాడు, ఖమ్మం .:::సెల్ ఫోన్ 62816 979 .

కార్తీక మాసం అందమైన ఆధ్యాత్మిక సారమే,
నీటి చల్లటి హాయిలు హృదయానికి సాంత్వనమే.

పొద్దున పూసే పువ్వులు సుగంధంగా విరిసె,
గాలిలో ఎగిరే పక్షులు పాడుతుంటే సొగసే.

నిత్యకర్మలు పూజలు ప్రార్థన ఘనత కలిగిన,
దేవుళ్ళ దివ్య దర్శనం, మనుజులకు మోక్షం.

ఆకాశపు నీలిమ ఈ మాసపు నయనానందం, 
చంద్రుని కాంతి వెన్నెలతో జీవితంపై వ్యామోహం.

ఆరోగ్యం, శుభ్రతకు కారణమైన ఈ కాలం,
కార్తీక దీపం వెలిగించగా మనసు ఆశను ధరిస్తుంది.

స్నానం చేసిన శుభ్రతతో, శరీరం స్మార్తమై,
కష్టాలు పోవాలని అర్థిస్తు, ప్రార్థిస్తుంది.

పర్వత శిఖరాల మీద రాత్రి జ్యోతి మెరిసె,
భక్తి గీతాలు కీకి మదనాల మాధుర్యం కురిసె.

వర్షం దంగా ఆగిపోగా, నీరు గడ్డకట్టేస్తుంది రోజు,
కళ్లకు హేమంతపు వానలా శుభాలు తెస్తు.

మిత్రుల హృదయాలకు వెలుగుల పునాది సమర్ధించె,
కార్తీక మాసం సుగంధం రేపిన వాతావరణం.

దేవతలు దీపం చూసి ఆనందంగా నవ్వగ,
మనసులు కలిసి, ప్రేమతో పొంగిపోయాయి.

ఇల్లు, ఆంగనం, వీధులు వెలుతురు కలిగి,
పవిత్రతా భావన ఈ మాసంలో ప్రసరిస్తుంది.

కార్తీక మాసం ఉచ్ఛ్వాసంగా జీవితం పునర్నవం,
మనసులో ఆశలు పూస్తూ ఆనంద పరవశం.

ఇక్కడి కవిత్వం ఆద్భుతంగా బతుకులో వెలుగు,
ప్రేమ, పూజ, ధర్మం కలుస్తూ వెలుగున వెలుగు.

కార్తీక మాసం జీవితానికి కాంతివంతమైన పసిడి బాట, 
దేవ సంరక్షణలో మనల్ని కాపాడే అచ్చమైన కోట.

మాటలు మాధుర్యంగా వినిపించే ఈ మాసంలో హర్షం,
ప్రకృతి మాత ఆలింగనంతో, సంతోషం పొందే పర్వం.

 2
*
పిళ్ళా వెంకట రమణమూర్తి 
జిల్లా 
*
విశాఖపట్నం 
ఫోన్ 
*
9701885764
కవిత
*
శీర్షిక: *ఐశ్వర్య రాగోదయం* 

ఒక్క చినుకు నుదుటి రాతను సాంత్వన
పరుస్తోంది...!

చేరబిలిచే తుషార బిందువు 
తల్లి భూమాత 
సిగన సిగ్గు మొగ్గలువేయిస్తోంది!

కార్తీకం తొలిమెట్టున
పసుపుకుంకుమ కలిపిన చేతుల చేతలా ఉషోదయాలు...
 
గగన సీమలకు
రంగులు జిమ్మే
శుభ లక్షణ లక్ష్యంగా... 
 
శివనామ స్మరణతో సునాద వినోదమవుతోంది జగతి...

శంఖ ధ్వని గలగలలకు పక్క వాద్యంలావినిపిస్తోంది...

కార్తీక పున్నమి చంద్రుడు 
బోలెడు విభూతి బొట్లు పెట్టుకుని ..

చుక్కలతోరణంతో చిరు నవ్వులు చిందిస్తూన్నట్లు లేదూ!

అష్ట ఐశ్వర్యాల గజగమనం 
ప్రతి నట్టింటి కళకు..
 
కుమ్భన్యాసం చేసే కమనీయ దృశ్యం ఈ
కార్తీక మాసం!

పుణ్యాలు పోగేసు కునే పసిమి ఛాయేదో ప్రకృతి కాంత అడ్డ బాసలా 
తళుక్కు మంటోంది...

కార్తీక శోభ అంటేనే 
అదో మంత్ర పూతమైన మనో యాగశాల....

ఏ మంత్రోచ్ఛారణల మైపూతదాల్చిందో 
ఈమాసం.‌‌..

జన్మ దారిద్య్రపు ముతక బట్ట సాంతం జీర్ణమై...

నమ్మి పూజించే అయ్యప్ప దీక్షా తోరణ దారుల భక్తి గీతాలాపనలు ...

ఆధ్యాత్మిక ఐశ్వర్యాల ఆలంబనకు అడుగు జాడలు ..

తమ భక్తి యనే చేతలకు 
సహస్రానేక 
సిరిసంపదలు ...

గుదిగుచ్చిన 
సిగపాయల శ్రీమంతం ఇదేనంటూ 
చాటుతున్న 
ఆస్తిక సమూహాలు..

ఈ నేల ప్రాభవాలకు ఎగురవేసిన బావుటాలు !

ఇది ఓ ఐశ్వర్య 
రాగోదయపు ఆనందం..

కార్తీక మాసం అందిస్తున్న 
ఇస్తినమ్మ వాయనం
3
*
డా బల్లూరి ఉమాదేవి 
జిల్లా 
*
కర్నూలు 
ఫోన్ 
*
9493846984
కవిత
*
కార్తీక మాసం 

హరిహరులకు ప్రీతిపాత్రం కార్తీక మాసం
  ఆధ్యాత్మికతను మనలో పెంచుతూ
ముక్తి మార్గం వైపు నడిపించే మాసం
ఇంటి ముంగిట వేలాడే ఆకాశదీపం
 సకల శుభప్రదం సుమనోహరం

తెల్లవారకముందే వెలిగించేది ఉదయదీపం
చీకట్లు ముసరేముందు వెలిగించేది ఆకాశదీపం
అజ్ఞానాంధకారాన్ని పోగొడుతూ మానవాళికి
 విజ్ఞానం పంచేవీ దీపకాంతులు

శివ కేశవులకు ఆలయాలలో మాస పర్యంతం 
 కార్తీక పూజలు జరపడం తరతరాల ఆచారం
కార్తీకంలో ఉసిరి చెట్టు క్రింద చేసే వన భోజనం 
   మన సమైక్యతను ప్రతిబింబించే శుభ చిహ్నం

సర్వాంతర్యామి అయిన శ్రీహరి
క్షీరాబ్ధిలో గాడ నిద్రనుండి లేచే మాసం
కార్తీక దామోదరు నారాధించే మాసం
వెన్నెల విరజిమ్మె శరత్కాలం

తులసి కళ్యాణం కార్తీక పౌర్ణమి
పర్వాలను సంబరంగా జరుపుకొనే మాసం
ఆకాశ దీపాలతో వెలుగులు పంచుతూ 
ఇంటింట ఆనందాన్ని పంచే ఆశాదీపం.

డా బల్లూరి ఉమాదేవి

4
*
సింగీతం సంతోష్ కుమార్ 
జిల్లా 
*
కామారెడ్డి 
ఫోన్ 
*
8897152205
కవిత
*
శీర్షిక: పవిత్రమైన మాసం 

పౌర్ణిమినాడు కృత్తికానక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి 
వచ్చే కార్తిక మాసం
శివుడికి ప్రీతికల మాసం..
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం
అత్యంత మహిమాన్వితమైన మాసం
భువి అంతటా ఆణువణువున నిందీయుండే
నీలకంటేశ్వర్యుడు 
ప్రతి జీవిని ప్రేమగా చూస్తూ,రక్షించే ప్రేమామయుడు
ప్రొద్దున్నే లేచి క్లేషము గల చలిలో దేవలయనికి వెళ్ళి
అమృత బిందువులతో 
అభిషేకం చేస్తే కరుణించు బోలాశంకరుడు
తన శరీరంలో అర్ధబాగాన్ని ఇచ్చి అర్ధ నారీశ్వరుడయ్యే
తన శీరస్సులో చంద్రుణ్ణి ఆభరణం వలే ధరించిన 
చంద్రనడుడయ్యే 
కార్తీక మాసం నెల రోజులపాటు భక్తులు, భక్తి శ్రద్ధలతో 
నిష్టతో పూజాలందుకొనే పరమ శివుడు
మెడ ఫణినీ అంతర్వాహినినిధరించిన శశాంకశేఖరుడు
హిమాలయాలన్ని నివాసం చేసుకున్న నిత్యనాధుడు కైలాస
సర్వేశ్వరుడు 
భూలోకంలో ప్రతి నిత్యం పూజాలందుకున్నే 
భువి రక్షకత్వచుడు 
దేవతలంతా కలిసి దివికి దిగి వచ్చి దీపావళి జరుపుకుంటారని నమ్మిక గల
మాసం....
*
మొహమ్మద్ అఫ్సర వలీషా
జిల్లా 
*
కోనసీమ జిల్లా
ఫోన్ 
*
8500597116
కవిత
*
కవితా గానం(సీజన్...6) 
అంశం... కార్తీక మాసం/కార్తీక పౌర్ణమి
శీర్షిక... సకల శుభాల మాసం

జాబిలి పూర్ణ చంద్రం 
కృత్తికా నక్షత్ర సంచారం
కార్తీక మాస బిరుదాంకితం 
సకల శుభాల ఈ మాసం.... 

శివ , విష్ణు లకు ప్రీతికరం
శివధ్యానం, శివాభిషేకం
అర్ధనారీశ్వర దర్శనం
దోష నాశనం,సర్వం శుభం .... 

సూర్యోదయ నదీస్నాన వ్రతం
గృహిణులు, యువతుల,తులసికోట ప్రదక్షిణం
గౌరీదేవి పూజ, దీపారాధనం
సకల శుభాల ఈశ్వరానుగ్రహం... 

విష్ణు ప్రియం దామోదర నామం
కార్తీక మాస దామోదర ప్రీత్యర్థం
తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం
విష్ణు సహస్ర నామ స్తోత్రం శుభకరం .... 

ఈ మాసం ఏకాదశి విశేషం
ఉత్థానైకాదశి,కార్తీక శుద్ధ ద్వాదశి,
కార్తీక పౌర్ణమి దినం 
అత్యంత ప్రశస్తం.... 

కార్తీక మాస నదీజల స్నానం
ఆరోగ్య వనమూలికల కలుషితం
అత్యంత ఆరోగ్య ప్రదాయం
సకల రోగ నివారణం .... 

కార్తీక మాస ఆకాశ దీప ప్రారంభం
ఉభయ సంధ్య దీపారాధనం
రుద్రాభిషేకం
శివానుగ్రహం, విష్ణానుగ్రహంకు మహాశ్రేష్టం .... 

సర్వ మంగళం,
సమస్త జనులకు ప్రయోజనకరం
సకల శుభాల కార్తీక మాసం.....!! 

హామీ.. నమస్తే🙏ఈ కవిత నా స్వీయ రచన అని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను

మొహమ్మద్ . అఫ్సర వలీషా.
ద్వారపూడి (కోనసీమ జిల్లా)

6
*
🪔 కార్తీకదీపం🪔
🪔🪔🪔🪔🪔🪔🪔🪔

ప్రతి మదిలో ప్రభవించాలీ కృత్తికరూపం..
ప్రతి హృదిలో వెలిగించాలీ 
కార్తీక దీపం...!!
అరటి దొప్పలో ఆవునెయ్యతో
అమృతదీపం !!
ఉసిరిపండులో నిండుగవెలిగే
ఆకాశదీపం!!
మూడువందల అరవైఐదువత్తుల 
అధ్భుతదీపం!!
ఇహపరాలలో ముక్తిని ఒసగే 
మౌక్తికదీపం!!
తల్లితులసీమాత ఒడిలో వెలిగే విష్ణు రూపం!!
క్షీరాబ్ధితనయుని ఉల్లము నింపే
వెలుగులదీపం!!
దామోదరునీ భక్తితో వేడే
ఆనందదీపం 
పాపపరిహారార్ధం వెలిగించేదే
కార్తీకదీపం
కన్యలందరూ మనసార వేడీ 
కోరినకోర్కెలు పండించాలని,
మోక్ష సాధనకు భక్తితో జ్వలింపజేసే జ్వాలతోరణం ఆశాదీపం !!
శివకేశవుల పెన్నిధిలోనే సన్నిధి కోరే సంధ్యాదీపం!!
పౌర్ణమిరోజున ప్రార్ధన చేసీ వెలిగించే భక్త్యాదీపం!! దీపదానముతో కైవల్యముక్తీ 
కార్తీకదీపారాధనకు శ్రధ్ధాభక్తీ
అద్భుతమైనది అనంతశక్తీ!!!
నిండుపున్నమీ, పండువెన్నెలా 
చంద్రునికొలిచే సంప్రదాయమది,
మనసున ప్రశాంతి కోరుకునేది!!
కార్తికమాస శోభాయమానం
వరిదుబ్బులతో పూజలందుకొను
విశేషమాసం!!
మహాశివునికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసాన ఆకాశదీపాలు
తొలగింపజేయు ముక్కోటిపాపాలు!!
అయ్యప్పస్వాములూ,భవానీమాతలూ శరణుఘోష దీపహారాలు!!
భక్తుల పాలిట కోటివరాలు!!!

కార్తీకపున్నమిరోజున వెలిగించేదే
ఆకాశదీపం!! ఆశావహ దీపం!!!🪔🙏🪔🙏🪔🙏🪔🙏🪔

      ------మండ.నాగేశ్వర్రావు..✒️
             సరిపల్లి, పెందుర్తి
*
కాసుల ధీరజ్ శర్మ
జిల్లా 
*
తూప్రాన్, మెదక్ జిల్లా
ఫోన్ 
*
9440522864
కవిత
*
* * * * * * * * * 
కార్తీక పౌర్ణమి 
* * * * * * * * * 

కార్తీక పౌర్ణమి రోజున
సువాసినులకు దొరకదు తీరిక!
దైనందిన పూజాది
కార్యక్రమాలతో పాటు విశేష దీపారాధనలో మునక!!

ప్రతి వత్సరపు కార్తీక పౌర్ణమి 
మృణ్మయ ప్రమిదల ప్రత్యేకతలకు ప్రతీక!
శతకోటి విజ్ఞాన వీచికల మాటున
ప్రమోద ప్రమిదలలో జ్ఞాన ప్రదీప్తుల చేరిక!!

అకలావికలముగ పరుగులిడు
మనుజుల మనస్సులలో ఆనంద పొందిక!
చర్మ సౌందర్యమును పెంచి పోషించు ఆరోగ్య కారక దివ్యౌషధముల ఉసిరిక!!

ఉషోదయాత్పూర్వ అపూర్వ
అభ్యంగన స్నానములతో పండుగ వేడుక!
శ్వేత వర్ణ వెన్నెల వెలుగుల 
దివ్య రమణీయ సుందర పొందిక!!

నిండు పున్నమి వెన్నెలలో మిలమిల మెరియు
ప్రకృతి కాంత సిరిసంపదలతో తలమానిక!
పుంఖానుపుంఖ నక్షత్రముల నడుమ దేదీప్యమానంగా వెలుగులీను ఖగోళ దీపిక!!

అష్టమీ చంద్ర విరాజమాన
ద్విగుణిత కళల సమాహారముల నీహారిక!
విష్ణుసహస్రనామ పారాయణ రుద్రాభిషేకాది ఆధ్యాత్మిక పుణ్య వైభవ నమ్మిక!!

భక్తి శ్రద్ధలతో ఇసుమంత పూజించిన కోటి రెట్ల ఫలములు 
అందించు అక్షయ పేటిక!
అరటిదొన్నెలలో ఆవునేతితో దీపములు వెలిగించిన పాప ప్రక్షాళనలకు మార్గ నిర్దేశిక!!
 
జీవ నదులలో స్నానమాచరించిన
కలియుగ నైసర్గిక స్వర్గ మార్గమే కార్తీక పౌర్ణమి కానుక!
ఔషధీయ కిరణ కారక 
నభోమండల పూర్ణ చంద్ర కార్తీక చంద్రిక!!
8
శీర్షిక :కార్తీక మాసం విశిష్టత  
రచన: గొర్రెపాటి శ్రీను,చరవాణి : 9652832290


శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీకం!
పూర్ణ చంద్రుడు కృత్తికా నక్షత్రం లో సంచరిస్తూ
దర్శనమీయడం ఈ మాసం ప్రత్యేకం!  
రుద్రాభిషేకాలు,లక్ష బిల్వార్చనలు,రుద్ర పూజలు
ఎన్ని రకాలుగా పుజించినా కరుణామయుడు మహేశ్వరుడు  
ఇష్టంగా దీవించే శుభ మాసం కార్తీకం !
"అభిషేక ప్రియః శివః"  
మహాశివుడు అభిషేకప్రియుడు
జలంతో అభిషేకిస్తే సంతసుడై
కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడు
ప్రసాదించే వరాలు అసంఖ్యాకం!
ఆలయాలలో కార్తీకమాసంలో వెలిగే
"ఆకాశదీపం"పశుపక్షాదులకే కాదు
సమస్త ప్రాణికోటికి అందిస్తుంది మోక్షం!
"కార్తీక దామోదర ప్రీత్యర్ధం"
శ్రీ మహావిష్ణువు దామోదరుడిగా పూజించబడుతున్న మాసం
కార్తీకం !
హృదయమంతా భక్తి భావాన్ని నింపుకుని
సూర్యోదయానికి ముందే నదీస్నానాలు చేస్తూ
శివవిష్ణువులను ఆరాధిస్తే అందే ఆనందం అనంతం !

9
*
కొలకలూరి దేవికారాణి రత్నాకర్ తెనాలి 
జిల్లా 
*
గుంటూరు 
ఫోన్ 
*
9908706218
కవిత
*
చంద్ర దోషం పట్టనీక
మనసును హరించే చంద్ర జ్యోత్స్న

ఆనందాల పౌర్ణమిది

పవిత్రతను పొదువుకునే కార్తీక పౌర్ణమి
 ఆత్మల సాక్షాత్కారమిది 
మముక్షకై ఆకాంక్షల పౌర్ణమిది జ్ఞాన జ్యోతులతో ఆత్మ జ్యోతులను వెలిగించే కార్తీక పౌర్ణమిది

కోటి దీప కాంతులతో పాపపు చీకట్లను చీల్చే అఖండ జ్యోతిర్లింగ కాంతి ఇది

కార్తీక పౌర్ణమి శుభవేళ క్రతువులు పుణ్య కార్యాలకు అనువైన వేళ ఇది

స్వర్గ ద్వారాలు తెరిచే పుణ్యప్రద తరుణమిది ఎవరిని అవమానించకు

ముసలి వారిని బాధితులను పీడితులను బాధింపకూడదని ప్రబోధించే

హైందవత్వ గొప్ప సూచన ఇది వనసంతర్పణలతో

పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను

బోధించే సంప్రదాయ ప్రతీక ఈ కార్తీక పౌర్ణమి

కలిసికట్టుగా ప్రజలంతా ప్రకృతి మాత ఒడిలో సేదతీర మని తెలియచెప్పే సామాజిక విలువల కార్తీక పౌర్ణమిది

పుణ్య కార్యాలకు నాంది పలికి అరిషడ్వర్గాలను జయింపజేసే కార్తీక పౌర్ణమి
10
పేరు : డా.కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
తేది : 19-10-25

శీర్షిక: మహిమాన్వితము

కార్తీక శుద్ధ పౌర్ణమే 
కార్తీక పౌర్ణమి
మహిమాన్వితము
పుణ్యఫలప్రదమైన 
పౌర్ణమి ఇది
హరిహరులకు మిక్కిలి 
ప్రీతిపాత్రమైన పౌర్ణమి
జరుపుకుంటారు
మహన్యాస ఏకాదశ
రుద్రాభిషేకాలు నేటిదినాన
దీపారాధన ముఖ్యము
స్త్రీలు సౌభాగ్యాన్ని
కోరుతూ 
చేస్తారు దీపారాధన
వెలిగిస్తారు
దీపాలను ధ్వజస్తంభాలపై
అలంకరిస్తారు
దేవాలయాలను 
దీపతోరణాలతో
ఏర్పరుస్తారు
ఆకాశదీపాలను 
అరటి దొన్నెలలో దీపాలను పెట్టి
వదులుతారు స్త్రీలు 
నదీజలాలలో
సత్యన్నారాయణ వ్రత కల్పాలు
రుద్రాభిషేకాలకు
శుభదినము ఈకార్తీక పౌర్ణమి
కార్తీక పురాణ పారాయణలు
తులసీ దామోదరుల కళ్యాణాలు జరిగే
పుణ్యదినము ఇది
శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొను శుభ సమయం
దీపదానాలు, దానధర్మాలు, ఉపవాసదీక్షలు జరిగే
పుణ్య దినము ఈపౌర్ణమి.

పైరచన నాస్వంతం.

11 
*
తాతపూడి సోమశేఖర శర్మ 
జిల్లా 
*
పాండిచేరీ స్టేట్ 
ఫోన్ 
*
8328079336
కవిత
*
కార్తీక మాసం

శశి,కృత్తికల కలయిక, ప్రాత:కాలనదీస్నానం 
దీపజ్యోతులకళకళలు, ఆధ్యాత్మికతా ధ్యానం 
ఆరాధనలతో పొందే మన ఆత్మసంతృప్తివరం
భగినీహస్తభోజనం,నాగులచవితిఆరాధనం 
భక్తియుతకార్తీకమాసం,మోక్షoతోకటాక్షమయం

కార్తీక దీపాలు,నదీగమ ప్రవాహ గమనం
కార్తీక పౌర్ణమి ఉపవాసం, జ్వాలాతోరణం 
సకలపాపాలదోషహరం, కార్తీకనర్తాలఉపవాసం 
పున్నమిచంద్రుని వెలుగులు,మనసుకుఉల్లాసం శశికాంతులవెన్నెల,హృదయానందకరఆరోగ్యం 

ముత్తయిదువులకు పున్నమినాటి ఉపవాసం
పిల్లలకోసంచలువకమార్గం,చవితిరోజుననర్తం 
చంద్రదర్శనమయ్యాకచలిమిడియే ప్రసాదం
కార్తీకమాసంమధ్యలో నిండుపూర్ణిమానందం 
అత్యధిక విశిష్టత గల్గిన భక్తి--ముక్తిప్రదాయకం 

లక్ష్మీనారాయణప్రియం,ఉసిరిచెట్టుప్రదక్షిణం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీ నారాయణం
వనభోజనం భుజించు భక్తులకు ఇచ్చు మోక్షం
కార్తీకమాసమంటేనే హరిహరభక్తసందోహము 
నిత్యందీపాలతో పున్నమివెలుగులఆనందము
కార్తీకపండుగకోలాహలం..భక్తిముక్తి సాధనము

కార్తీకమాసంలో ప్రతీనిత్యంపండుగే..పండుగ
భక్తుల కోలాహలముతో నిండిన భక్తి పండుగ
కార్తీకమాసం...భక్తులకు పుణ్యప్రదం నిండుగ
హరిహరులఆరాధనమైన ఆధ్యాత్మికపండుగ 

 హామీపత్రం
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం
12

పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్..
శీర్షిక :-- కార్తీక దీపం.

1.తే.గీ.
దీపము ప్రధానమగును కార్తీక మందు
నట్టి దీపముల్ వెలిగించి యతివలెల్ల
భక్తితోడ నారాధించ ప్రముఖ మాస
మున జరిగెడు దీపోత్సవముగ వెలుంగు. 
2.తే.గీ.
దీప మిచట శరీరమై తేజరిల్ల
అందు వెలిగెడు కాంతియె యాత్మ యైన
దేహమందున్న నజ్ఞాన తిమిరమంత
తొలగి మదిని విజ్ఞానపు వెలుగులుండు.
3.తే.గీ.
వచ్చు కార్తీక మాసాన పౌర్ణమి దిన
మందు దీపాలు వెలిగించి మహిళలంత 
భవుని యాలయమున కేగి భక్తి తోడ
పూజ యొనరించి నిర్మలముగను మదిని
యుంచమనుచు శివుని కోరుచుంద్రు సతము.
4.తే.గీ.
హరి హరులిరువురికిని యత్యంత ప్రియము
కార్తికము, నట్టి మాసమాకాశ దీప
ము వెలిగించి ధ్వజస్తంభమునకు పైన
త్రాడుతో కట్టెదరు దేవళమ్ములందు.
5.తే.గీ.
పయనమున్ జేసెడు పితృదేవతలకా స
మయమున నుపయోగ పడును మార్గదర్శి
వలె గగనపు కార్తీక దీపమను విషయ
మొక పురాతన గ్రంథమందుండె జూడ.
**************************************
13
" కార్తీకమాసము కార్తీక పౌర్ణమి"
   " పౌర్ణమి కవితల పోటీ "
  20/10/2025/ సోమవారము
అంశం: కార్తీకమాస కరియలు
                    సీ! (1)
కార్తీకదీపాలు కాంతులుజిమ్ముచు
అంధకారమునంత అణచివేయు

రాతిరైననుకాని రవితీరు వెలుగులు
పగటివెలుగులను పరచుకొనియె

మింటినితారల మిణుకుమిణుకుమను
తళకులన్నియుకూడ తరిగిపోయె

పున్నమివెన్నెల పుడమినపడినను
కిరణాలకాంతుల కిందపడవు
                ఆ !
మాసమంతపెట్టు మహిళలుదీపాలు
అంధకారమైన అందుకాంతి
కాంతివెలుగులన్ని కార్తీకమాసాన
పగటివెలుగులన్ని పంచగాను !
                  సీ! (2)
కోటిప్రమిదలందు కోటిదీపాలను
కాంతలువెలిగించు కార్తికాన

పరమశివునిముందు పరచగదీపాలు
చక్కగవెలిగెను సంధ్యవేళ

ధరణిదీపములన్ని దవళకాంతులతోడ
గగనగ్రహములను గాంచపోయె

కలవరపడుచును గ్రహములునిలబడె
అశ్చరపడుచును ఆగెనపుడు
                ఆ !
గ్రహములకధిపతియు గ్రహములతోబల్కె
కాంతిలొలుకుదీప కాంతులవియె
గతులుతప్పకుండ కదలమనంగానె
గ్రహములన్నికూడ కదలసాగె!!
      తరణికంటి సూర్యలక్ష్మి
                  *****
14
కవితా గానం-6 పోటీకి
అంశం : కార్తీక మాసం
శీర్షిక : *నదులన్నీ మేలుకుంటున్నాయి...!*


బ్రహ్మీ ముహూర్తములో
భక్తుల పవిత్ర స్నానాలకు
నదులన్నీ మేలుకుంటున్నాయి 
కదులుతున్న అలలు... దీపాలకు
అరటి దొప్పలవుతున్నాయి...!

కోనేరులు కళకళలాడేను
భక్తిరసాల తైల దీపాలతో 
శివాలయాలలో బిల్వార్చనలు
ఓంకారాలై ప్రతిధ్వనిస్తున్నాయి...!

అతివలు ఆర్తితో ఎదురు చూసిన 
కార్తీక పౌర్ణమి దీప్తులతో వచ్చింది
నెల రోజులంతా నెలతల లోకానికి
ముక్తి మార్గానికి సోపానమైంది...!

కఠోర దీక్షలకు కార్తీక మాసం విబూదులాయే
పూజలు, వనభోజనాలతో 
కార్తీకం కనువిందులాయే
మాసమంతా మహిళలు మౌన వ్రతాలే
భక్తుల దీప దానాలతో పార్వతీ పరమేశ్వరులు దివ్యంగా వెలిగేను...!

మన పాపాలను కడిగివేయు పరమశివుడు
మన అజ్ఞానాన్ని తొలగించు దిగంబరుడు
చిత్త శుద్ధితోడ దీపారాధన చేస్తే 
పోలిలాగ మనమూ బొందితో స్వర్గానికి వెళ్లొచ్చు...! 

సోమేశ్వరుడు చల్లగా దీవించు
భక్తజన కోటిని
కైలాసం వీడి ఇలాతలానికి వస్తాడు శివుడు చిద్విలాసాలతో
లయకారుడై ఆలయాలలో తిరుగుతాడు ఆదిభిక్షువుగా మారి...!

*జి.సూర్యనారాయణ,6281725659.*

ఆర్యా... సదరు కవిత నా సొంతం.దేనికీ అనువాదంలేదు.అనుకరణ కాదు.మీ పోటీకీ ప్రత్యేకంగా రాసానని హామీ యిస్తున్నాను.

జి.సూర్యనారాయణ,
   అవనిగడ్డ, కృష్ణాజిల్లా, ఏపీ
   6281725659.

15
పేరు కొంజేటి రాధిక 
జిల్లా 
*
అనంతపురం 
ఫోన్ 
*
9493273114
కవిత
*
కవితా గానం పౌర్ణమి కవితల పోటీకి గాను 
పేరు కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం 
అంశం.. కార్తిక మాసం 
శీర్షిక... హరిహర ప్రియం 

మనలోని అజ్ఞాన తిమిరాలైన అరిషడ్వర్గాలను రూపుమాపుకుని,
 జ్ఞాన జ్యోతిని ప్రజ్వలింప చేసుకునే మహిమాన్వితునిగా, మహోన్నతునిగా ఏదిగేందుకు అనువైన మాసం...
 సూర్యోదయాత్ పూర్వమే తులా రాశిలో స్నానం ముక్తికి పరమపద సోఫానం...
శుభప్రదమైన శివ కేశవులకు ప్రీతికరం, ఆధ్యాత్మిక సాధనకు అద్భుత సమయం... శివకేశవులకు సమాన ప్రాతినిథ్యం...
 సదాశివుని నివాసం శ్రీ హరి ఆవాసం అమ్మ లలితాదేవి సుమధుర మందహాసం కార్తీకం...
 శివ వైష్ణవ శాక్తేయులకు వరం, ప్రియ మోదం సమ్మోహనం ప్రమోదం పవిత్ర కార్తీకం...
 దీపారాధనలతో శివునకు ధారా దత్తం...
 నమక చమక నిత్యాభిషేకాలతో బిల్వార్చనలతో పరమేశ్వరనకు కైంకర్యం... ప్రతి నిత్యము ప్రాధాన్యతతో, దీపారాధనలతో జన్మను చరితార్థం చేసుకునే క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి, కృత్తికా నక్షత్రం తో కూడిన పుణ్యప్రదమైన మాసం
నదీ స్నానాలతో వన భోజనాలతో, సకల పాప హరణం...
 సకలార్థ సాధకం,
 దీప దాన జప తపాదులతో, నది సముద్ర స్నానాలతో జన్మను తరింప చేసుకునే మాసం...
 నిత్యము పర్వదినమై ప్రతి రోజు రెట్టింపు పుణ్యఫలాన్ని అందించే మాసం...
నూనె యందు లక్ష్మి,
 నీటి నందు గంగా ఆవాసమై,
  సకల పాప హరణం పునర్జన్మ రహితం కార్తీకం.

16*
మధు మోహన్ వుదయగిరి
జిల్లా 
*
మేడ్చల్ మల్కాజ్గిరి 
ఫోన్ 
*
9966460333
కవిత
*
దీపకాంతుల వెలుగుల మాసం

కార్తీక మాసం 
శివ విష్ణువులనారాధించే మాసం
మహిమాన్వితమైనది
శివకేశవులకు అత్యంత ప్రీతికరం ఈ మాసం

పార్వతీ పరమేశ్వరుల అర్ధ నారీశ్వర సాక్షత్కారం 
ఈ మాసపు అత్యున్నత ఆశీర్వాదం

నైవేద్యాలంకరణలు
హంగులు ఆర్భాటాలు 
ఏవీ ఆశించడటాయన
అభిషేక సమయాన
మనస్సులో భక్తి
గుండెల్లో ఆరాధనతో 
ధ్యానించే వారి వైపే 
చూస్తాడట శివయ్య 

సోదరి స్వహస్తాలతో వండి వడ్డించే శుద్ద తదియన 
బగనీ భోజనాలు ఆరగించే అత్యోత్తమ శ్రేష్ట మాసం

బంధు మిత్రుల వనభోజనాలకు
అత్యంత ప్రాముఖ్యత 
కలిగనదీ మాసం
స్కంద పురాణానుసారం
కార్తీక మాసానికి సమానమైన 
మాసమే లేదంటారు
ఈ మాసాన వెలిగించే 
కోటీ దీపాలు
కాలుశ్య నివారణకు ఎంతగనో ఉపయుక్తమని 
శాస్త్రీయత నిరూపణే సాక్ష్యం.
  ✍️మధుమోహన్ వుదయగిరి
17
 అంశం : కార్తీక మాసం 

 శీర్షిక : దీపాల సమ్మేళనం

 కలుష తలపులపై కత్తిగట్టి
 కరువు కంపను కాల్చేస్తూ
 కలతచీకట్లకు చురకబెట్టే
 ఆదిభిక్షువు ప్రీతికర శరాలు
 కార్తీకమాస దీపాలు
 అవనికి వరప్రసాదాలు
  కైలాస రాజుకు వసగే 
 బిళ్వపత్ర పూజలు
 కమలిన బతుకులకు
 స్వాంతననిచ్చు లేపనాలుగ
 ఆదిదంపతుల కటాక్ష వీక్షణాలతో
 మహీజనులకు మరులను అలము
 శుభాతిశుభ సమయాలే కదా
 కార్తీక మాస దినాలు
 అంతేనా శివకేశవులు ఏకకాలాన
 కైంకర్యాలను ఆస్వాదించుచు
 పాపకర్ములను ప్రక్షాళన చేసి
 కళంకితులను శుద్ధి చేయు
 పావన సుదినాలే అవి
 నెలరాజు శదృతువు చెలిమితో
 సోకులద్దుకునేది కూడా ఈ మాసానే
 పసుపు కుంకాలతో శాశ్వత తత్వాన్ని అలమి
 మగువ మదిని పునీతం చేసి
 మగని వాంఛాఫలాలు సఫలం చేసే 
 దీపాల సమ్మేళనమేనోయి
 హైందవజన సిరివాసం
 సౌభాగ్యమాన కార్తీకమాసం 
 


 హామీ పత్రం: ఈ కవిత నా సొంత రచన హామీ ఇస్తున్నాను.

 కవి : కూని అంకబాబు
 ఊరు : నెల్లూరు
 చరవాణి : 9640637991

18
*
తోట సులోచన 
జిల్లా 
*
నెల్లూరు 
ఫోన్ 
*
9490173053
కవిత
*
కవితా గానం సీజన్ -6
కవనజ్యోతి పౌర్ణమి పోటీలు
తేది 22-10-2025
అంశం కార్తీక మాసం /కార్తీక పౌర్ణమి 
శీర్షిక కార్తీక మాసం పరమ పావనం 

ఋతువులలో వసంతాని కెంత విశిష్టమో
కార్తీకానికి మాసాల్లో నంతకు మించి విశిష్టమే 
"శివాయ విష్ణు రూపాయ"యన్నట్లు 
కార్తీకానికి హరిహరుల మాసమని ప్రసిద్ధియే 

ఈ సమయంలో సూర్యుడు తుల, వృశ్చిక
రాసుల్లో సంచరిస్తే,
వెన్నెలరేడు కృత్తికా నక్షత్రంలో మెరుపులు 
చిందించు 
దీనితో భానుతేజం క్షీణించి,అస్తమయంతో
చిమ్మ చీకటి దట్టం కావడంతో జ్యోతులతో
ప్రకాశమే
కార్తీక మాస దీపాలతో నెలరోజులు పండుగే
వీధులన్నీ వెన్నెల కాంతులతో ఆహ్లాదమై,ఆనంద
దరహసమే 

ముక్కంటి ఆరాధనతో,అభిషేకాలతో శివాలయాలు
పులకించు
ఓంకార స్వరూపుడై మెరిసేటి ఈశ్వర కృప కోసం 
తెల్లవారు జామునే దీపాలతో నభిషేకాలు
గుప్పెడు నీటి అభిషేకంతో పొంగి పరవశించు 
చంద్ర శేఖరుడు
ఒక్క మారేడు దళంతో కోరిన కోర్కెలు దీర్చు
భోళా శంకరుడు
తలపై గంగమ్మతో, శిరస్సున చంద్రునితో
దేహంనిండా విభూతి రేఖలతో, సర్ప భూషణాలతో
కైలాస శిఖరాలపై కొలువుండు అర్ధనారీశ్వరుడు
ఆదిశక్తి స్వరూపమై, పార్వతిగా పతిలో
సగభాగమై 
మంగళ గౌరీ వ్రతాలతో ప్రీతి చెంది, సౌభాగ్య 
దాయినిగా 
కార్తీక పొర్ణమి రోజున పూజలతో సకల శుభాలనిచ్చే
తల్లి కాత్యాయిని
కార్తీక దామోదరునిగా పూజలందుకునే శ్రీ విష్ణువు
నాగుల చవితి నాడు వనితల ఆరాధనతో
సమస్త సంపదలను, సౌభాగ్యాలను ప్రసాదించు
నాగ దేవతలు.
ఎన్నో ఘనతలతో ఓం నమఃశివాయ ధ్వనులతో
మనసులు అమృత పానమే

 19
వేమూరి.సత్యవతి.
జిల్లా 
*
యన్.టి.ఆర్.జిల్లా
ఫోన్ 
*
9885136308.
కవిత
*
కార్తీక మాసం పౌర్ణమి కవితల పోటీలకోసం...
శీర్షిక.."కమనీయకార్తీకం"

వెన్నెల రేనితో కృత్తిక చెలిమి..
కార్తీకంగా..ఆకాశ దీపమవుతుంది!
నదీ తీరాల్లోస్నానాల సందడి.. 
కోనేటిపక్కకోవెలలో..ధ్వజస్థంభంవద్ద,
వేప,రావిసంగమంలో,తులసికోటనీడ..
శివ, కేశవ స్తోత్రాలుగా..మంత్రాలుగా..
సంధ్య వేళ గుమ్మం వద్దవెలిగేదీపంలో..
కార్తీకం కనిపించడం లేదూ?
నాగుల చవితనీ, ఏకాదశులనీ,
సోమవారాలనీ,పౌర్ణమిఉపవాసదీక్షలనీ ,
క్షీరాబ్ధిద్వాదశిగాజ్యోతులు, జ్వాలా తోరణం దాటటాలు
నరకబాధని దూరంచేసే విశ్వాసాలై..
కేదారేశ్వర-సత్యనారాయణవ్రతపు ప్రసాదాలుగా.,పళ్ళూ,పూలూ,టెంకాయలతో,  
లక్షపత్రి పూజలు,నమక చమకాలతో.. భజనలతో.. కార్తీకపురాణాలతో.. అభిషేకాలతో, నక్తాలూ, నైవేద్యాల..తో, కార్తీకమంతా ఆద్యంతం భక్తిభరిత మాసమే!
చరిత్రలో తొంగి చూస్తే.. ఈ శరచ్చంద్రికల్లోనే. .మధురభక్తికి మురిసి
నారీ నారీ నడుమ మురారి రాసలీలా వైభవంగా నడయాడినపరమాత్మ,!
అమావాస్య నాడు
ఆంక్షపెట్టినా..కాంక్షతో.. భవ్య దీపం వెలిగించి దివ్యవిమానమెక్కగలిగిన పోలమ్మ ..
ఎందరికో నిగ్రహాన్ని నేర్పుతూ...
భక్తితోమనసునీ, తనువునీ
పునీతం చేయగలశక్తి ఈ మాసానిది!!
ఆరాధన-ఆరోగ్యంకలిస్తేనే మరి కార్తీకం!
             *************
కమనీయ కార్తీకం అనే నా ఈ కవిత నా స్వంత రచన.
డా. వేమూరి సత్యవతి.
విజయవాడ.9885136308.

20

అంశం:--కార్తీక మాసం
తారీఖు:--23/10/2025
వారం:-- గురువారం
రచన:-- సింహాద్రి వాణి
శీర్షిక:--కార్తీక మాసం
ప్రక్రియ:-- వచన కవిత్వం
ఊరు:-- విజయవాడ 
చరవాణి:--7569820872

అన్ని మాసముల కంటె గొప్ప మహిమ గలది కార్తీకమాసం.
ఈ మాసంలో దీపకాంతుల వెలుగులు కనులవిందు చేస్తాయి.
శివపార్వతులను చిత్తశుద్దిగా కొల్చి‌వేడితే, కొరతలను తీర్చి వరాలను కురిపిస్తారు.
పసుపుకుంకుమలిచ్చి, పచ్చగా దీవించి, పిల్లా పాపలను చల్లగా కాపాడతారు.
ఈ మాసం హరిహరులిరువురికీ ప్రీతిపాత్రమైనది.
ఈ మాసంలో భక్తులు ఏకభుక్త, నిరాహార వ్రతాలను ఆచరిస్తారు.
సూర్యోదయానికి ముందే నదీస్నానం‌ అత్యంత పుణ్యప్రదం.
స్నానానంతరం తులసిమాత దగ్గర దీపాలను వెలిగించి పూజచేస్తారు.
ప్రదోషకాలం పరమేశ్వరుడు అర్థనారీశ్వరునిగా పూజలందే సమయం
ఆ కాలంలో శివారాధన, శివదర్శనం పుణ్యప్రదం.
ఈ మాసంలో భక్తులు ఆలయాల్లో రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, విశేషార్చనలు, జరుపుతారు.
ఈ మాసంలో శ్రీమహా విష్ణువుని దామోదరుడనని అంటారు.
కార్తీకంలో, 
హరిని తులసీదళాలతో పూజిస్తే ముక్తి లభిస్తుందని పెద్దలు చెప్తారు.
సత్యన్నారాయణ వ్రతం, విష్ణుసహస్ర నామ పారాయణం చేస్తారు.
దైవసన్నిధి యందు ధ్వజస్థంభము పైన ఆకాశదీపం అద్భుతంగా దేదీప్యమానంగా దివ్య తేజము లొల్కుతూ, పాప పరిహారం చేస్తూ భక్తులకు‌ దర్శన మిస్తుంది. 
జ్వాలాతోరణము క్రింద నుంచి దూరి వెళ్ళిన భక్తులకు స్వర్గలోకం ప్రాప్తిస్తుందనీ,
కార్తీకమాసంలో‌దేవుని సన్నిధిలో‌ దీపదానమిస్తే సర్వశుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

హామీ:-- ఇది నా స్వీయ రచన.

21
అంశం కార్తీక పౌర్ణిమ 
వాణిసరోజిని లక్కరాజు 

కృత్తికా నక్షత్ర ముతోకూడి వచ్చిన 
మాసముకార్తీకము 

మాసాలన్నిటిలో విశేష పుణ్యప్రదం 
శీఘ్రఫలప్రదం .

 కార్తీకంలో పౌర్ణిమికి,ఘనమైన ప్రత్యేకత.
సూర్యోదయానికి పూర్వం నదీ సముద్ర జలాలలో అఘమర్షణస్నానం 

లేలేతకిరణాల తళతళలలో, విద్యుత్తరంగాల 
మిలమిలలు శరీరానికి స్వాంతన చేకూర్చే
ఆరోగ్య ప్రదాయకలు .

శివాభిషేకం, ఉపవాసం, పురాణ పఠనం, 
ఆలయదర్శనం. అనంత సౌభాగ్యమిచ్చి మనఃశాంతిని ప్రసాదిస్తాయి. 

యధాశక్తి దీపదానం, వస్త్ర దానం అన్నదానం 
విశేష ఫలదాయకం 

శివ,విష్ణవు లిరువురి, ఆరాధన కార్తీకమాస ప్రత్యేకత .
విష్ణువు అలంకార ప్రియుడైతే, శివుడు అభిషేక ప్రియుడు 
ఉధ్ధరిణెడు జలంతో మనల వుధ్ధరిస్తాడు శివుడు 
ఎంత అలంకారంచేస్తే అంతసంతసిస్తాడు మాధవుడు .
ఆలయంలో ముగ్గులువేసి పసుపు, కుంకుమ, పూలతో, అలంకరించి, ప్రమిదలో 360వత్తులువేసి 
దీపారాధనతో శివ,పార్వతుల అర్చన కార్తీక పౌర్ణిమ ప్రత్యేకత. 
ఉసిరిక చెట్టుక్రిందదీపారాధన బ్రాహ్మణోత్తములకు యధాశక్తి దీపదానం విశిష్ట ఫలప్రదం .
కార్తీక సమారాధన సమత ,సర్వమానవ సౌభాతృత్వానికి ప్రతీక .
నాల్గుసోమవారాలు,పౌర్ణిమ, ఏకాదశ ఉపవాసదీక్ష
ఉత్తమగతులప్రాప్తి. 
, నత్తాలు పేరుతో, ఒంటిపూట, భోజనం పొద్దుతక్కువకాలంలో ఆరోగ్యానికి, హేతువు. 
సర్వవిధుల శ్రేయోదాయి చక్కని కార్తీకం .

స్వీయరచన

22 
*
మధు అమరగాని 
జిల్లా 
*
సిద్దిపేట 
ఫోన్ 
*
9177860792
కవిత
*
కార్తీక పౌర్ణమి 

వెలుగులు పొంగేటి కార్తీక రాత్రి
నిలువెల్ల నిండిన జాబిల్లి భూతల్లి
దీపాల వెలుగులో దేవళాలు
గలగలా పారేటి గంగలో తనాలు 
భక్తితో చేసేటి హరిహరుల గానాలు 

కార్తీక వెలుగు కాదది కారు చీకట్లను చీల్చే పలుగు 
తులసీ దళాలతో తుంబుర నాదాలతో
ఓం నమశ్శివాయ అని కదిలేటి ఎదలు 
కలిగించును భవిష్యత్తు తరాలకు 
కమనీయమైన సనాతన సంస్కృతి సొదలు

ప్రతి దీపం ఒక సత్య జ్వాల
శివుని నామం ప్రతి ఊపిరి తాల
కార్తీక పౌర్ణమి రాత్రి పావనమై
మనసును పునీతం చేసుకొనే వేళ

 కాలభైరవుని కరుణకిరణాలు
కైలాసేశుని కటాక్షస్మితాలు
నీలకంఠుని రూపం నిండు చందమామ తాపం 
ప్రతి ఇంటి గడపలో వెలుగును కార్తీక దీపం
               మధు అమరగాని

 23
పేరు 
*
Nelluru Venkata lakshmi 
జిల్లా 
*
Kurnool 
ఫోన్ 
*
9491632232
కవిత
*

మెల్లిగా శీతల పవనాలు
మంచుతో జతగట్టి
శరాల్లా దూసుకు వస్తున్నాయి
పరమపవిత్ర కార్తీకానికి
స్వాగతం అంటున్నాయి
శివకేశవులకు ప్రీతికరమగు
దివ్యమైన పుణ్యమాసం 
కార్తీక స్నానాలు
పురాణ పఠనాలు
ఉపవాస దీక్ష లు
వనభోజనాలు
వ్రతాలు అభిషేకాలు
దీపాశిఖ కాంతులతో
ఆధ్యాత్మికతను సంతరించు
మాసం కార్తీకం
శివనామ స్మరణతో
ప్రతీ పుణ్యక్షేత్రం
పులకించి పరవశించిపోతుంది
భక్తుల ప్రతీ మది
స్వచ్ఛంగా అలరారుతుంది

24

అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
అంశం:-కార్తీక పౌర్ణమి
శీర్షిక:- జీవన్ముక్తికి సోపానం
............... ...............
అతి పవిత్ర కార్తీకమాసంలో
కార్తీకేయుడు తారకాసురుని సంహరించినరోజు
అసురుని బాధలనుండి విముక్తిచెంది
ఆనందోత్సాహాలతో దీపాలను ప్రజలు వెలిగించినరోజు
హరిహరులిరువురికి ప్రీతికరమైన రోజు
కార్తీకపౌర్ణమి నాడు మహిళలు 
దీపాలను అరటి దొప్పలలో వెలిగించి
నదులలో చెరువులలో వదిలిన
సౌభాగ్యాన్ని కలిగించునన్నది ఆది శంకరులు చెప్పినది
మూడు వందల ఆరవై ఐదు వత్తులను గోమాత నేతిలో ఉంచి వెలిగించిన
మోక్షం లభించునని దేవాలయ ప్రాంగణంలో
గృహాలలో పవిత్ర తులసికోట వద్ద ఉంచిన
పాపాలు పోవునని స్త్రీ పురుషులు భక్తి శ్రద్ధలతో ఆరాధించే పవిత్రరోజు
'నమః శంభవేచ మయోభవేచ
నమః శంకరాయచ మయస్కరాయచ
నమః శివాయచ
శివతరాయచ'అని
శివాభిషేకం పుణ్యప్రదం
సాయం సమయంలో
పౌర్ణమి నాడు దేవాలయ ప్రాంగణంలో
'జ్వాలా తోరణం' వెలిగించి
దాని క్రింద నుంచి వెళ్ళిన 
జీవన్ముక్తి కలుగునన్నది ప్రతీక
అందుకే కార్తీక పౌర్ణమి పరమ పవిత్రం శుభప్రదం..!!
...........................
అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
9963265762.
........................

Comments

Popular posts from this blog

సింధూరం 07052025

****************** సింధూరం దిద్దిన వారు  1.వీరా గుడిపల్లి 2.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, 3.గొర్రెపాటి శ్రీను  4.దోసపాటి వేంకట రామచంద్రరావు  5.అపరాజిత్ 6.వేమూరి సత్యవతి  7.జ్యోతి  8.మండ నాగేశ్వరరావు  9.గడ్డం కృష్ణారెడ్డి.రేపాల.సూర్యాపేట 10.కవిత వెంకటేశ్వర్లు  11.ఆర్ వి వి రాజా  12. శ్రీ కోరాడ నరసింహారావు గారు  13. శ్రీ ఉదయగిరి మధుమోహన్ గారు  14. శ్రీమతి బల్లూరి ఉమాదేవి గారు  15. శ్రీమతి తోట సులోచన గారు  16. శ్రీ జి సూర్యనారాయణ గారు  17. శ్రీ గజవెల్లి శ్రీనివాస చారి గారు  18. శ్రీ వనపర్తి గంగాధర్ గారు  19. శ్రీమతి వాణి సరోజిని లక్కరాజు గారు  20. శ్రీమతి సింహాద్రి వాణి గారు 21. శ్రీ ఆచార్య అయ్యల సోమయాజులు ప్రసాద్ గారు  22. 23.శ్రీమతి నెల్లూరు వేంకటలక్ష్మి గారు 24.శ్రీ ఏడెల్లి రాములు గారు  25. శ్రీమతి డాక్టర్ తంగిరాల నాగలక్ష్మి గారు  26. శ్రీ కూని అంకబాబు గారు  27. శ్రీ తిన్నాక నాగేశ్వరరావు గారు  28. శ్రీమతి లలితా చంటి గారు  29. శ్రీ పిల్ల వెంకటరమణ మూర్తి గారు  30. ...

season 6 వైశాఖ పూర్ణిమ

కవనజ్యోతి,కవితాగానం సీజన్ 6  వైశాఖ పౌర్ణమి నగదు పోటీలు   పోటీకి కవితలు పంపించిన కవి వరుల జాబితా  1. శ్రీ పిళ్ళావెంకటరమణ మూర్తి గారు  2. శ్రీ సంగీతం సంతోష్ కుమార్ గారు ji 3. శ్రీ జి సూర్యనారాయణ గారు  4.శ్రీ మండ నాగేశ్వరరావు గారు 5.శ్రీమతి కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  6.శ్రీమతి నెల్లూరు వెంకటలక్ష్మి గారు 7.శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 8..శ్రీ కోరాడ నరసింహ రావు గారు  9.శ్రీమతి డాక్టర్ భమిడిమర్రి కమలాదేవి గారు 10.శ్రీ కాసుల ధీరజ్ శర్మ గారు  11.శ్రీ కూని అంకబాబు గారు 12.శ్రీ మతి డా.వేమూరి సత్యవతి గారు  13.శ్రీమతి డా.బల్లూరి ఉమాదేవి గారు 14.శ్రీ.దోసపాటి వేంకట రామచంద్రరావు గారు 15.శ్రీ అపరాజిత రెడ్డి గారు  16. శ్రీ ఏడెల్లి రాములు గారు  17.శ్రీ డాక్టర్ ఆళ్ళ నాగేశ్వరరావు గారు  18. శ్రీ కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  19. శ్రీ మద్ది పుల్లారావు గారు  20.శ్రీమతి సింహాద్రి వాణి గారు  21. శ్రీ డా.దీపక్ న్యాతి గారు  22. శ్రీ ఆర్.వి.వి.రాజా గారు  23.శ్రీమతి వాణీ సరోజినీ లక్కరాజు గారు...

వీడ్కోలు ఆషాఢమాసం పౌర్ణమి

అంశం: వీడ్కోలు  సందర్భం: ఆషాఢమాసం పౌర్ణమి  నిర్వహణ:  వీరా గుడిపల్లి లలితాకృష్ణ  ################## కవివరుల జాబితా  1.పిళ్ళా వెంకట రమణమూర్తి గారు  2. జి.సూర్యనారాయణ గారు  3.మండ నాగేశ్వరరావు గారు  4.డా‌.బల్లూరి ఉమాదేవి గారు  5. డా.కమలాదేవి గారు  6.గొర్రెపాటి శ్రీను గారు  7.వేమూరి సత్యవతి గారు  8.కూని అంకబాబు గారు  9.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  10.కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  11.తోట సులోచన గారు  12.వాణిసరోజిని లక్కరాజు గారు  13. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు  14.అపరాజిత రెడ్డి గారు 15.లలితాచండి గారు 16. నెల్లూరు వెంకటలక్ష్మి గారు  17.కమలశ్రీ గారు  18.రాధిక గారు 19.చంద్రమౌళి గారు  20.శ్రీకాంత్ గారు  21.సింగీతం సంతోష్ కుమార్ గారు  22.. దారల విజయ కుమారి గారు  23.ఎన్.నరేశ్ చారి గారు  24. పిన్నక నాగేశ్వరరావు గారు  25.సింహాద్రి వాణి గారు  26.ఏడెల్లి రాములు గారు  27.కొంజేటి రాధిక గారు  ++++++++++++++++++++++++++++++++ ఆషాడ మ...